FIR: రవితేజతో ద్విభాషా చిత్రం

‘‘థియేటర్‌ యాజమాన్యాలు... పంపిణీదారులు మా సినిమా  విషయంలో ఆనందంగా ఉన్నామని చెప్పడం మా రెండున్నరేళ్ల కృషికి దక్కిన ఫలితంగా భావిస్తున్నాం’’ అన్నారు విష్ణు విశాల్‌.

Updated : 16 Feb 2022 09:23 IST

‘‘థియేటర్‌ యాజమాన్యాలు... పంపిణీదారులు మా సినిమా  విషయంలో ఆనందంగా ఉన్నామని చెప్పడం మా రెండున్నరేళ్ల కృషికి దక్కిన ఫలితంగా భావిస్తున్నాం’’ అన్నారు విష్ణు విశాల్‌. ఆయన కథానాయకుడిగా నటిస్తూ స్వయంగా నిర్మించిన చిత్రం ‘ఎఫ్‌.ఐ.ఆర్‌’. మను ఆనంద్‌ దర్శకత్వం వహించారు. అభిషేక్‌ పిక్చర్స్‌ పతాకంపై ఇటీవలే తెలుగులో విడుదలైందీ చిత్రం. ఈ సందర్భంగా చిత్రబృందం మంగళవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించింది. విష్ణు విశాల్‌ మాట్లాడుతూ ‘‘తమిళంలో మంచి ప్రారంభ వసూళ్లతో విజయవంతంగా ప్రదర్శితమవుతోంది సినిమా. తెలుగులోనూ ఆదరణ పొందుతుండడం ఆనందంగా ఉంది. విడుదలకి సహకారం అందించిన రవితేజ, వాసుకీ ధన్యవాదాలు. ఈ సినిమా పోస్టర్‌పై వివాదం తలెత్తింది. అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. ఆ విషయంలో ముస్లిం సోదరులకి క్షమాపణలు చెబుతున్నా. ఈ సినిమా ఎవరికీ వ్యతిరేకం కాదు. చూస్తే ఆ విషయం అర్థమవుతుంది. అలాగే రవితేజ నిర్మాణ సంస్థ ఆర్‌.టి.టీమ్‌ వర్క్స్‌తో కలిసి మేం త్వరలోనే తెలుగు, తమిళ భాషల్లో ఓ సినిమాని నిర్మిస్తాం. ఆ వివరాల్ని త్వరలోనే ప్రకటిస్తాం’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘నా తొలి సినిమానే తెలుగులోనూ విడుదల కావడం ఆనందంగా ఉంది’’ అన్నారు. ‘‘మంచి సినిమా ఏ భాష నుంచి వచ్చినా తెలుగువాళ్లు ఆదరించడానికి ముందుంటారు. పోటీగా సినిమాలు ఉన్నా ‘ఎఫ్‌.ఐ.ఆర్‌’ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది’’ అన్నారు అభిషేక్‌ పిక్చర్స్‌ సీఈఓ వాసు. ఈ కార్యక్రమంలో కథానాయిక  రెబ్బా మోనిక, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత స్రవంతి తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని