ఆ బండరాయే మాలో నమ్మకాన్ని కలిగించింది

ఒళ్లు గగురుర్పొడిచే పోరాటాలు రూపకల్పన చేసి.. ఆరు నంది అవార్డులు అందుకున్నఅన్నదమ్ములు వీరు..  ఫైట్లంటే కేవలం

Updated : 21 Dec 2020 13:12 IST

ఒళ్లు గగురుర్పొడిచే పోరాటాలు రూపకల్పన చేసి.. ఆరు నంది అవార్డులు అందుకున్న అన్నదమ్ములు వీరు..  ఫైట్లంటే కేవలం కట్టి పడేయడం.. కొట్టి పడేయటం మాత్రమే కాదు.. ప్రతి సన్నివేశంలోనూ ఓ కొత్తదనం ఉట్టిపడేలా చేయడం అనే పద్ధతికి ఉన్నతిని తెచ్చిన ఉద్ధండులు.. ఈ అన్నదమ్ములు. ప్రకాశం జిల్లా నందిగుంటపాలెం గ్రామంలో ఒక సాధరణ మధ్య తరగతి కుటుంబంలో జన్మించి.. ఇవాళ తెలుగు సినిమా పరిశ్రమలోనే అగ్రశ్రేణి ఫైట్‌ మాస్టర్లుగా ఎదిగారు. కేవలం తెలుగు భాషలో మాత్రమే కాకుండా తమిళం, కన్నడం, మలయాళం ఇండస్ట్రీలో కూడా ఎంతో మంది ప్రజల్ని, ప్రొడ్యూసర్లని, దర్శకుల్ని, హీరోలను ఆకట్టుకున్నారు.. రామ్‌లక్ష్మణ్‌ సోదరులు. వారు పడిన కష్టాలు, ఇబ్బందులు, సంఘటనలను సవినయంగా చెప్పుకున్నారు ‘చెప్పాలని ఉంది..’ కార్యక్రమంలో.. 

అన్నదమ్ముళ్లుగా మీ ప్రయాణం ఇంత అద్భుతంగా సాగడానికి గల కారణమేంటి..?

రామ్‌/లక్ష్మణ్‌: సహజంగా చిన్నప్పుడు అన్నదమ్ములన్నాక కలిసుంటారు, గోల పెడుతుంటారు.. కొట్టుకుంటుంటారు.. మళ్లీ వెంటనే ఒకటైపోతారు. కానీ.. పెద్దయ్యాక తెలిసి కొట్లాడుతున్నారు.. కానీ ఒకటి కాలేకపోతున్నారు. సహజంగా పెద్ద వయసులో పెత్తనం చెలాయించాలనే ధోరణి ఉంటుంది. అలాంటప్పుడే బంధాలు దూరమతుంటాయి. కానీ మా మధ్య అలాంటి కలహాలకు చోటు లేదు.

మీరిద్దరు వేసుకునే బట్టల దగ్గర్నుంచి షూలేస్ వరకు ఒకేలా మెంటేయిన్‌ చేస్తుంటారు.  అసలు ఎలాంటి భేదాప్రాభియం లేకుండా ఇన్నేళ్లుగా ఇలా కంటిన్యూ చేయడానికి గల కారణమేంటి..?

రామ్‌/లక్ష్మణ్‌: మా నానమ్మ ఈశ్వరమ్మగారు. మేం ఎక్కువగా ఆమె దగ్గరే పెరిగాం. చిన్నప్పుడు ఇద్దరికీ వేర్వేరు డ్రెస్సులు తెస్తే గొడవపడతామని.. ఇద్దరికీ ఒకే తరహా డ్రెస్సులు తీసుకొచ్చేవారు. ఇలా చిన్నప్పటి నుంచే అలవాటుగా మారింది. ఇదే మాకు సినిమాల్లో ప్లస్‌ అయింది. మేమిద్దరం ఒకసారి చెన్నై వెళ్లాం.. అప్పటికీ బయటి ప్రపంచం గురించి ఏం తెలియదు. రాజు మాస్టర్‌ ఇంటి దగ్గరే ఉన్నాం. అప్పుడే చిరంజీవి అన్నయ్య వాళ్లింట్లో ఏదో పెద్ద ఫంక్షన్‌ జరగుతుంది. ఎలాగైనా దానికి వెళ్లాలని ఇద్దరం అనుకున్నాం.. ఎందుకంటే అక్కడికి ఆర్టిస్టులందరూ వస్తారు కదా.. వారందరినీ చూడొచ్చని మురిసిపోయాం.. అయితే సాయంత్రం ఫంక్షన్‌కు వెళ్లబోయే ముందు రాజు మాస్టర్‌ మా ఇద్దరిలో ఒకరినే రమ్మని కారు ఎక్కించుకున్నారు. కానీ ఉదయం నుంచి ఇద్దరం కలిసి ఫంక్షన్‌కు వెళ్తున్నాం అనే ఉత్సాహంతో ఉన్న మాకు ఒక్కడి (రామ్‌)నే రమ్మనేసరికి ఏదో వెలితిగా అనిపించింది. ఫంక్షన్‌ హాలు గేటు దగ్గరకు వెళ్లగానే కారు బ్రేకు డౌన్‌ అయింది. అప్పుడు ఒకటే నిశ్చయించుకున్నా.. ఈ ప్రోగ్రాం తమ్ముడు లేకుండా చూడొద్దనుకున్నా.. వెంటనే కారు దిగి ఎలాగో తమ్ముడి దగ్గరికి వచ్చేశా..  ఇలా మొదటి నుంచే మాలో మేం ఇద్దరం వేరు.. అనే భావాలేవి రాలేదు. అంతలోనే రాజు మాస్టారు కంగారుగా నా (రామ్‌) కోసం వెతుక్కుంటూ వచ్చారు. అప్పుడు ఆయనకు చెప్పాం.. ‘అన్నయ్య మేం ఇద్దరం కలిసి వద్దామనుకున్నాం. మీరు ఒక్కరినే తీసుకెళ్లేసరికే తమ్ముడు లేకుండా చూడదలుచుకోలేక వచ్చేశాను’ అనగానే ఆయన బాగా ఫీలయ్యారు. ఇక అప్పటి నుంచి ఎక్కడికి తీసుకెళ్లినా ఇద్దరినీ తీసుకెళ్తారు. (నవ్వులు)

మీరు ఈ మధ్య యోగా, ధ్యానంపై ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని తెలిసింది. అసలేమిటి ఒక పక్క ఈ ఫైట్‌ మాస్టర్ల కోణమేంటి.. ఈ యోగా సాధనలేమిటి..?

రామ్‌/లక్ష్మణ్‌: కష్టంలో నుంచి వచ్చాం అది అందరికీ తెలిసిందే.. డబ్బులు వచ్చాయి.. మంచి గుర్తింపు వచ్చింది.. కానీ ఎక్కడో ఓ భయం వెంటాడుతుండేది.. వీటన్నింటినీ మనం కాపాడుతామా..? అని.. సరిగ్గా ఆ సమయంలోనే ఓ గురువు దగ్గరకెళ్లి ఆరా తీస్తే.. విపశ్యన అనే కోర్సు ఉందని చెప్పగానే వెంటనే వెళ్లి నేర్చుకున్నాం.

విపశ్యన ధ్యానంపై మీరు తెలుసుకున్నదేమిటి..? మీ అనుభవం చెప్పండి..?

రామ్‌/లక్ష్మణ్‌: ఇందులో కొన్ని నియామాలుంటాయి. చాలా ఓపిక ఉండాలి. రాగద్వేషాలను అదుపు చేసుకోవడం తెలుసుకున్నాం. ఏదైనా ఒక లిమిట్‌లో ఉండాలి. అది మనల్ని ఇబ్బంది పెట్టకూడదన్న విషయం అక్కడ నేర్చుకున్నాం. ఇప్పటికి ఐదు సార్లు విపశ్యన ధ్యానం చేశాం. దీంతో మాలో ఏదో తెలియని ధైర్యం వచ్చింది.

జీవితాన్ని మీరు మూడు పాతికలుగా విభజించి చూడాలన్న ఒక ఫిలాసఫీని నమ్ముతారని విన్నాం. అసలు ఈ మూడు పాతికల ఫిలాసఫీ ఏంటి..?

రామ్‌/లక్ష్మణ్‌: మొదటి ఇరవైదేళ్లలో ఏదేనా నేర్చుకోవచ్చు.. ఏమైనా తెలుసుకోవచ్చు. సాధించొచ్చు. ఇది ప్రతిఒక్కరి జీవితంలో ఒక పిల్లర్‌ లాంటింది. తర్వాత పాతికలో ఉద్యోగం, పెళ్లి, పిల్లలతోపాటు అసలు మనమేంటి అని మనకు మనం అన్వేషించుకోవాలి. చివరగా ఉన్నతంగా స్థిరపడాలి. సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకోవాలి. బంధాలను గౌరవించాలి. అసలు మనిషి జీవితం 75 ఏళ్లే.. ఆ తర్వాత జీవితం బోనస్‌ కింద లెక్కే.. (నవ్వులు..) మా అనుభవంతో  చెప్పేందేంటంటే.. ప్రతి మనిషి కూడా మన జీవితం ఎన్నాళ్లు.. మనం బతికేది ఎన్నాళ్లు.. ఇందులో ఎంత వృథా చేసుకున్నాం.. అనేది ప్రతి ఒక్కరూ గ్రహించాలి.

జీవితాన్ని మీరు ఒక డ్రైవింగ్‌ సీట్లో కూర్చున్న డ్రైవర్‌లాగా చూడాలన్న కోణంలో కూడా పరిశీలిస్తుంటారని విన్నాం.. అసలు ఈ డ్రైవర్‌ సీటు కథేమిటీ..?

రామ్‌/లక్ష్మణ్‌: మనిషి దేహం పవిత్రమైంది. ముఖ్యంగా యువతకు చెప్పేదేంటంటే.. ఇంత గొప్ప దేహంలో మద్యం నింపడం, సిగరెట్లు తాగడం, అర్ధరాత్రి బిర్యానీలు తింటూ మలీనం చేస్తున్నారు. అసలు దేహం కోసం మనం ఏం చేస్తున్నామనేది ఒక్కసారి ఆలోచించాలి. అందుకు ఉదయం, సాయంత్రం ఒక గంట పాటు వ్యాయామం చేయాలి. ఒక్కమాటలో చెప్పాలంటే కారును కడిగినట్లు ఉదయం దేహాన్ని సబ్బుతో రుద్దడం కాదు.. లోపల కూడా మనమేంటనేది తెలుసుకొని దాన్ని కడుక్కోవాలనే విషయాన్ని గ్రహించాలి.

చదువు వల్ల మనిషికి సంస్కారం అబ్బుతుంది.. దాని వల్లే స్థిరపడతాడనేది ఓ ప్రగాఢ విశ్వాసం. కానీ చదువు విషయంలో మీకు లోటే జరిగిందని తెలిసింది. దాని వల్ల మీరు ఇబ్బంది పడిన సందర్భాలేమైనా ఉన్నాయా..?

రామ్‌/లక్ష్మణ్‌: బాలీవుడ్‌ సినిమాల కోసం వెళ్లినప్పుడు లాంగ్వేజ్ సమస్య తప్పకుండా ఉంటుంది. అక్కడి ఆర్టిస్టులతో మాట్లడేటప్పుడు ఇబ్బందిగా ఫీలవుతుంటాం. అందుకే చదువు మనిషికి ఎంతో అవసరం. కానీ చదువు లేకపోయినా.. జీవించొచ్చు అనే ధైర్యం మాలో ఉంది.

మీ నాన్నగారు నాటకాలు వేసేవారు. మరి మీరెందుకు నటనవైపు మొగ్గు చూపించలేదు..?

రామ్‌/లక్ష్మణ్‌: చిన్నప్పటి నుంచే నటనపై మాకు ఆసక్తి లేదు. అయినా నాలుగు చిన్న సినిమాల్లో నటించాం. అప్పుడే మాకు అర్థమైంది.. ప్రజలను మనం ఇబ్బంది పెట్టకూడదని.. (నవ్వులు). అందుకే ప్రతి ఒక్కరూ ఎవరికి వారు ఎనలైజ్‌ చేసుకోవాలి. మనం ఏం చేయగలుగుతాం. మన శక్తియుక్తులేంటో తెలుసుకోవాలి.

సినీ కెరియర్‌ ప్రారంభించిన తర్వాత మీరు ఫైట్‌మాస్టర్‌గా చేసిన మొదటి సినిమా ఏంటి..?

రామ్‌/లక్ష్మణ్‌: 2001లో ఫైట్‌ మాస్టర్లుగా హైదరాబాద్‌కు వచ్చాం. హీరో సురేష్‌గారు నటించిన ‘శివుడు’ అనే సినిమాకు మొదటిసారి ఫైట్‌ మాస్టర్లుగా పనిచేశాం. అంతకంటే ముందు త్రినేత్రుడు సినిమాలో చిన్నపాత్రలో నటించాం. రాజు మాస్టర్‌తో కలిసి చిరంజీవిగారితో ఎక్కువ సినిమాలు చేశాం. మా జీవితం ముందుకు వెళ్లడానికి అపజయాలే కారణమని మేం భావిస్తుంటాం.

ఫైట్‌ మాస్టర్లుగా మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది. అయితే.. మీ ఎదుగుదలకు ఎవరు సహాయపడ్డారు...?

రామ్‌/లక్ష్మణ్‌: మా ఎదుగుదలలో చాలా మంది ఉన్నారు. మేం ఫైటర్‌గా ఎదగడానికి తోడ్పడింది రాజు మాస్టర్‌. ఆయనే మమ్మల్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. చీకట్లో ఉన్న మా జీవితాలకు ఓ వెలుగు చూపించారు. అయితే ఎక్కువగా డైరెక్టర్లు మమ్మల్ని ప్రోత్సహించారు. ముఖ్యంగా పూరీ జగన్నాథ్‌గారు. ఇండస్ట్రీలో మాకు ఓ ముద్ర వేసి అలా వదిలిపెట్టారు. ఆ తర్వాత బోయపాటి శ్రీను, ఎస్వీ కృష్ణారెడ్డి వంటి వాళ్లు ఎంతోమంది మాకు సహాయం చేసిన గురువులున్నారు.

మీరు గుండ్రాయి కూడా మీ గురువు అని చెబుతుంటారు. అందులో గురువు, గురుతత్వం ఏంటి..?

రామ్‌/లక్ష్మణ్‌: మా ఊర్లో ఓ చెట్టు కింద ఒక చిన్న బండరాయి ఉండేది. దాన్ని ఎందుకు కదలించకూడదని మేమిద్దరం ప్రయత్నించాం. అందుకు జనాలంతా పడుకున్న తర్వాత మెడలో చిన్న ఆంజనేయస్వామి బిల్ల వెసుకొని ఏడాది పాటు ప్రాక్టీసు చేశాం. సరదాగా ఓ రోజు పందెం కట్టి ఆ రాయిని ఎత్తాం. అప్పుడే అనిపించింది. మనస్పూర్తిగా అనుకొని ప్రయత్నిస్తే ఏదైనా సాధించొచ్చు అనే నమ్మకాన్ని మాలో కల్గించిందా ఆ బండరాయి. అప్పడి నుంచి గుండ్రాయే గురువుగా భావిస్తున్నాం.

ఫైట్లలో కొత్తదనం తీసుకురావడానికి మీరెలాంటి గ్రౌండ్‌వర్క్‌ చేస్తారు..?

రామ్‌/లక్ష్మణ్‌: ఫైట్‌ మాస్టరంటే కేవలం సంబంధిత సీన్‌కు సంబంధించి మాత్రమే కాదు.. మొత్తం సినిమా కథను వినాలి. అప్పుడే అనుకున్న కొత్త కోణంలో యాక్షన్‌ సీన్‌ తీయడానికి ఆస్కారం ఉంటుంది. ఒక్క మాటలో  చెప్పాలంటే.. కథ, పాత్రల్లో భాగమవ్వాలి.

మీరు రోజూ ఎన్ని గంటలకు నిద్రలేస్తారు..? ఎంత సేపు వ్యాయామం, ధ్యానం చేస్తారు..?

రామ్‌/లక్ష్మణ్‌: రోజూ ఉదయం 2.30 గంటలకు నిద్ర లేస్తాం. తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల వరకు ధ్యానం చేస్తాం. ఆ తర్వాత ఐదింటి నుంచి ఆరున్నర వరకు సూర్యనమస్కారం, కపాలభాతి ప్రాణాయామం చేస్తాం. ఒకవేళ షూటింగ్‌ ఉంటే వీటికి కొంత సమయం తగ్గిస్తాం.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో చేశారు. పెద్దపెద్ద స్టార్స్‌తో మీకున్న అనుభవాలు చెప్పండి..

రామ్‌/లక్ష్మణ్‌: మలమాళంలో మోహన్‌లాల్‌, లాలేట, తమిళంలో విజయ్‌, రజనీకాంత్‌, కన్నడలో దర్శన్‌రాజ్‌, పునీత్‌రాజ్‌కుమార్‌, హిందీలో టైగర్ ష్రాఫ్‌తో చేశాం. ఇలా ఎక్కడికెళ్లినా కళామతల్లి మమ్మల్ని ఆదరించింది. తెలుగు చిత్ర పరిశ్రమలో ఎక్కువ పరిచయం ఉంది చిరంజీవిగారితోనే. అన్నయ్య అని మనసారా పిలుచుకుంటాం. ఆయన 150 చిత్రంలో మాకు పిలిచి మరి అవకాశం ఇచ్చారు. చిరంజీవిగారు ఎలాంటి సీన్‌ అయినా దాదాపు ఒక్క షాట్‌లోనే ఫర్‌ఫెక్టుగా చేస్తారు.

మీ కుటుంబ సంబంధాల గురించి, పిల్లల వ్యక్తిగత జీవితం గురించి కాస్త వివరించండి.

రామ్‌/లక్ష్మణ్‌: మేం మొత్తం ఐదుగురం. మాకు అన్నయ్య, ఇద్దరు అక్కలు ఉన్నారు. కలిసి ఉంటే కలదు సుఖం అనే మాటను అనుభవిస్తే చాలా ఆనందంగా ఉంటుంది. మా అన్నయ్య పేరు బాబు. ఆయన కూడా మాతోపాటే ఉంటారు. ఇంటి విషయాలు దాదాపు అన్నీ ఆయనే చూసుకుంటారు. ఆయనకు పెళ్లయినా కూడా వేరు కాపురం పెట్టకుండా మా కోసం ఆలోచించారు. అమ్మ మనోహరమ్మ, నాన్న రంగారావు గారు. మా పెద్దక్క రంగమ్మ చిన్నప్పుడు మమ్మల్ని ఎక్కువగా చూసుకునేవారు. అమ్మ తర్వాత అమ్మగా మమ్మల్ని లాలించారు. ఈ సందర్భంగా మా పెద్దక్కకు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం.

మరి మీ పిల్లల గురించి..?

రామ్‌/లక్ష్మణ్‌: పిల్లలు నలుగురు.. ఒక అమ్మాయి డాక్టర్‌ చదువుతోంది. పెద్దవాడు డాక్టర్‌ చదవమంటే లేదు లేదు యాక్టింగ్‌ నేర్చుకుంటా అన్నాడు. ప్రస్తుతం సత్యానంద్‌గారి దగ్గర యాక్టింగ్‌లో శిక్షణ పొందుతున్నాడు. త్వరలో అభిమానుల ముందుకు రాబోతున్నాడు. ఇంకో అమ్మాయి డిగ్రీ చదువుతోంది. చిన్నోడు ఇంజినీరింగ్‌ చేస్తున్నాడు. పిల్లలు కూడా ఎలాంటి తారతమ్యాలు లేకుండా ఉంటారు. మమ్మలిద్దరినీ డాడీ అని పిలుస్తుంటారు.

ఇన్నేళ్ల మీ సుదీర్ఘ ప్రయాణంలో ఎప్పుడైనా ఒకరి మీద ఒకరికి కోపం వచ్చిందా..?

రామ్‌/లక్ష్మణ్‌: వ్యక్తిగతంగా ఒకరిపై ఒకరికి కోపం రాదు. కానీ షూటింగ్‌ సమయంలో అప్పుడప్పుడు వస్తుంది. ఆ సమయంలో గంట, రెండు గంటలపాటు మాట్లాడుకోకుండా ఉంటాం. తర్వాత మళ్లీ అంతా మామూలే.. (నవ్వులు)

 మీ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది..?

రామ్‌/లక్ష్మణ్‌: అరవేళ్ల వరకు సినిమాలు చేస్తాం. ఆ తర్వాత ధాన్య ప్రపంచంలోకి వెళ్లి పది మందికి ఉపయోగపడేలా సత్యాన్ని బోధించాలనుకుంటున్నాం. అందుకు వంద ఎకరాల్లో ఆశ్రమం పెట్టాలనేది కోరిక. ఈ బిజిబిజీ లైఫ్‌లో మానసిక ప్రశాంతత ఎంతో అవసరం. అందుకే ధ్యానం, యోగా వంటివి భావితరాల వారికి నేర్పించాలన్నదే మా అభిలాష. ఈ సందర్భంగా కళామతల్లికి మా వందనాలు..

ఇవీ చదవండి

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని