Lakhimpur Kheri: ఆశిష్‌ మిశ్రా బెయిల్‌ను వ్యతిరేకించిన యూపీ సర్కార్‌

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన లఖింపుర్‌ ఖేరీ ఘటనలో నిందితుడు ఆశిష్‌ మిశ్రా బెయిల్‌ పిటిషన్‌ను యూపీ సర్కారు వ్యతిరేకించింది.

Updated : 19 Jan 2023 15:00 IST

దిల్లీ: దేశవ్యాప్తగా సంచలనం సృష్టించిన లఖింపుర్‌ ఖేరీ (Lakhimpur Kheri) ఘటనలో ప్రధాన నిందితుడైన కేంద్రమంత్రి అజయ్‌ కుమార్‌ మిశ్రా (Ajay Kumar Mishra) కుమారుడు ఆశిష్‌ మిశ్రా (Ashish Mishra) బెయిల్‌ పిటిషన్‌ను ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం వ్యతిరేకించింది. ఎనిమిది మంది వ్యక్తుల మరణానికి కారణమైన వ్యక్తికి బెయిల్‌ ఇస్తే సమాజంలోకి తప్పుడు సంకేతం వెళుతుందని సుప్రీంకోర్టుకు తెలిపింది. 

ఆశిశ్‌ మిశ్రా బెయిల్‌ పిటిషన్‌పై గురువారం జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జేకే మహేశ్వరితో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా యూపీ ప్రభుత్వం తరఫున అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ గరిమ ప్రషద్ హాజరై వాదనలు వినిపించారు. ఇది (లఖింపూర్‌ ఖేరి) చాలా దారుణమైన ఘటన అని, ఇలాంటి ఘటనలో నిందితుడికి బెయిల్‌ ఇస్తే సమాజంలోకి తప్పుడు సంకేతం వెళుతుందని ధర్మాసనానికి తెలిపారు.

2021 అక్టోబర్‌ 3న ఉత్తరప్రదేశ్‌ లఖింపుర్ ఖేరీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతులపైకి కేంద్రమంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడి వాహనం దూసుకెళ్లింది. ఆ సమయంలో ఆశిష్‌ మిశ్రా వాహనంలో ఉన్నారు. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించారు. అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలో మరో నలుగురు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఆశిష్‌ మిశ్రా అరెస్టయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని