సంక్షిప్త వార్తలు (5)

నటుడు నరేష్‌ చిత్రసీమకు పరిచయమై 50ఏళ్లు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఆయన ‘మళ్లీ పెళ్లి’ పేరుతో తన గోల్డెన్‌ జూబ్లీ ప్రాజెక్ట్‌ ప్రకటించారు.

Published : 25 Mar 2023 01:09 IST

నరేష్‌.. ‘మళ్లీ పెళ్లి’

టుడు నరేష్‌ చిత్రసీమకు పరిచయమై 50ఏళ్లు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం ఆయన ‘మళ్లీ పెళ్లి’ పేరుతో తన గోల్డెన్‌ జూబ్లీ ప్రాజెక్ట్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆ చిత్ర ఫస్ట్‌లుక్‌ను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. అందులో పవిత్ర లోకేష్‌ ఇంటి ముందు ముగ్గు వేస్తుండగా.. నరేష్‌ ఆమెను తదేకంగా చూస్తూ కనిపించారు. ఈ సినిమాలో ఈ ఇద్దరూ జంటగా కనిపిస్తున్నట్లు ఈ ప్రచార చిత్రాన్ని బట్టి అర్థమవుతోంది. ఈ సినిమాతో నరేష్‌ తన విజయ కృష్ణ మూవీస్‌ను పునఃప్రారంభిస్తున్నట్లు తెలియజేశారు. పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాని ఎం.ఎస్‌.రాజు తెరకెక్కిస్తున్నారు. వనిత విజయకుమార్‌, అనన్య నాగళ్ల, రోషన్‌, రవివర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో ఈ వేసవిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకి సంగీతం: సురేష్‌ బొబ్బిలి, ఛాయాగ్రహణం: ఎం.ఎన్‌.బాల్‌ రెడ్డి.


వినోదాల ‘యమ డ్రామ’

యువ చంద్ర, శివకుమార్‌, కౌటిల్య, సుదర్శన్‌ రెడ్డి, ప్రియాంక శర్మ, నేహాదేశ్‌ పాండే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘యమ డ్రామ’. టి.హర్ష చౌదరి తెరకెక్కించారు. తోటకూర శివరామకృష్ణారావు నిర్మించారు. సాయికుమార్‌ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ చిత్ర టైటిల్‌ లోగోను నటి విజయశాంతి శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘‘నేటి ట్రెండ్‌ను దృష్టిలో పెట్టుకొని యూత్‌ఫుల్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందించినట్లు దర్శక నిర్మాతలు చెప్పారు. తప్పకుండా ఈ సినిమా అందరినీ ఆలరించాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘మంచి వినోదాత్మక చిత్రమిది. అన్ని రకాల ఎమోషన్స్‌ ఇందులో ఉన్నాయి. ఈ సినిమాతో యువతరానికి ఓ మంచి సందేశం ఇవ్వనున్నాం. సాయికుమార్‌ పోషించిన యముడి పాత్ర ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’’ అన్నారు దర్శకుడు టి.హర్ష. నిర్మాత శివరామకృష్ణారావు మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు.


నిజంగా చట్టమంటే?

ధుబాల, పూజ, స్వాతి విఘ్నేశ్వరి, ఆల్లు రమేష్‌, రోహిణి ప్రధాన పాత్రల్లో బాబు నిమ్మగడ్డ తెరకెక్కించిన చిత్రం ‘సత్యం వధ ధర్మం చెర’. ఎదుబాటి కొండయ్య నిర్మాత. ఈ సినిమా ఈనెల 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో శుక్రవారం విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు బాబు నిమ్మగడ్డ మాట్లాడుతూ.. ‘‘సమాజంలో జరిగిన కొన్ని నిజ సంఘటనల్ని ఆధారంగా చేసుకొని ఈ చిత్రం తెరకెక్కించాం. మన రాజ్యాంగం గొప్పది. చట్టం చాలా గట్టిది. కానీ, బాధితుడు చిన్నవాడు.. కారకుడు పెద్దవాడైనప్పుడు ఈ చట్టం రకరకాలుగా పని చేస్తుంది. మరి నిజంగా చట్టం ఎలా పని చేయాలన్నది ఈ సినిమాలో చూపించాం’’ అన్నారు.


గాయని బాంబే జయశ్రీకి అస్వస్థత

ప్రముఖ గాయని బాంబే జయశ్రీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయాన్ని ఆమె సన్నిహితులు వెల్లడించారు. ‘‘కచేరీల కోసం ప్రస్తుతం జయశ్రీ యూకేలో ఉన్నారు. శుక్రవారం అక్కడే ఆమె అనారోగ్యానికి గురయ్యారు. సమయానికి వైద్యం అందడంతో ఆమె ఆరోగ్యం నిలకడ స్థితికి చేరుకుంది. అక్కడి ఆసుపత్రి వర్గాలతో పాటు ఆమె సన్నిహితులు సత్వర స్పందనే దీనికి కారణం’’అని జయశ్రీ సన్నిహితులు తెలియజేశారు. జయశ్రీ ఆరోగ్యంపై సామాజిక మాధ్యమాల్లో వచ్చిన వార్తల్ని నమ్మొద్దని కూడా వాళ్లు కోరారు. ‘‘ఆమె ఆరోగ్యంగానే ఉన్నారు. సోషల్‌ మీడియాలో వచ్చే వదంతులను నమ్మొద్దు. దయచేసి మాకు ప్రైవసీ ఇవ్వండి’’అని చెప్పారు. మెదడుకు సంబంధించిన రక్తనాళాల్లో వాపు రావడంతో జయశ్రీ అనారోగ్యానికి గురైనట్లు సమాచారం. తెలుగు, హిందీ, తమిళ, మలయాళం.. ఇలా పలు భాషల్లో గొప్ప పాటలెన్నో పాడారు జయశ్రీ.


‘పరిణీత’ దర్శకుడు కన్నుమూత

బాలీవుడ్‌ దర్శకుడు ప్రదీప్‌ సర్కార్‌(67) ఇక లేరు. ‘పరిణీత’ చిత్రంతో దర్శకుడిగా మారిన ఆయన ‘మర్దానీ’, ‘హెలికాప్టర్‌ ఈలా’ తదితర చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్నారు గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తెల్లవారుజామున ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు. దర్శకుడు కాకముందు ప్రకటన చిత్రాలతో పాటు పలు వీడియో గీతాల్ని రూపొందించి పేరు తెచ్చుకున్నారు. తొలి చిత్రం ‘పరిణీత’కుగానూ జాతీయ పురస్కారం అందుకున్నారు ప్రదీప్‌. సినిమాలే కాకుండా పలు వెబ్సిరీస్‌లకు కూడా దర్శకత్వం వహించారు. ప్రదీప్‌ మృతిపట్ల అజయ్‌దేవ్‌గణ్‌, మనోజ్‌ బాజ్‌పాయ్‌, హన్సల్‌ మెహతా, కంగనా రనౌత్‌, రాణీ ముఖర్జీ తదితర సినీ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం ప్రకటించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు