కల్యాణ్‌రామ్‌కు అమిగోస్‌ ఓ మైలురాయి: ఎన్టీఆర్‌

‘‘మా కుటుంబంలో ఎంతమంది నటీనటులున్నా.. అందరి కంటే ఎక్కువ ప్రయోగాత్మక చిత్రాలు చేసింది అన్నయ్య కల్యాణ్‌రామే’’ అన్నారు కథానాయకుడు ఎన్టీఆర్‌.

Updated : 06 Feb 2023 06:42 IST

‘‘మా కుటుంబంలో ఎంతమంది నటీనటులున్నా.. అందరి కంటే ఎక్కువ ప్రయోగాత్మక చిత్రాలు చేసింది అన్నయ్య కల్యాణ్‌రామే’’ అన్నారు కథానాయకుడు ఎన్టీఆర్‌. ఆయన ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ‘అమిగోస్‌’ విడుదల ముందస్తు వేడుకలో ఈ వ్యాఖ్యలు చేశారు. కల్యాణ్‌ రామ్‌ త్రిపాత్రాభినయం చేసిన చిత్రమిది. రాజేంద్ర రెడ్డి తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించింది. ఆషికా రంగనాథన్‌ కథానాయిక. ఈ సినిమా ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీరిలీజ్‌ వేడుకలో ఎన్టీఆర్‌ మాట్లాడుతూ.. ‘‘నేను ‘జైలవకుశ’లో త్రిపాత్రాభినయం చేశా. అదెంత కష్టమో నాకు తెలుసు. అన్నయ్య ఈ సినిమాలో అద్భుతంగా నటించారు. తప్పకుండా తన కెరీర్‌లో ఈ ‘అమిగోస్‌’ మైలురాయిలా నిలుస్తుంది. దర్శకుడు రాజేంద్ర ఇంజినీరింగ్‌ చేశారు. వాళ్ల అమ్మానాన్న ఉద్యోగం చేసుకోవచ్చు కదరా అంటే.. నేను ఓ సినిమా తెరకెక్కించాకే తిరిగి ఇంటికొస్తానని చెప్పారు. కానీ, సినిమా మొదలయ్యే లోపు వాళ్లమ్మ, పూర్తయ్యే లోపు తండ్రి కాలం చేశారు. సినిమా పట్ల ఓ మనిషికి ఇంత తాపత్రయం ఉంటుందా అనేది రాజేంద్రను చూశాకే తెలిసింది. మైత్రీ మూవీస్‌ అంటే నా కుటుంబమే. వాళ్ల నుంచి వస్తున్న ‘అమిగోస్‌’ విజయం సాధించాలని కోరుకుంటున్నా. అప్‌డేట్‌లు కావాలని దర్శకనిర్మాతలపై ఒత్తిడి పెంచకండి. ఇది మా విన్నపం మాత్రమే. నిజంగా ఏదైనా అదిరిపోయే అప్‌డేట్‌ ఉంటే మా భార్యల కన్నా ముందు మీతోనే పంచుకుంటాం. నా తదుపరి చిత్రం ఈనెలలోనే ప్రారంభిస్తాను. మార్చి 20 లేదా ఈలోపే రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలు పెడతాం. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 5న విడుదల చేస్తాం’’ అన్నారు.

హీరో కల్యాణ్‌ రామ్‌ మాట్లాడుతూ.. ‘‘తొలిసారి మనుషుల్ని పోలిన మనుషుల కథతో ఈ వినూత్నమైన థ్రిల్లర్‌ చిత్రం చేశాం. నాకిలాంటి కథ ఇచ్చినందుకు రాజేంద్రకు కృతజ్ఞతలు. ఎందుకంటే ‘బింబిసార’ తర్వాత ఎలాంటి చిత్రం చేయాలనుకున్నప్పుడు ఈ కథ తెచ్చారు. కచ్చితంగా ఈ సినిమా ఎవరినీ నిరుత్సాహపరచదు. ఇందులో ఆషికా తెలుగు తెరకు పరిచయమవుతున్నారు. మా చిత్ర బృందమంతా ఎంతో కష్టపడి ఈ సినిమా చేసింది. అందరికీ థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘నాకింత పెద్ద అవకాశం ఇచ్చినందుకు మైత్రీ మూవీస్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాను. నన్ను.. నా కథను నమ్మి ఈ అవకాశమిచ్చిన కల్యాణ్‌రామ్‌కు కృతజ్ఞతలు. సౌందర్‌ రాజన్‌ లేకుంటే సినిమా ఇంత బాగా వచ్చేది కాదు. జిబ్రాన్‌ అద్భుతమైన సంగీతమందించారు. ఈ చిత్రం అందర్నీ సర్‌ప్రైజ్‌ చేస్తుంది. కల్యాణ్‌రామ్‌ నటనను మరోస్థాయిలో చూస్తారు’’ అన్నారు దర్శకుడు రాజేంద్ర రెడ్డి. నిర్మాతలు నవీన్‌ యెర్నేని, రవిశంకర్‌ మాట్లాడుతూ.. ‘‘కల్యాణ్‌రామ్‌తో ఎప్పట్నుంచో సినిమా చేయాలనుకున్నాం. అదిప్పటికి నెరవేరింది. సినిమా చూశాం. చాలా బాగా వచ్చింది. ‘బింబిసార’ తర్వాత ఆస్థాయిలో ఉంటుంది. కథ చాలా వైవిధ్యంగా ఉంటుంది. ఇది కచ్చితంగా మాకు హ్యాట్రిక్‌ హిట్‌గా నిలుస్తుందని నమ్ముతున్నాం’’ అన్నారు. ఈ వేడుకలో ఆషికా రంగనాథ్‌, వశిష్ఠ, బుచ్చిబాబు, రామజోగయ్యశాస్త్రి, బ్రహ్మాజీ, అవినాష్‌ కొల్లా, భరత్‌ కమ్మ, ప్రణవి, శుభ శ్రీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని