Nandigram: నందిగ్రామ్‌ ఎన్నికపై ఈసీకి నోటీసులు

పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఓటమిపాలైన నందిగ్రామ్‌ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు, పేపర్లను భద్రపరచాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది.....

Published : 14 Jul 2021 16:33 IST

ఆ ఈవీఎంలను భద్రపరచాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశం

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఓటమిపాలైన నందిగ్రామ్‌ ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలు, పేపర్లను భద్రపరచాలని కోల్‌కతా హైకోర్టు ఆదేశించింది. వాటిని సురక్షితంగా ఉంచాలని ఎన్నికల సంఘానికి సూచించింది. భాజపా నేత సువేందు అధికారి గెలుపును సవాల్‌ చేస్తూ దీదీ జూన్‌లో కోల్‌కతా హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ షంపా సర్కార్‌ బుధవారం ఆన్‌లైన్‌లో విచారణ చేపట్టగా..  దీదీ హాజరయ్యారు. ఈ వ్యవహారంపై ఎన్నికల సంఘం, రిటర్నింగ్‌ అధికారికి నోటీసులు జారీచేయనున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. తదుపరి విచారణను ఆగస్టు 12కి వాయిదా వేశారు.

మరోవైపు, నందిగ్రామ్‌లో సువేందు అధికారి గెలుపును సవాల్‌ చేస్తూ దీదీ వేసిన పిటిషన్‌ తొలుత జస్టిస్‌ కౌశిక్‌ చందా ధర్మాసనం ముందుకు వచ్చింది. అయితే, ఆయనకు గతంలో భాజపాతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించడంతో పాటు, తీర్పు నిష్పాక్షికంగా ఉండదేమోనని అనుమానం వ్యక్తంచేస్తూ దీదీ మరో పిటిషన్ వేశారు. దీంతో ఇటీవల ఆయన విచారణ నుంచి తప్పుకోవడంతో పాటు తీర్పును ప్రభావితం చేసేలా పిటిషన్‌ వేసినందుకు సీఎం మమతకు రూ.5లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే. భాజపా తరఫున పలు కేసులు వాదించానే తప్ప, ఆ పార్టీ లీగల్‌ సెల్‌ కన్వీనర్‌గా ఎప్పుడూ పనిచేయలేదని ఆయన అన్నారు. పాత అనుబంధాల కారణంగా తగిన తీర్పు ఇవ్వలేనని అనుమానించడం తగదని కౌశిక్‌ చందా పేర్కొన్నారు.

రేపు ఈసీని కలవనున్న తృణమూల్‌ బృందం
తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతల బృందం గురువారం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలవనున్నారు. కరోనా పరిస్థితి గణనీయంగా తగ్గినందున  బెంగాల్‌లో పెండింగ్‌లో ఉన్న ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్‌ చేయనున్నారు. నందిగ్రామ్‌లో సీఎం మమతా బెనర్జీ భాజపా నేత సువేందు అధికారి చేతిలో ఓటమిపాలవ్వడంతో రాష్ట్రంలో ఉప ఎన్నికలు కీలకంగా మారాయి. రాజ్యాంగ నిబంధనల ప్రకారం.. దీదీ సీఎంగా కొనసాగాలంటే నవంబర్‌ 4 నాటికి ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నిక కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో బెంగాల్‌లో ఉప ఎన్నికలు నిర్వహించాలని నేతల బృందం ఈసీని కోరనుంది. ఎన్నికల సంఘం ఉప ఎన్నికలను ఆలస్యం చేస్తోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత, రాజ్యసభలో ఆ పార్టీచీఫ్‌ విప్‌ సుఖేందు శేఖర్‌ రాయ్‌ ఆరోపించారు.  థర్డ్‌వేవ్‌ కోసం ఎదురుచూస్తున్నారా? అని ప్రశ్నించారు. సాధ్యమైనంత త్వరగా ఉప ఎన్నికలు నిర్వహించాలని తాము కోరుకుంటున్నట్టు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు