
అందాల పంచమి.. ఎవరివే?
‘‘కృష్ణ పక్ష పంచమి వెన్నెల వన్నెలవా...
శుక్ల పక్ష పంచమి నెలవంక వయ్యారానివా?
ఓ అందాల పంచమి... ఎవరివే నీవెవరివే?’’
అంటూ ఆరా తీయడం మొదలైంది. మరి ఆ పంచమి ఎవరో? ఆమె కథేమిటో తెలియాలంటే మాత్రం ‘హరి హర వీర మల్లు’ విడుదల వరకు ఆగాల్సిందే. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. నిధి అగర్వాల్ కథానాయిక. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఎ.ఎం.రత్నం సమర్పకులు. ఇందులో నిధి అగర్వాల్.. పంచమి అనే పాత్రలో నటిస్తోంది. మంగళవారం ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్రంలోని పంచమి పాత్ర లుక్‌ని విడుదల చేశారు. ‘‘నేటితరంలో ఇంద్రజాలికుడులాంటి దర్శకుడు క్రిష్. ఆయన తనదైన శైలిలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. 17వ శతాబ్దంనాటి మొఘలాయిలు, కుతుబ్‌షాహీల శకం నేపథ్యంలో జరిగే కథతో, ఒక దృశ్యకావ్యంగా సినిమా రూపొందుతోంది. భారతీయ సినిమాలో ఇప్పటివరకు చెప్పని కథ. ఏ విషయంలోనూ రాజీపడకుండా, రూ.150 కోట్ల వ్యయంతో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నాం. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని విడుదల చేయనున్నాం. ఇప్పటివరకు యాభై శాతం చిత్రీకరణ పూర్తయింది. ’’ అన్నారు నిర్మాత.