UP Polls: ఉత్తర్‌ప్రదేశ్‌లో ముగిసిన తొలిదశ.. 59శాతం ఓటింగ్‌ నమోదు!

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 11 జిల్లాల పరిధిలోని మొత్తం 58 నియోజకవర్గాల్లో పోలింగ్‌ పూర్తయ్యింది. సాయంత్రం 6గంటల సమయానికి దాదాపు 59శాతం పోలింగ్‌ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.

Published : 10 Feb 2022 22:11 IST

పోలింగ్‌ ప్రశాంతంగా జరిగిందన్న కేంద్ర ఎన్నికల సంఘం

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. 11 జిల్లాల పరిధిలోని మొత్తం 58 నియోజకవర్గాల్లో పోలింగ్‌ పూర్తయ్యింది. సాయంత్రం 6గంటల సమయానికి దాదాపు 59శాతం పోలింగ్‌ నమోదైనట్లు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించినప్పటికీ మొత్తంగా తొలిదశ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసినట్లు పేర్కొంది. ఈ దశలో మొత్తం 25,880 పోలింగ్‌ కేంద్రాల్లో ఎన్నికలు జరుగగా.. మహిళా ఓటర్ల కోసం ప్రత్యేకంగా 138 పింక్‌ బూత్‌లను ఏర్పాటు చేసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం తెలిపింది.

షామ్లి, హాపూర్‌, గౌతమ్‌బుద్ధనగర్‌, ముజఫర్‌నగర్‌, మేరఠ్‌, బాగ్‌పత్‌, ఘజియాబాద్‌, బులంద్‌షహర్‌, అలీగఢ్‌, మథుర, ఆగ్రా జిల్లాల్లో గురువారం తొలిదశ పోలింగ్‌ జరిగింది. ఈ జిల్లాలోని 58 అసెంబ్లీ స్థానాలకు 12 స్థానాలను సమస్యాత్మకమైనవిగా అధికారులు గుర్తించారు. మొదటి విడతలో భాగంగా లక్షమంది పోలీసుల సిబ్బంది, హోంగార్డులు విధుల్లో ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. వీరితోపాటు మరో 800 కంపెనీల కేంద్ర బలగాలను విధుల్లో పాల్గొన్నాయని తెలిపారు. ఒక్కో కంపెనీలో 70-80 మంది సిబ్బంది ఉన్నట్లు వివరించారు.

తొలివిడతలో మొత్తం 623 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో అధికార భాజపా ప్రభుత్వంలోని ఎనిమిది మంది మంత్రులు ఉండగా.. వారి భవిష్యత్తు ప్రస్తుతం ఈవీఎంలలో నిక్షిప్తమయ్యింది. తొలిదశలో మొత్తంగా 2.27కోట్ల మంది ఓటర్లు పాల్గొనాల్సి ఉండగా.. వీరిలో దాదాపు 60శాతం మంది మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఇదిలాఉంటే, తొలిదశ పోలింగ్‌ జరిగిన ప్రాంతంలో గత ఎన్నికల్లో (2017లో) అత్యధిక స్థానాలు భాజపానే గెలుచుకుంది. 58 స్థానాలకు గానూ 53 సీట్లలో భాజపా గెలువగా, ఎస్‌పీ, బీఎస్పీలు చెరో రెండు సీట్లు గెలుచుకున్నాయి. మరోస్థానంలో ఆర్‌ఎల్‌డీ విజయం సాధించింది. ఈసారి మాత్రం ఎక్కువ స్థానాల్లో గెలుస్తామని సమాజ్‌వాదీ పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని