Rajesh Danda: కలలో కూడా ఊహించని విజయమిది

‘‘మంచి కథాంశంతో వస్తే చిన్న సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుందని ‘సామజవరగమన’తో మరోసారి నిరూపితమైంద’’న్నారు నిర్మాత రాజేష్‌ దండా.

Updated : 23 Jul 2023 14:04 IST

‘‘మంచి కథాంశంతో వస్తే చిన్న సినిమా కూడా పెద్ద విజయం సాధిస్తుందని ‘సామజవరగమన’తో మరోసారి నిరూపితమైంద’’న్నారు నిర్మాత రాజేష్‌ దండా. ఆయన నిర్మాణంలో శ్రీవిష్ణు హీరోగా నటించిన ఈ చిత్రాన్ని రామ్‌ అబ్బరాజు తెరకెక్కించారు. గత నెలలో విడుదలైన ఈ సినిమా తాజాగా రూ.50కోట్ల మార్క్‌ను దాటింది. ఈ నేపథ్యంలోనే  హైదరాబాద్‌లో శనివారం విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు నిర్మాత రాజేష్‌.

‘‘కుటుంబ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకొని పూర్తి వినోదాత్మకంగా తీర్చిదిద్దిన చిత్రమిది. రామ్‌ అబ్బరాజు కథ చెబుతున్నంత సేపూ నవ్వుతూనే ఉన్నా. ఇది ‘నువ్వు నాకు నచ్చావ్‌’, ‘గీత గోవిందం’ లాంటి స్క్రిప్ట్‌ అని నమ్మా. ఈరోజున మా నమ్మకమే నిజమైంది. ఈ కథలో వినూత్నమైన పాయింట్‌ ఉంది. ప్రధమార్ధంలో శ్రీవిష్ణు, నరేష్‌ల మధ్య వచ్చే ఫన్‌, ద్వితియార్ధంలో వెన్నెల కిషోర్‌ చేసిన కులశేఖర్‌ పాత్ర ప్రేక్షకుల్ని అలరిస్తాయని అనుకున్నాం. మేము అనుకున్నట్లుగానే అవి ప్రేక్షకులకు బాగా కనెక్ట్‌ అయ్యాయి. ఇది విజయం సాధిస్తుందని నమ్మాం కానీ, ఇంత భారీ వసూళ్లు వస్తాయని ఊహించలేదు’’.

* ‘‘వాస్తవానికి ఈ కథను సందీప్‌ కిషన్‌తో చేయాలనుకున్నాం. కానీ, అప్పుడు ఆయన ‘మైఖేల్‌’తో బిజీగా ఉన్నారు. దీంతో ఆయన సలహాతో ఈ కథను శ్రీవిష్ణు వద్దకు తీసుకెళ్లాం. ఈ చిత్రానికి అనిల్‌ సుంకర ఇచ్చిన సలహాలు బాగా ఉపయోగపడ్డాయి. ఈ సినిమా విడుదలై నాలుగు వారాలు పూర్తవుతున్నా థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. ఒక చిన్న చిత్రం ఈరోజుల్లో 30రోజులు థియేటర్లలో ఆడటం చాలా పెద్ద విజయం. దీన్ని మేము కలలో కూడా ఊహించలేదు’’.

* ‘‘ప్రస్తుతం మా సంస్థలో సందీప్‌ కిషన్‌తో ‘భైరవ కోన’ అనే చిత్రం చేస్తున్నాం. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని విభిన్నమైన కథాంశంతో హారర్‌ ఫాంటసీ చిత్రంగా సిద్ధం చేస్తున్నాం. గ్రాఫిక్స్‌ చాలా ప్రాధాన్యముంది. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఇది పూర్తయ్యాక సందీప్‌తోనే మరో సినిమా ఉంటుంది. అది నవంబరులో మొదలవుతుంది. నరేష్‌ హీరోగా దర్శకుడు సుబ్బుతో ఓ చిత్రం తెరకెక్కిస్తున్నాం. ‘సామజవరగమన’ రీమేక్‌ హక్కుల కోసం అన్ని భాషల నుంచి డిమాండ్‌ ఉంది. దీన్ని తమిళ్‌లో మేమే రీమేక్‌ చేయాలని అనుకుంటున్నాం’’.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని