Jayalalithaa: జయలలిత ‘వేదనిలయం’ తాళాలు.. చివరకు వారి చేతికి!

వేద నియలం తాళాలను జయలలిత వారసులకు అందించాలని న్యాయస్థానం ఆదేశాల మేరకు తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జయలలిత మేనకోడలు దీపకు వేద నిలయం ఇంటి తాళాలను అందజేసింది.

Updated : 11 Dec 2021 12:20 IST

చెన్నై: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నివసించిన పోయెస్‌ గార్డెన్‌లోని ‘వేద నిలయం’ ఎవరికి చెందుతుందనే విషయంపై నెలకొన్న సందిగ్ధతకు ఎట్టకేలకు తెరపడింది. వేద నియలం తాళాలను జయలలిత వారసులకు అందించాలని న్యాయస్థానం ఆదేశాల మేరకు తమిళనాడు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జయలలిత మేనకోడలు దీపకు వేద నిలయం ఇంటి తాళాలను అందజేసింది.

చివరకు వేదనిలయం తాళాలు వారికి చెందడంపై జయలలిత మేనకోడలు దీప స్పందించారు. ‘ఇది మామూలు విజయం కాదు. జయలలిత మరణం తర్వాత ఆ ఇంటిలోకి తొలిసారి అడుగుపెట్టడం ఎంతో సంతోషంగా ఉంది. నేను ఈ ఇంటిలోనే జన్మించాను. అత్త జయలలితతో ఈ ఇంటిలో గడిపిన ఎన్నో జ్ఞాపకాలతో నా మనస్సు నిండిపోయింది’ అని దీప పేర్కొన్నారు. ఆమె భర్త మాధవన్‌తో పాటు మరికొంతమంది సన్నిహితులతో వేదనిలయంలోకి అడుగుపెట్టిన దీప.. జయలలిత చిత్రపటానికి నివాళులు అర్పించారు. ఇది జయలలిత సొంత నివాసమని.. దీనిపై ఎటువంటి రాజకీయాలూ అవసరం లేదని దీప స్పష్టం చేశారు.

మాజీ ముఖ్యమంత్రి జయలలిత నివాసాన్ని ప్రభుత్వ పరం చేసుకునేందుకు గత అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా దాన్ని స్మారకంగా మార్చాలని నిర్ణయించింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జయలలిత మేనకోడలు దీప, మేనల్లుడు దీపక్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన మద్రాసు హైకోర్టు .. వేదనిలయాన్ని మెమోరియల్‌గా మార్చేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు చెల్లవని, దాన్ని రద్దు చేస్తూ ఈమధ్యే ఆదేశాలు జారీ చేసింది. ఆ ఇంటిని జయలలిత వారసులైన దీప, దీపక్‌కు అప్పగించాలని స్పష్టం చేసింది. దీంతో మరోసారి చర్చించిన ప్రభుత్వం.. హైకోర్టు ఆదేశాల మేరకు వేద నిలయాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే వేద నిలయం తాళాలను జయలలిత మేనకోడలు దీపకు చెన్నై కలెక్టర్‌ విజయరాణి అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని