‘టక్‌ జగదీష్‌’ ఓటీటీలోనే?

ఒక వైపు కరోనా భయాలు...  మరోవైపు ప్రదర్శన రంగంలో సమస్యలు... ఫలితంగా చిత్రసీమ ఉక్కిరిబిక్కిరవుతోంది. రూ.కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాల్ని విడుదల చేసుకోలేని పరిస్థితి. ధైర్యం చేసి విడుదల చేసినా ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చాలడం లేదు.

Updated : 06 Aug 2021 06:54 IST

క వైపు కరోనా భయాలు...  మరోవైపు ప్రదర్శన రంగంలో సమస్యలు... ఫలితంగా చిత్రసీమ ఉక్కిరిబిక్కిరవుతోంది. రూ.కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాల్ని విడుదల చేసుకోలేని పరిస్థితి. ధైర్యం చేసి విడుదల చేసినా ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చాలడం లేదు. పైగా ఆంధ్రప్రదేశ్‌లో రాత్రి కర్ఫ్యూ, 50శాతం సామర్థ్యంతో ప్రదర్శనలు ఇబ్బందికరంగా మారుతున్నాయి. పరిమిత వ్యయంతో తెరకెక్కిన సినిమాలకైతే ఓకే కానీ, భారీ వ్యయంతో రూపుదిద్దుకున్న చిత్రాలకి పెట్టుబడి తిరిగి రాని పరిస్థితి. గత వారం విడుదలైన సినిమాలు అంతంత మాత్రం ఫలితాల్ని రాబట్టాయి. చాలా చోట్ల థియేటర్లు ప్రేక్షకులు లేక వెలవెలబోయాయి. పెద్ద తెరపై తమ సినిమా చూపించాలని దర్శకనిర్మాతలకి, కథా నాయకులకు ఉన్నా... పరిస్థితులు ఏ రకంగానూ అనుకూలంగా లేవు. థియేటర్లలోనే విడుదల చేయాలని ఏడాదికిపైగా ఎదురు చూస్తున్న సినిమాలు చాలానే ఉన్నాయి. వాటిపై పడుతున్న వడ్డీల భారం అంతా ఇంతా కాదు. భారం ఇన్నాళ్లూ మోస్తూ వచ్చినా... పరిస్థితులు అనుకూలంగా మారడం లేదు. దాంతో చాలామంది నిర్మాతలు భారం దించుకోవాలనే ప్రయత్నాల్లో ఉన్నారు. ఓటీటీలో విడుదల చేయడంపై మొగ్గు చూపుతున్నారు. నాని హీరోగా నటించిన ‘టక్‌ జగదీష్‌’ ఓటీటీలోనే విడుదల కానుందని సమాచారం. ఆ మేరకు నిర్మాతలు, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో సంస్థ మధ్య చర్చలు కూడా పూర్తయినట్టు తెలిసింది. రూ. 37 కోట్లకి డీల్‌ కుదిరినట్టు సమాచారం. త్వరలోనే చిత్రబృందం అధికారికంగా ప్రకటించే అవకాశాలున్నాయి. శాటిలైట్‌, హిందీ అనువాద హక్కులు కలుపుకొంటే రూ.50 కోట్లపైగానే ఈ సినిమా వ్యాపారం చేసినట్టవుతుందని లెక్కగడుతున్నాయి. రీతూవర్మ, ఐశ్వర్య రాజేష్‌ నాయికలుగా శివ నిర్వాణ తెరకెక్కించిన చిత్రమిది. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని