ఎప్పటికీ సినిమాల్ని వదిలిపెట్టను

‘‘పదేళ్ల విరామం తీసుకుని తిరిగి చిత్ర పరిశ్రమలోకి వచ్చాకా కూడా అభిమానులు నాపై చూపించిన అభిమానం తగ్గలేదు సరికదా రెట్టింపు అయ్యింది. వాళ్లందరికీ రుణపడి ఉంటాను. ఇక ఎప్పటికీ సినిమాల్ని వదిలిపెట్టను.

Updated : 29 Nov 2022 07:25 IST

‘ఇఫి’ ముగింపు వేడుకల్లో చిరంజీవి

‘‘పదేళ్ల విరామం తీసుకుని తిరిగి చిత్ర పరిశ్రమలోకి వచ్చాకా కూడా అభిమానులు నాపై చూపించిన అభిమానం తగ్గలేదు సరికదా రెట్టింపు అయ్యింది. వాళ్లందరికీ రుణపడి ఉంటాను. ఇక ఎప్పటికీ సినిమాల్ని వదిలిపెట్టను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు అభిమానుల ప్రేమకు ఎప్పుడూ దాసుణ్ని. ఆ ప్రేమే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చింది’’ అన్నారు ప్రముఖ కథానాయకుడు చిరంజీవి. సొమవారం సాయంత్రం గోవాలో జరిగిన 53వ అంతర్జాతీయ భారతీయ చలనచిత్రోత్సం(ఇఫి) ముగింపు వేడుకల్లో ‘ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌’ పురస్కారాన్ని అందుకున్నారు చిరంజీవి. కేంద్రమంత్రి అనురాగ్‌ ఠాకూర్‌, గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ ఈ పురస్కారాన్ని చిరుకి అందజేశారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ ‘‘నేను ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను. శివ శంకర్‌ ప్రసాద్‌ అనే నాకు చిరంజీవిగా జన్మనిచ్చింది చిత్ర పరిశ్రమ. నా తల్లిదండ్రులకు, చిత్రపరిశ్రమకు ధన్యవాదాలు. నన్ను ఈ పురస్కారానికి ఎంపిక చేసిన ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ‘ఇఫి’, భారతప్రభుతం, ఈ నిర్మాతలు, దర్శకులు, కుటుంబ సభ్యులు ఇలా అందరికీ నా కృతజ్ఞతలు. నాకు యువ హీరోలు పోటీ కాదు, నేనే వాళ్లకు పోటీ. నేను సినీ పరిశ్రమలో ఉండటం నా అదృష్టం. సినిమా రంగంలోకి రావాలనుకునేవాళ్లకు చిత్రసీమ గొప్ప వేదిక. ఎక్కడైనా అవినీతి ఉంటుందేమో కానీ..ఇక్కడ ఉండదు. ఇక్కడ ప్రతిభే కొలమానం. నేను గతంలో ఇలాంటి వేడుకల్లో పాల్గొన్నాను. అప్పుడు అక్కడ దక్షిణాదికి చెందిన ఒక్క నటుడి ఫొటో కూడా లేదని బాధపడ్డా. ఇప్పుడు అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంది. సినిమా ఎక్కడైనా తీయొచ్చు. కానీ అది భారతీయ సినిమా అని గుర్తుపెట్టుకోవాలి. ప్రాంతీయ భేదాలు పోయి భారతీయ సినిమా అనే రోజు వచ్చింది’’అన్నారు. ఈ వేదికపై సీనియర్‌ నటి ఆశాపరేఖ్‌, ప్రముఖ కథానాయకుడు అక్షయ్‌కుమార్‌తో పాటు యువ హీరోలు రానా, ఆయుష్మాన్‌ ఖురానాలను సత్కరించారు.‘సినిమాబండి’ చిత్రానికి తొలి చిత్ర దర్శకుడిగా ప్రత్యేక ప్రోత్సాహక సత్కారం అందుకున్నారు ప్రవీణ్‌ కాండ్రేగుల.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని