Dulquer Salmaan: ప్రేక్షకులే కాదు నేనూ ఆశ్చర్యపోవాలి!

మమ్ముట్టి తనయుడిగా ప్రయాణం మొదలుపెట్టిన దుల్కర్‌ సల్మాన్‌ ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. అన్ని భాషల్లో నటిస్తూ సిసలైన పాన్‌ ఇండియా స్టార్‌గా రాణిస్తున్నారు.

Updated : 21 Aug 2023 13:45 IST

మమ్ముట్టి తనయుడిగా ప్రయాణం మొదలుపెట్టిన దుల్కర్‌ సల్మాన్‌ ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటున్నారు. అన్ని భాషల్లో నటిస్తూ సిసలైన పాన్‌ ఇండియా స్టార్‌గా రాణిస్తున్నారు. ఆయన నటించిన ‘కింగ్‌ ఆఫ్‌ కొత్త’ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సినిమా ప్రయాణం గురించి  హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు దుల్కర్‌. ఆ విషయాలివీ...

మీ తొలి గ్యాంగ్‌స్టర్‌ సినిమా ఇదేనా?

గ్యాంగ్‌స్టర్‌ డ్రామా అనే కాదు, ఈ స్థాయి సినిమా ఇదివరకు నేనెప్పుడూ చేయలేదు. స్నేహితుల కథ, ఫుట్‌బాల్‌ నేపథ్యం, భారీస్థాయి పోరాట ఘట్టాలు, వాణిజ్యాంశాలన్నీ మేళవించిన కథ ఇది. ఇలాంటి చిత్రం చేయడం నాకు పూర్తిగా కొత్త. ప్రతి పాత్ర.. కథ, కథనాల్ని ప్రభావితం చేస్తుంటుంది. సంఘర్షణతో కూడిన ఇలాంటి మానవీయ కోణాలున్న కథంటే నాకు చాలా ఇష్టం.

ఈ సినిమా పేరు వెనక కథేమిటి?

కొత్త అంటే మలయాళంలో పట్టణం అని అర్థం. ఓ కల్పితమైన టౌన్‌ చుట్టూ సాగే సినిమా ఇది. ఈ సినిమాకి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో నేనే సొంతంగా డబ్బింగ్‌ చెప్పా. ఇప్పుడు నేను నటుడినే కాదు, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ని కూడా. నాకు భాష, వ్యక్తీకరణ అంటే ఇష్టం. ‘గన్స్‌ అండ్‌ గులాబ్స్‌’ సిరీస్‌కైతే ఐదు భాషల్లో డబ్బింగ్‌ చెప్పా. అరుదైన ఈ అవకాశాన్ని నేను బాగా ఆస్వాదిస్తుంటా.

ఫుట్‌బాల్‌ నేపథ్యంలో సన్నివేశాల కోసం మీరెలా సన్నద్ధమయ్యారు?

చిన్నప్పుడు ఫుట్‌బాల్‌, క్రికెట్‌ ఆడేవాణ్ని. ఎక్కువ ఆసక్తి మాత్రం సైక్లింగ్‌పైనే ఉండేది. చక్రాలతో ముడిపడిన ఆటలంటేనే ఇష్టం. ఇప్పుడు సినిమా కోసం ప్రత్యేకంగా సన్నద్ధమై నటించడమనేది ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుంటుంది. కేరళలో ఫుట్‌బాల్‌ని చాలా ఇష్టపడతారు. ఆ ఆట నేపథ్యంలో నటించడం మంచి అనుభూతిని పంచింది. ఒకవైపు ఆట... మరోవైపు ప్రేక్షకుల కోలాహలం... ఇలా క్రీడా నేపథ్యాన్ని తెరకెక్కించే ప్రక్రియ  ఆసక్తికరంగా ఉంటుంది. ఆ సన్నివేశాల కోసం ముంబయి, విదేశాల నుంచి ప్రత్యేక కొరియోగ్రాఫర్లు వచ్చారు.

ఈ సినిమా కోసం ఎక్కువ సమయం కేటాయించినట్టున్నారు?

నేను ఏడాదికి మూడు సినిమాలు చేస్తుంటా. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం... ఇలా ఎక్కడ కుదిరితే అక్కడ. ప్రేక్షకులకు అసలు సిసలు థియేటర్‌ అనుభూతిని ఇవ్వాలని భారీ స్థాయిలో సినిమా చేయాలనుకున్నా. ఆ క్రమంలోనే ఈ కథ నా దగ్గరికొచ్చింది. అందుకే ఈ ఒక్క సినిమా కోసమే ఏడాది శ్రమించా. దర్శకుడు అభిలాష్‌ జోషి నా చిన్ననాటి స్నేహితుడు. ఎప్పట్నుంచో తనతో సినిమా చేయాలనుకుంటున్నా.  

మణిరత్నం మొదలుకొని ఎంతోమంది సీనియర్‌ దర్శకులతో సినిమాలు చేశారు. మరోవైపు కొత్త దర్శకులతోనూ పని చేస్తున్నారు. ఆ అనుభవాలు ఎలాంటివి?  

అందరితో పనిచేయడాన్ని ఆస్వాదిస్తుంటా. సీనియర్ల అనుభవాలు ఎన్నో విషయాల్ని నేర్పిస్తాయి. విలక్షణమైన ఆలోచనలతో వచ్చే కొత్త దర్శకులు కొన్ని నేర్పిస్తుంటారు. వాళ్లలోని తపన స్ఫూర్తినిస్తుంటుంది. చివరిగా ఆయా కథలే ఎక్కువ ప్రభావం చూపిస్తుంటాయి. మంచి కథ ఉంటే మంచి సినిమా వస్తుందని నమ్ముతా.

‘సీతారామం’ తర్వాత తెలుగు నుంచి కథలు ఎక్కువగా వచ్చాయా?

తెలుగులో సినిమాలు చేయడం ఇష్టం. కొన్ని ఆసక్తికరమైన కథలు వింటున్నా. ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘లక్కీ భాస్కర్‌’ చేస్తున్నా.

గ్యాంగ్‌స్టర్‌ సినిమాలో నటించడం ఎలాంటి అనుభవాన్నిచ్చింది?

నేనెక్కువగా లవర్‌బాయ్‌గానే ప్రేక్షకులకు గుర్తుంటాను. ‘సీతారామం’ తరహా సినిమా చేశాక అందులో నుంచి ఈ పాత్రలోకి మారి నటించడం  ఆసక్తికరంగా అనిపించింది. అన్నిటికంటే కథే నాకు కీలకం. నచ్చిన కథల్నే చేయాలనుకుంటా. ఒకే రకం కథలు, పాత్రలు చేయడం అంటే ఏమాత్రం ఇష్టం ఉండదు. చూసే ప్రేక్షకులే కాదు... నా పాత్ర నటించే నేను కూడా ఆశ్చర్యపోయేలా ఉండాలి. అలాంటివి చేస్తేనే తృప్తి.

ప్రభాస్‌ ‘కల్కి’లో మీరు నటిస్తున్నారా?

నేను సినిమాలో ఉన్నానో లేదో దర్శకనిర్మాతలే చెప్పాలి (నవ్వుతూ). అయితే ఇప్పటివరకూ చాలా సినిమాల గురించి విన్నాను, చూశాను కానీ అలాంటి సినిమాని మాత్రం ఎవ్వరూ తీయలేదు. ‘కల్కి 2898 ఎ.డి.’ భారతీయ చిత్ర పరిశ్రమని మలుపు తిప్పే సినిమా అవుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని