Cinema News: సయీ ప్రేమకథ ఆలస్యం?

‘మేజర్‌’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్‌. ‘దబాంగ్‌ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్‌ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్‌ దేవగణ్‌ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు.

Updated : 18 Apr 2024 12:05 IST

‘మేజర్‌’తో భారీ విజయాన్ని అందుకుంది కథానాయిక సయీ మంజ్రేకర్‌. ‘దబాంగ్‌ 3’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈమె ప్రస్తుతం ‘ఔరో మే కహా దమ్‌ థా’ సినిమాతో బిజీగా ఉంది. అజయ్‌ దేవగణ్‌ ఈ చిత్రంలో సయీకి జోడీగా కనిపించనున్నారు. టబు కీలక పాత్ర పోషిస్తోంది. రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా నీరజ్‌ పాండే తెరకెక్కిస్తున్నారు. ఎన్‌హెచ్‌ స్టూడియోజ్‌, పనోరమా స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కొన్ని నెలల క్రితం ఈ సినిమా ఏప్రిల్‌ 26న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. కానీ ఇప్పడీ చిత్రం కొన్ని కారణాల వల్ల కాస్త ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ‘ఇది ఇరవై ఏళ్ల పాటు సాగే ఓ ప్రేమకథా చిత్రం. ఈ సినిమా జూన్‌ లేదా జులై నెలలో విడుదల అయ్యే అవకాశం ఉంది. త్వరలో దానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడుతుంది’ అంటూ సన్నిహిత వర్గాలు తెలిపాయి.


నవ్వులు పంచే... ‘టీచర్‌’

విజయవంతమైన ‘చి90 s’ వెబ్‌ సిరీస్‌ బృందం ‘టీచర్‌’ పేరుతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ముగ్గురు విద్యార్థులు, ఓ టీచర్‌ చుట్టూ సాగే కథతో ఈ చిత్రం రూపొందుతున్నట్టు సినీ వర్గాలు తెలిపాయి. కలర్స్‌ స్వాతి, నిఖిల్‌ దేవాదుల, నిత్యశ్రీ, రాజేంద్రగౌడ్‌, సిద్ధార్థ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆదిత్య హాసన్‌ దర్శకత్వం వహిస్తుండగా, మేడారం నవీన్‌ అఫిషియల్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నవీన్‌ మేడారం నిర్మిస్తున్నారు. ‘‘ఆద్యంతం నవ్వించడమే లక్ష్యంగా రూపుదిద్దుకున్న చిత్రమిది. అంకాపూర్‌ అనే గ్రామంలోని ముగ్గురు విద్యార్థులకి సంబంధించిన కథ. అడ్డు అదుపూ లేకుండా అల్లరి చేసే ముగ్గురు విద్యార్థులు టీచర్‌ని కలిశాక ఏం జరిగింది? వాళ్ల జీవితాలు ఎలా మారాయనే విషయాలు హృద్యంగా ఉంటాయి. సరదా సంభాషణలు, సన్నివేశాలు, ప్రేమ, భావోద్వేగాలు మనసుల్ని హత్తుకునేలా ఉంటాయి. ఇందులో కలర్స్‌ స్వాతి టీచర్‌గా కనిపిస్తార’’ని సినీ వర్గాలు తెలిపాయి. హర్ష, పవన్‌ రమేశ్‌, నరేందర్‌ నాగులూరి, సురేష్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: సిద్ధార్థ్‌ సదాశివుని, ఛాయాగ్రహణం: అజీమ్‌ మహమ్మద్‌, కూర్పు: అరుణ్‌ తాచోత్‌, కళ: తిపోజి దివ్య.


అయోధ్యకు ప్రయాణం

శ్రీరామనవమి సందర్భంగా చిత్రాలయం స్టూడియోస్‌ సంస్థ అధినేత వేణు దోనేపూడి ఓ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. దర్శకుడు వి.ఎన్‌.ఆదిత్య అందించిన కథతో, ‘జర్నీ టు అయోధ్య’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఈ సినిమాని తీస్తున్నట్టు ఓ ప్రకటనలో తెలిపారు. ‘‘రామాయణం ఆధారంగా, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న చిత్రమిది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. వి.ఎన్‌.ఆదిత్య నేతృత్వంలో ఒక బృందం అయోధ్య సహా పలు ప్రాంతాల్లో లొకేషన్ల కోసం రెక్కీ నిర్వహిస్తున్నారు. ఓ యువ దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తార’’ని అందులో పేర్కొన్నారు. తమ్మారెడ్డి భరద్వాజ నిర్మాణ సారథ్యం వహించనున్నారు. ప్రస్తుతం చిత్రాలయం స్టూడియోస్‌ సంస్థ పీపుల్‌ మీడియా సంస్థతో కలిసి గోపీచంద్‌ కథానాయకుడిగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ‘విశ్వం’ సినిమాని నిర్మిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని