సెలబ్రిటీల పార్టీ వీడియో వైరల్‌.. కరణ్‌ ప్రకటన

బాలీవుడ్‌-డ్రగ్‌ కేసులో దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ను నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) విచారించబోతోందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. 2019లో ఆయన బాలీవుడ్‌ ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన పార్టీ గురించి ప్రశ్నించబోతున్నారని....

Published : 27 Sep 2020 01:43 IST

ముంబయి: బాలీవుడ్‌-డ్రగ్‌ కేసులో దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ను నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) విచారించబోతోందని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. 2019లో ఆయన బాలీవుడ్‌ ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన పార్టీ గురించి ప్రశ్నించబోతున్నారని చెప్పుకొచ్చారు. దీనిపై కరణ్‌ తాజాగా స్పందించారు. తనపై మీడియా రాస్తున్న కథనాల్ని ఖండించారు. తనెప్పుడూ మాదక ద్రవ్యాల్ని ఏ రూపంలోనూ తీసుకోలేదని, ప్రోత్సహించలేదని స్పష్టం చేశారు.

‘కొన్ని న్యూస్‌ ఛానళ్లు, పత్రికలు, వెబ్‌సైట్లు, సోషల్‌మీడియా ప్లాట్‌ఫాంలు తప్పుగా రిపోర్టింగ్‌ చేస్తున్నాయి. 2019 జులై 28న నేను మా ఇంట్లో ఇచ్చిన పార్టీలో ప్రముఖులు డ్రగ్స్‌ తీసుకున్నారని పేర్కొంటున్నాయి. 2019లోనే ఆ వైరల్‌ వీడియోపై నేను స్పష్టత ఇచ్చా, నాపై వచ్చిన ఆరోపణలు నిజం కాదు. ఇప్పుడు డ్రగ్‌పై విచారణ జరుగుతున్న క్రమంలో వస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, అవాస్తవాలని నేను పునరుద్ఘాటిస్తున్నాను. ఆ రోజు పార్టీలో ఎటువంటి మాదక ద్రవ్యాల్ని ఉపయోగించలేదు. మరోసారి చెబుతున్నా.. నేను ఎటువంటి డ్రగ్‌ను సేవించలేదు, తీసుకునే వారిని ప్రోత్సహించలేదు. ఈ హానికరమైన మీడియా కథనాలు అనవసరంగా నా పేరు, నా సహ ఆర్టిస్టులు, ధర్మా ప్రొడక్షన్స్‌‌ పేరును ప్రస్తావించి.. బాధిస్తున్నాయి’ అని కరణ్‌  ప్రకటనలో పేర్కొన్నారు.

అనంతర ధర్మా ప్రొడక్షన్స్‌‌కు చెందిన క్షితిజ్‌ రవి ప్రసాద్‌, అనుభవ్‌ చోప్రాలను పోలీసులు విచారిస్తున్నారని వచ్చిన వార్తలపై ఆయన స్పందిస్తూ.. ‘క్షితిజ్‌ రవి ప్రసాద్‌, అనుభవ్‌ చోప్రా నా దగ్గర పనిచేసే వాళ్లని కొందరు రాశారు. వీరిద్దరు నాకు వ్యక్తిగతంగా తెలియదు. ప్రజలు తమ వ్యక్తిగత జీవితంలో చేసే పనులకు నేను, ధర్మా ప్రొడక్షన్స్‌ బాధ్యులం కాదు. వీరిపై వస్తున్న ఆరోపణలకు మాకు ఎటువంటి సంబంధం లేదు. అనుభవ్ చోప్రా మా ఉద్యోగి కాదు.. 2011 నవంబరు నుంచి 2012 జనవరి మధ్య కాలంలో మేం తీసిన ఓ చిత్రానికి రెండో సహాయ దర్శకుడిగా పనిచేశారు. 2013లో ఓ లఘు చిత్రానికి సహాయ దర్శకుడిగా పనిచేశారు. ఆ తర్వాత అతడు ధర్మా ప్రొడక్షన్స్‌తో కలిసి ఎప్పుడూ పనిచేయలేదు. క్షితిజ్‌ రవి ప్రసాద్‌ మా సంస్థకు అనుసంధాన సంస్థ అయిన ధర్మాటిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఓ ప్రాజెక్టు కోసం ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఒప్పందంపై 2019 నవంబరులో చేరారు. కానీ ఇంత వరకు ఆ ప్రాజెక్టును మేం ప్రారంభించలేదు’.

‘ఏదేమైనప్పటికీ గత కొన్ని రోజులుగా మీడియాలో ప్రచారం అవుతున్న వార్తలు, తప్పుడు ఆరోపణలు మమ్మల్ని ఎంతో బాధిస్తున్నాయి. సమాచారాన్ని పరిశీలించి ప్రచురించాలని నేను మీడియాను కోరుతున్నా. లేకపోతే చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా’ అని ముగించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని