Supreme Court: న్యాయవాదికి సుప్రీం బెయిల్‌ నిరాకరణ

ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సూరత్‌కు చెందిన న్యాయవాది ఉబేద్‌ అహ్మద్‌కు బుధవారం 

Published : 21 Oct 2021 15:09 IST

దిల్లీ: ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సూరత్‌కు చెందిన న్యాయవాది ఉబేద్‌ అహ్మద్‌కు బుధవారం సుప్రీంకోర్టు బెయిల్‌ నిరాకరించింది. ఆరోపణలు తీవ్రమైనవని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం తెలిపింది. అయితే ఆయన 2017 నుంచి జైలులో ఉన్న విషయాన్ని పరిగణనలోకి తీసుకొని విచారణను ఏడాదిలోగా పూర్తి చేయాలని ట్రయల్‌ కోర్టుకు సూచించింది. వారానికి రెండు రోజుల పాటు విచారణ జరపాలని, అనవసర వాయిదాలు ఇవ్వకూడదని తెలిపింది.

సీబీఐ డైరెక్టర్‌ నియామకంపై ఉత్తర్వులు ఇవ్వలేం

సీబీఐ డైరెక్టర్‌ నియామకాల వ్యవహారంపై ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే ఈ పదవి విషయంలో తాత్కాలిక నియామకాలు కూడదంటూ దాఖలైన వ్యాజ్యంపై సమాధానం ఇవ్వాలని జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌లతో కూడిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుత డైరెక్టర్‌ పదవీ కాలం ముగియడానికి ఒకటి రెండు నెలల ముందే నూతన డైరెక్టర్‌ ఎంపిక ప్రక్రియను ప్రారంభించేలా ఆదేశించాలని కోరుతూ కామన్‌ కాజ్‌ అనే స్వచ్ఛంద సంస్థ వ్యాజ్యం దాఖలు చేసింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తాత్కాలిక డైరెక్టర్‌ను నియమించే బదులు, ప్రస్తుత డైరెక్టర్‌నే కొనసాగించడం మంచిదని ఆ సంస్థ తరఫు న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ సూచించారు. దీనిపై సమాధానం చెప్పేందుకు సమయం కావాలని అటార్నీ జనరల్‌ కోరడంతో తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది. 

ఆసారాం బాపు కుమారునికి సెలవు తిరస్కరణ

అత్యాచారం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ప్రవచనకర్త ఆసారాం బాపు కుమారుడు నారాయణ సాయికి 14 రోజుల సెలవు మంజూరు చేయడాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీర్ఘకాలంపాటు జైలు శిక్ష అనుభవిస్తున్న వారు కుటుంబ సభ్యులతో గడిపేందుకు సెలవు ఇస్తుంటారు. ఇందుకు గుజరాత్‌ హైకోర్టు అంగీకరించింది. ఆయనకు, ఆసారాం బాపునకు ప్రజాకర్షణ అధికంగా ఉన్నందున వారు సెలవుపై వెళ్తే ఇబ్బందులు వస్తాయని భావించి సుప్రీం దానిని తిరస్కరించింది.

నీట్‌పై వ్యాజ్యం తిరస్కరణ

నీట్‌-యూజీలో జరిగిన అక్రమాలపై దర్యాప్తు జరిపించాలన్న వ్యాజ్యాన్ని బుధవారం సుప్రీంకోర్టు తిరస్కరించింది. వేలాది మంది విద్యార్థులకు సంబంధించిన ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంటే చివరకు అది గందరగోళానికి దారితీస్తుందని జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. సెప్టెంబరు 12న జరిగిన ఈ పరీక్షలో అక్రమాలు జరిగాయంటూ పలు చోట్ల కేసులు నమోదయ్యాయని, అందువల్ల వీటిపై నిజానిజాలను నిర్ధారించేలా దర్యాప్తు చేయించాలని పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది సల్మాన్‌ ఖుర్షీద్‌ తెలిపారు. తాము పరీక్షలను రద్దు చేయాలని కోరడం లేదని, అక్రమాలను వెలుగులోకి తేవాలని మాత్రమే అడుగుతున్నామని చెప్పారు. అయితే ఇందుకు ధర్మాసనం సుముఖత వ్యక్తం చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని