Parliament: 14 నెలల్లో 110 యూట్యూబ్‌ ఛానెళ్లపై వేటు

డిసెంబరు 2021 నుంచి ఇప్పటి వరకు 110 యూట్యూబ్‌ ఛానెళ్లపై నిషేధం విధించినట్లు కేంద్ర సమాచార, బ్రాడ్‌కాస్టింగ్‌ శాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ (Anurag thakur) తెలిపారు.

Published : 22 Mar 2023 00:47 IST

దిల్లీ: భారత సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరించిన 110 యూట్యూబ్‌ ఛానెళ్లు, 248 యూఆర్‌ఎల్‌లను నిషేధించినట్లు సమాచార, ప్రసారశాఖ మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. డిసెంబరు 2021 నుంచి ఇప్పటి వరకు సేకరించిన సమాచారం ఆధారంగా లోక్‌సభలో ప్రతిపక్ష సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. మరోవైపు గత ఐదేళ్లలో చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన ఎంతమంది పాత్రికేయులపై కేసులు నమోదు చేశారో తెలపాలంటూ కాంగ్రెస్‌ సభ్యుడు ప్రద్యుత్‌ బోర్దోలోయ్‌ అడిగిన ప్రశ్నకు కూడా మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ సమాధానమిచ్చారు. జర్నలిస్టులకు ప్రత్యకేంగా నేషనల్‌ క్రైం బ్యూరో రికార్డు నిర్వహించడం లేదని చెప్పారు. 

భారత రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్‌ ప్రకారం..‘పోలీస్‌, పబ్లిక్‌ ఆర్డర్‌’ అనేవి రాష్ట్రానికి సంబంధించిన అంశాలని, నేరాలను గుర్తించడం, వాటిని దర్యాప్తు చేసి కోర్టుల ద్వారా వాళ్లకు శిక్షపడేలా చేయడం రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత అని అనురాగ్ ఠాకూర్‌ తెలిపారు. అంతేకాకుండా ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరోలో నిజనిర్ధారణ విభాగం దాదాపు 1,160 తప్పుడు వార్తలను గుర్తించిందని ఠాగూర్‌ వెల్లడించారు. ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థనలతోపాటు, కొన్ని అంశాలను సుమోటోగా స్వీకరించి ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో అవగాహన కల్పించిందని లోక్‌సభలో ఆయన పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వం నిషేధించిన 248 యూఆర్‌ఎల్‌లలో వివిధ వెబ్‌సైట్లతోపాటు, సోషల్‌ మీడియా ఖాతాలు కూడా ఉన్నట్లు అనురాగ్‌ ఠాకూర్‌ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని