అభిమానులు వాటికి దూరంగా ఉండండి: అనుష్క

అసత్య ప్రచారాలకు తన అభిమానులు దూరంగా ఉండాలని అగ్రకథానాయిక అనుష్కశెట్టి విజ్ఞప్తి చేశారు. జేజేమ్మ, దేవసేనలాంటి విభిన్నమైన పాత్రల్లో ఒదిగిపోయి వెండితెరపై మెరిసిన ఆమె త్వరలో ప్రభాస్‌ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్‌, 3డీ చిత్రం ‘ఆదిపురుష్‌’లో నటించనున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తోన్నాయి...

Updated : 01 Oct 2020 12:28 IST

ఇప్పటివరకూ నన్నెవరూ కలవలేదు..!

హైదరాబాద్‌: అసత్య ప్రచారాలకు అభిమానులు దూరంగా ఉండాలని అగ్రకథానాయిక అనుష్కశెట్టి విజ్ఞప్తి చేశారు.  ప్రభాస్‌ కథానాయకుడిగా చిత్రీకరించనున్న భారీ బడ్జెట్‌, 3డీ చిత్రం ‘ఆదిపురుష్‌’లో నటించనున్నారంటూ గత కొన్నిరోజుల నుంచి వార్తలు వస్తోన్నాయి. ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్న ఈ సినిమాలో సీత పాత్రలో అనుష్క మెప్పించనున్నారంటూ పలు వెబ్‌సైట్లు రాశాయి. ఈ నేపథ్యంలో తాజాగా అనుష్క సదరు వార్తలపై స్పందించారు. ప్రభాస్‌ చిత్రంలో తాను నటించడం లేదని చెప్పారు. అంతేకాకుండా ఇప్పటివరకూ తనని ‘ఆదిపురుష్‌’ చిత్రబృందం కలవలేదని తేల్చి చెప్పేశారు.

‘అది కేవలం ప్రచారం మాత్రమే. ‘ఆదిపురుష్‌’ చిత్రంలో నా పాత్ర గురించి రూమర్స్‌ ఎలా మొదలయ్యాయో తెలియడం లేదు. ఆ సినిమాలో నేను ‘సీత’ పాత్ర పోషించడం లేదు. ‘ఆదిపురుష్‌’ చిత్రబృందం ఇప్పటి వరకూ నన్ను సంప్రదించలేదు. ఇలాంటి నిరాధరమైన ప్రచారాలను అభిమానులు నమ్మోద్దని, వాటికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఒకవేళ అలాంటి గొప్ప పాత్రలకు సంతకం చేస్తే నేనే అధికారికంగా ప్రకటిస్తాను’ అని అనుష్క తెలిపారు.

కాగా, హేమంత్‌ మధూకర్‌ దర్శకత్వం వహించిన ‘నిశ్శబ్దం’ చిత్రంలో అనుష్క నటించారు. అంజలి, షాలినీ పాండే, మాధవన్‌ కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రంలో సాక్షి అనే మూగమ్మాయిగా అనుష్క కనిపించనున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, కోనా ఫిల్మ్‌ కార్పొరేషన్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు కోనా వెంకట్‌, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. అక్టోబర్‌ 2న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా ఈ సినిమా విడుదల కానుంది. 2018లో విడుదలైన ‘భాగమతి’ చిత్రం తర్వాత ‘సైరా’ సినిమాలో అనుష్క అతిథి పాత్రలో మెరిశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని