కొవిడ్ పాజిటివ్ వస్తే.. చుట్టూ 25 మీటర్లు సీల్

కరోనా వైరస్ కట్టడికి ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది.

Published : 05 Apr 2021 17:48 IST

సరికొత్త మార్గదర్శకాలు జారీ చేసిన యూపీ ప్రభుత్వం

లఖ్‌నవూ: కరోనా వైరస్ కట్టడికి ఉత్తర్‌ ప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. పాజిటివ్‌గా తేలిన వ్యక్తి నివసిస్తోన్న ఇంటి చుట్టూ 25 మీటర్ల ప్రాంతాన్ని సీల్ చేయాలని పేర్కొంది. ఒకవేళ అదే ప్రాంతంలో మరోవ్యక్తికి కూడా వైరస్ సోకితే, సీల్ చేసే ప్రాంతం పరిధి 50 మీటర్లకు పెరుగుతుంది. ఆ మార్గదర్శకాల ప్రకారం 25 మీటర్ల పరిధిలోకి కనీసం 20 ఇళ్లు, 50 మీటర్ల పరిధిలోకి 60 ఇళ్లు వస్తాయని పేర్కొంది.

అలాగే చివరి పాజిటివ్ కేసు వెలుగు చూసిన దగ్గరి నుంచి 14 రోజుల పాటు ఆ ప్రాంతాన్ని అధికారులు కంటైన్మెంట్ జోన్‌గా పరిగణిస్తారు. ఆ కాలంలో ఒక్క  కేసు కూడా లేకపోతే ఆ ప్రాంతం కంటైన్మెంట్ జోన్‌ నుంచి బయట పడుతుంది. జిల్లా నిఘా అధికారి ఇచ్చే రోజువారీ కొవిడ్ సమాచారం ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని ఆ మార్గదర్శకాల్లో పేర్కొంది. కంటైన్మెంట్‌ జోన్‌లో పర్యటించే బృందం కరోనా నివారణ చర్యల గురించి ఆ ప్రాంత ప్రజలకు తెలియజేస్తూ, లక్షణాలు ఉన్న వారి వివరాలను జిల్లా నిఘా అధికారికి నివేదిస్తుంది. అక్కడి నుంచి ఆ రాష్ట్ర వైద్య సిబ్బందికి సమాచారం వెళుతుంది. అయితే ఉత్తర ప్రదేశ్‌లో తాజాగా 4,136 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. 31 మంది ప్రాణాలు కోల్పోయారు. దాంతో ఇంతవరకూ మొత్తం కేసుల సంఖ్య 6,30,059కి, మరణాల సంఖ్య 8,881కి చేరుకుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని