విచారణలో దీపిక కన్నీరు..!

మాదకద్రవ్యాలు సేవిస్తున్నారనే ఆరోపణలతో బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె, సారా అలీఖాన్‌, శ్రద్ధాకపూర్‌తోపాటు దీపిక మేనేజర్‌ కరీష్మా ప్రకాశ్‌ శనివారం ఎన్సీబీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. సుమారు ఐదుగంటలపాటు సాగిన విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దీపిక కన్నీరు పెట్టుకున్నారట...

Updated : 27 Sep 2020 14:18 IST

రకుల్‌, సారా, శ్రద్ధాకపూర్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్న అధికారులు

ముంబయి: మాదకద్రవ్యాల కేసులో బాలీవుడ్‌ నటులు దీపికా పదుకొణె, సారా అలీఖాన్‌, శ్రద్ధాకపూర్‌తోపాటు దీపిక మేనేజర్‌ కరీష్మా ప్రకాశ్‌ శనివారం ఎన్సీబీ విచారణకు హాజరైన విషయం తెలిసిందే. సుమారు ఐదుగంటలపాటు సాగిన విచారణలో అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దీపిక కన్నీరు పెట్టుకున్నారట. అయితే ఇలా ప్రతీదానికి కన్నీరుపెట్టుకోవడంతో.. అధికారులు అసహనానికి గురయ్యారని పలు ఆంగ్ల పత్రికల్లో వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ఎమోషనల్‌ డ్రామాని కట్టిపెట్టి సమాధానం చెప్పమని అధికారులు ఆమెతో అన్నట్లు తెలుస్తోంది. ఇటీవల సుశాంత్‌ టాలెంట్‌ మేనేజర్‌ జయాసాహా సెల్‌ఫోన్‌ నుంచి బహిర్గతమైన వాట్సాప్‌ చాట్‌ తనదేనని.. కానీ తాను డ్రగ్స్‌ తీసుకోలేదని ఆమె అధికారులకు వెల్లడించినట్లు సమాచారం.

సుశాంత్‌ డ్రగ్స్‌ తీసుకునేవాడు..!

నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ మత్తుపదార్థాలు తీసుకునేవాడని, షూటింగ్‌ సమయంలో క్యారావ్యాన్‌లోకి వెళ్లి మాదకద్రవ్యాలను సేవించేవాడని నటి శ్రద్ధాకపూర్‌, సారా అలీఖాన్‌ ఎన్సీబీ విచారణలో వెల్లడించినట్లు తెలుస్తోంది. మరోవైపు ‘కేదార్‌నాథ్‌‌’ సినిమా సమయంలో సుశాంత్‌తో సన్నిహితంగా ఉన్నానని.. అప్పుడప్పుడు అతని ఫామ్‌హౌస్‌లో జరిగే పార్టీలకు వెళ్లానని.. కానీ ఎప్పుడూ డ్రగ్స్‌ తీసుకోలేదని సారా విచారణలో వివరించారని పలు వెబ్‌సైట్లలో కథనాలు వచ్చాయి.

ఫోన్లు స్వాధీనం చేసుకున్న అధికారులు

డ్రగ్స్‌ కేసు విచారణలో భాగంగా ఎన్సీబీ అధికారులు దీపికా పదుకొణె, సారా అలీఖాన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, శ్రద్ధాకపూర్‌, దీపిక మేనేజర్‌ కరీష్మా ప్రకాశ్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయంపై ఎన్సీబీ అధికారి అశోక్‌ జైన్‌ మాట్లాడుతూ.. ‘డ్రగ్స్‌ కేసు దర్యాప్తులో భాగంగా తాజాగా పలువురు నటీమణుల్ని విచారించాం. వారి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశాం. సదరు రికార్డ్‌లను కోర్టుకి అందజేస్తాం. అలాగే వాళ్ల సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నాం. సదరు నటీమణులు చెప్పింది నిజమా? కాదా?అని తెలుసుకోవడం కోసం సెల్‌ఫోన్‌ చాట్స్‌ పరిశీలిస్తాం’ అని వెల్లడించారు.

కరణ్‌ పార్టీ పరిశీలనలో లేదు

2019లో పలువురు బీటౌన్‌ సెలబ్రిటీలకు ప్రముఖ దర్శక-నిర్మాత కరణ్‌జోహార్‌ తన నివాసంలో ఓ పార్టీ ఇచ్చారు. అయితే ఆ పార్టీలో నటీనటులు డ్రగ్స్‌ తీసుకున్నారని పేర్కొంటూ కొంతమంది నెటిజన్లు ఆరోపణలు చేశారు. దీంతో సదరు పార్టీకి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. తాజాగా ఈ వీడియో గురించి ఎన్సీబీ అధికారి అశోక్‌ జైన్‌ స్పందించారు. ఇప్పటివరకూ కరణ్‌ జోహార్‌ ఇచ్చిన పార్టీ తమ పరిశీలనలో లేదన్నారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ కేసుకు.. కరణ్‌ పార్టీకీ ఎలాంటి సంబంధం లేదన్నారు.

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పూత్‌ ముంబయిలోని తన నివాసంలో జూన్‌ 14న మృతిచెంది కనిపించారు. సుశాంత్‌ తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు సదరు నటుడి ప్రియురాలు రియా చక్రవర్తిని విచారణ చేశారు. అనంతరం ఈ కేసుని అధికారులు డ్రగ్స్‌ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా రియా చక్రవర్తి, ఆమె సోదరుడు షోవిక్‌తోపాటు పలువురు డ్రగ్స్‌ సరఫరా చేసే వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్‌ చేశారు. అక్టోబర్‌ 6వ తేదీ వరకూ రియాకి కోర్టు జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని