Ambati Rambabu: రేణు దేశాయ్‌ కామెంట్స్‌పై మంత్రి అంబటి ట్వీట్‌

‘బ్రో’ సినిమాలోని శ్యాంబాబు పాత్రపై మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా కొనసాగుతోంది. దీనిపై రేణూ దేశాయ్‌ స్పందించారు. ఆమె వ్యాఖ్యలపై అంబటి స్పందిస్తూ ట్వీట్‌ చేశారు. 

Published : 11 Aug 2023 01:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల విడుదలైన ‘బ్రో’ (BRO) సినిమాలోని శ్యాంబాబు పాత్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దీనిపై నటి, దర్శకురాలు రేణు దేశాయ్‌ (Renu Desai) గురువారం స్పందించారు. తన మాజీ భర్త, అగ్ర నటుడు పవన్ కల్యాణ్‌ గురించి మాట్లాడుతూ సోషల్‌ మీడియా వేదికగా వీడియో పోస్ట్‌ చేశారు. దానికి కౌంటర్‌గా ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) పోస్ట్‌ పెట్టారు. ‘అమ్మా రేణూ! మీ మాజీకి చెప్పు.. మా క్యారెక్టర్లు పెట్టి శునకానందం పొందొద్దని!’ అని పోస్ట్‌లో పేర్కొన్నారు.

రేణు దేశాయ్‌ ఏమన్నారంటే.. ‘‘ఇటీవల విడుదలైన ఓ సినిమాలోని సన్నివేశాలు వివాదానికి దారి తీశాయని తెలిసింది. ఆ వివాదం గురించి నాకు పెద్దగా అవగాహన లేదు. కాకపోతే, పవన్‌పై సినిమా, వెబ్‌ సిరీస్‌ చేస్తామని ఇటీవల కొంతమంది అన్నారు. ఆయన పెళ్లిళ్లు, భార్యలు, పిల్లల గురించి ఈ సినిమా ఉంటుందని చెప్పారు. ఒక తల్లిగా నా వ్యక్తిగత అభ్యర్థన కోసమే ఈ వీడియో చేస్తున్నా. పరిస్థితులు ఏమైనా సరే దయచేసి పిల్లలను అందులోకి లాగకండి. మా పిల్లలు సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టారు. నా పిల్లల తండ్రి నటుడు, రాజకీయనాయకుడు. నా పిల్లలనే కాదు, ఏ పిల్లలను, ఆడవాళ్లను రాజకీయాల్లోకి లాగొద్దు. రాజకీయంగా ఏదైనా ఉంటే మీరూ మీరూ చూసుకోండి’’ అని విజ్ఞప్తి చేశారు.

పవన్‌కల్యాణ్‌కే నా మద్దతు.. ఆయన డబ్బు మనిషి కాదు: రేణూ దేశాయ్‌

పవన్‌ కల్యాణ్‌, ఆయన మేనల్లుడు సాయిధరమ్‌ తేజ్‌ కలిసి నటించిన ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహించారు. ఇందులో శ్యాంబాబు అనే పాత్రను నటుడు పృథ్వీరాజ్‌ పోషించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక.. సినిమాల్లో తన క్యారెక్టర్‌ పెట్టి పవన్ కల్యాణ్‌ ఆనంద పడుతున్నారని మంత్రి ఎద్దేవా చేశారు. ఈయన చేసిన వ్యాఖ్యలపై పృథ్వీరాజ్‌ ఓ సందర్భంలో స్పందిస్తూ.. తాము ఎవరినీ ఇమిటేట్‌ చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత, అంబటి.. ‘బ్రో’ సినిమా గురించి మళ్లీ విమర్శలు చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని