
విమానాశ్రయం చూసి సర్‌ప్రైజ్ అయ్యా: మీనా
చెన్నై: ఒకప్పటి అగ్ర కథానాయిక మీనా లాక్‌డౌన్ తర్వాత తిరిగి షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ‘దృశ్యం 2’ సినిమా షూటింగ్ కోసం చెన్నై నుంచి కేరళకు ప్రయాణం చేశారు. చాలా నెలల తర్వాత ఇలా పీపీఈతో (వ్యక్తిగత రక్షణ పరికరాలు) ప్రయాణించడం గురించి సోషల్‌మీడియా వేదికగా ఫాలోవర్స్‌తో మాట్లాడారు. తను సూట్ ధరించి ఉన్న ఫొటోల్ని షేర్ చేస్తూ.. ‘అంతరిక్షంలోకి వెళ్లడానికి సిద్ధమైనట్లు ఉన్నాను కదా.. నాకు యుద్ధానికి వెళ్తున్న భావన కలిగింది. దాదాపు ఏడు నెలల తర్వాత ప్రయాణం చేశా.. విమానాశ్రయం వెలవెలబోయి.. పరిసరాలు నిశ్శబ్దంగా ఉండటం చూసి సర్‌ప్రైజ్ అయ్యా. చాలా మంది ప్రజలు నాలా సూట్ ధరించకుండా రావడం చూసి ఆశ్చర్యపోయా. ఇది ఎంతో అసౌకర్యమైన డ్రెస్ అని కచ్చితంగా చెప్పగలను. చాలా ఉక్కపోతగా, చికాకుగా అనిపించింది. వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ చెమటలు పట్టాయి. చేతికి గ్లౌజులు ధరించడం వల్ల కనీసం ముఖంపై చెమటను శుభ్రం చేసుకోలేని పరిస్థితి’.
‘రోజంతా ఇలాంటి సూట్‌లో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లకు హ్యాట్సాఫ్. ఇలాంటి అసౌకర్యవంతమైన దుస్తుల్లోనూ రోగుల బాధల్ని అర్థం చేసుకుని, సౌమ్యంగా వ్యవహరిస్తుండటం గొప్ప విషయం. వైద్యులపై నాకు ఇంకా గౌరవం పెరిగింది. మానవత్వంతో మీరు చేస్తున్న సేవలకు ధన్యవాదాలు’ అని మీనా ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ‘దృశ్యం 2’ చిత్రానికి జీతూ జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. 2013లో వచ్చిన ‘దృశ్యం’కు సీక్వెల్ ఇది. మోహన్‌లాల్ కథానాయకుడి పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా తెలుగు వెర్షన్‌లో వెంకటేష్, మీనా జంటగా నటించిన సంగతి తెలిసిందే.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.