UNESCO: మోస్ట్‌ సెర్చ్‌ జాబితాలో తాజ్‌మహల్‌ నంబర్‌ వన్‌.. మిగతా వారసత్వ ప్రదేశాలు ఇవే

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటైన ‘తాజ్‌మహల్‌’కు విశేష గుర్తింపు దక్కింది. ప్రముఖ ట్రావెల్‌ వెబ్‌సైట్‌ ‘జిటాంగో’ వివరాల ప్రకారం.. మార్చి నెలలో ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో అత్యధికంగా శోధించిన వారసత్వ సంపదల జాబితాలో...

Published : 14 May 2022 02:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటైన ‘తాజ్‌మహల్‌’కు విశేష గుర్తింపు దక్కింది. ప్రముఖ ట్రావెల్‌ వెబ్‌సైట్‌ ‘జిటాంగో’ వివరాల ప్రకారం.. మార్చి నెలలో ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో అత్యధికంగా శోధించిన వారసత్వ సంపదల జాబితాలో ఈ పాలరాతి స్మారక కట్టడం మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఒకే నెలలో దాదాపు 14 లక్షలకుపైగా ఈ నిర్మాణం గురించి ఆన్‌లైన్‌లో వెతికారు. మొఘలుల నిర్మాణ శైలికి గొప్ప ఉదాహరణగా నిలిచే ఈ కట్టడాన్ని.. షాజహాన్‌ తన భార్య ముంతాజ్‌ జ్ఞాపకార్థం ఆగ్రాలో నిర్మించాడు. ప్రపంచ ఏడు వింతల్లో ఇదీ ఒకటి. ఇదిలా ఉండగా.. యునెస్కో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 1,154 ప్రదేశాలను వారసత్వ సంపదగా గుర్తించింది.

పెరూ దేశంలోని మాచు పిచ్చు రెండో స్థానంలో నిలిచింది. దీనికి దాదాపు 11 లక్షల సెర్చ్‌లు నమోదయ్యాయి. అండీస్ పర్వతాల్లో నది లోయపైన సముద్ర మట్టానికి 7900 అడుగులకుపైగా ఎత్తులో నిర్మించిన కోట ఇది. 15వ శతాబ్దంలో కట్టినట్లు భావిస్తారు. అడుసు ఉపయోగించకుండా రాతి గోడలను నిర్మించడం గమనార్హం.

82 వేలకు పైగా శోధనలతో మూడో స్థానంలో బ్రెజిల్‌లోని రియో డి జనిరో ఉంది. దేశంలో రెండో అత్యధిక జనాభా కలిగిన నగరం ఇది. 2012లో ఇందులో కొంతభాగాన్ని యునెస్కో ప్రపంచ సాంస్కృతిక వారసత్వ ప్రదేశంగా గుర్తించింది. ఏడు వింతల్లో ఒకటైన ‘క్రైస్ట్ ది రిడీమర్’ విగ్రహం ఇక్కడే ఉంది.

అమెరికాలోని ఎల్లోస్టోన్‌ పార్క్‌ ఓ జాతీయ ఉద్యానవనం. దీని గుండా ఎల్లోస్టోన్‌ నది పారుతుండటంతో.. ఆ పేరు వచ్చింది. వేడి నీటి బుగ్గల(హాట్‌ స్ప్రింగ్స్‌)కు పేరొందిన ప్రదేశం. అనేక జీవజంతుజాలానికి నెలవు ఈ పార్కు. 79 వేల సెర్చ్‌లు నమోదయ్యాయి.

ఇంగ్లాండ్‌ విల్ట్‌షైర్‌లోని సాలిస్‌బరీ మైదాన ప్రాంతంలో నెలవైన కట్టడం ‘స్టోన్‌హెంజ్‌’. బ్రిటన్‌ సాంస్కృతిక చిహ్నం ఇది. రింగ్‌ ఆకృతిలో నిటారుగా నిలబెట్టిన పొడవైన భారీ రాళ్లు, వాటిపై అడ్డంగా పేర్చిన రాతి పలకలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. బ్లూస్టోన్స్‌తో లోపల మరో రింగ్‌, ఇతర నిర్మాణాలు ఉంటాయి. క్రీ.పూ 3000 నుంచి క్రీ.పూ 2000 వరకు వరకు దీని నిర్మాణం సాగినట్లు సమాచారం. 78 వేలకుపైగా దీని గురించి వెతికారు.

స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ గురించి నెట్టింట 75 వేలసార్లకుపైగా వెతికారు. అమెరికా న్యూయార్క్‌లోని లిబర్టీ ఐలాండ్‌ ఉంటుందిదీ. చేతిలో కాగడాను పట్టుకుని ఠీవీగా కనిపించే ఈ 151 అడుగుల విగ్రహాన్ని.. ఫ్రాన్స్‌ అమెరికాకి బహుమతిగా ఇచ్చింది. వాస్తవానికిది రోమన్‌ దేవత. దీన్ని స్వేచ్ఛ, ప్రజాస్వామ్యాలకు గుర్తుగా భావిస్తారు.

57 వేలకుపైగా సెర్చ్‌లతో పెట్రా నగరం ఏడో స్థానంలో నిలిచింది. జోర్డాన్‌ దేశంలోని ఓ పురాతన నగరం ఇది. అద్భుతమైన రాక్‌-కట్‌ ఆర్కిటెక్చర్‌, ఎడారి ప్రాంతంలోనూ ప్రత్యేక నీటి నిర్వహణ వ్యవస్థ దీని సొంతం. అప్పట్లో ఇది ప్రముఖ వాణిజ్య కేంద్రంగా అలరారినట్లు చరిత్ర చెబుతోంది. 1985లో యునెస్కో గుర్తింపు దక్కింది.

వాయువ్య ఇటలీలోని ఓ తీర ప్రాంతం ‘సిన్క్యూ టెర్రే’. సిన్క్యూ టెర్రే.. అంటే ఐదు ప్రాంతాల సముదాయం అని అర్థం. మోంటెరోసో అల్ మేర్, వెర్నాజ్జా, కార్నిగ్లియా, మనరోలా, రియోమాగ్గియోర్ గ్రామాలు కలిసి ఉంటాయి. కఠిన శిఖర ప్రాంతాల్లో ఏటవాలుగా నిర్మించిన ఇళ్లు, సన్నని దారులు ముచ్చటగొల్పుతాయి. 55 వేలసార్లు దీని గురించి సెర్చ్‌ చేశారు.

ఫ్రాన్స్‌లోని వెర్సైల్స్‌ ప్యాలెస్.. మాజీ రాజ నివాసం. పారిస్‌కు 19 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్యాలెస్ ఫ్రెంచ్ రిపబ్లిక్ యాజమాన్యంలో ఉంది. 1995 నుంచి దేశ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నారు. ఏటా 1.50 కోట్ల మంది పర్యాటకులు దీన్ని సందర్శిస్తారు. ఈ కట్టడం విషయంలో 46 వేలకుపైగా శోధనలు నమోదయ్యాయి.

మెక్సికోలోని చిచెన్‌ ఇట్జా నగరం.. మాయన్‌ నాగరికత కాలం నాటిది. టెంపుల్ ఆఫ్ కుకుల్కాన్‌గా పేరొందిన ఓ పిరమిడ్ నిర్మాణం.. ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. 44 వేలకుపైగా సెర్చ్‌లతో పదో స్థానంలో నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు