Video: జంతువులే ఆశ్చర్యపోయేలా ‘జూ’లో కొట్టుకున్నారు!

అప్పటివరకు ఆహ్లాదకరంగా ఉన్న ఆ జూ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పక్కపక్కనే నడుస్తూ వెళ్తున్న పర్యాటకులు ఒక్కసారిగా ఒకరిపై ఒకరు మీద పడి కొట్టుకోవడం మొదలుపెట్టారు....

Published : 10 Aug 2021 01:48 IST

జీబింగ్‌: అప్పటివరకు ఆహ్లాదకరంగా ఉన్న ఆ జూ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పక్కపక్కనే నడుస్తూ వెళ్తున్న పర్యాటకులు ఒక్కసారిగా ఒకరిపై ఒకరు మీద పడి కొట్టుకోవడం మొదలుపెట్టారు. ఇద్దరి మధ్య మొదలైన గొడవ.. రెండు కుటుంబాలు తీవ్రస్థాయిలో కొట్టుకునే వరకు దారితీసింది. మహిళలు ఒకరి జుట్లు ఒకరు పట్టుకుని నేల మీద ఈడ్చుకుంటూ కాళ్లతో తన్నుకున్నారు. ఈ ఘటనతో ఇతర పర్యాటకులు షాక్​కు గురయ్యారు. చివరికి అక్కడే ఉన్న కొన్ని జంతువులు కూడా వారి ఘర్షణను చూస్తూ ఉండిపోయాయి. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్​గా మారింది.

చైనా రాజధాని బీజింగ్‌లోని​ వైల్డ్​లైఫ్​ పార్క్​లో ఆదివారం సందడి వాతావరణం నెలకొంది. ప్రజలు పెద్దఎత్తున జూలోని జంతువులను చూసేందుకు తరలివచ్చారు. అయితే ఇద్దరు సందర్శకుల మధ్య గొడవ మొదలైంది. అదికాస్తా రెండు కుటుంబాలు కొట్టుకునే స్థాయికి వెళ్లింది. రెండు గ్రూపులుగా విడిపోయిన మహిళలు నేల మీద పడిపోయి జుట్లు పట్టుకుని ఘర్షణ పడుతుండగా.. ఓ వ్యక్తి వచ్చి చంటి పిల్లాడు చేతిలో ఉన్న మహిళను కాలితో గట్టిగా తన్నిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. చివరికి జూలోని భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపుచేశారు. అయితే గొడవకు గల కారణాలు తెలియలేదు.

ఈ గొడవను అక్కడే ఉన్న పర్యాటకులే కాదు.. చివరికి జంతువులు కూడా నిలబడి చూస్తూ ఉండిపోయాయని జూ యాజమాన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ ఘటన జంతువులపై ప్రభావం చూపించినట్టు పేర్కొంది. మనుషులను అనుకరిస్తూ.. జంతువులు కూడా రాత్రి ఒకదానిపై మరొకటి గొడవకి దిగినట్టు పేర్కొంది. పర్యాటకుల గొడవపై నెటిజన్లు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని