RC15: మరొక వివాదంలో రామ్‌చరణ్‌-శంకర్‌ మూవీ

‘RC15’ కథ నాదేనంటూ దక్షిణ భారత సినీ రచయితల సంఘాన్ని ఆశ్రయించాడు ఓ రచయిత.

Published : 02 Sep 2021 16:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో విపరీతమైన క్రేజ్‌ ఉన్న చిత్రాల్లో ‘RC15’ ఒకటి. రామ్‌చరణ్‌ కథానాయకుడిగా భారీ చిత్రాల దర్శకుడు శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. అయితే, ఈ సినిమా ప్రకటించిన నాటి నుంచి ఏదో ఒక వివాదం దర్శకుడు శంకర్‌ను చుట్టు ముడుతూనే ఉంది. ‘భారతీయుడు2’ పూర్తి చేసిన తర్వాతే శంకర్‌ మరో మూవీ చేయాలని ఆ చిత్ర నిర్మాతలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆ తర్వాత బాలీవుడ్‌లో ‘అపరిచితుడు’ రీమేక్‌పైనా వివాదం నెలకొంది. తాజాగా ‘RC15’ కథ నాదేనంటూ దక్షిణ భారత సినీ రచయితల సంఘాన్ని ఆశ్రయించాడు ఓ రచయిత.

కార్తీక్‌ సుబ్బరాజు దగ్గర సహాయకుడిగా పనిచేసిన సెల్లముత్తు తన కథతోనే శంకర్‌-రామ్‌చరణ్‌ మూవీ తీస్తున్నారని ఆరోపించారు. ప్రస్తుతం దీనిపై విచారణ జరుగుతోంది. ఇరువురి వాదనలు విన్న తర్వాత అసోసియేషన్‌ తుది తీర్పు వెల్లడించనుంది. కార్తీక్‌ సుబ్బరాజు దగ్గరి నుంచే శంకర్‌ ఈ మూవీ కథను తీసుకున్నారని గతంలో వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజా వివాదం ఆసక్తికరంగా మారింది. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. కియారా అడ్వాణీ, అంజలి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. మొదటి షెడ్యూల్‌లో ఓ పాటను చిత్రీకరించేందుకు శంకర్‌ ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని