ఆ సమయంలో నా చేతులు వణికిపోయాయి!

డ్యాన్స్‌.. డ్యాన్స్‌.. డ్యాన్స్‌.. ఇదే ఆయన కర్త.. కర్మ.. క్రియ. డ్యాన్సే ఆశగా.. శ్వాసగా సాగిపోతుంటారాయన. తాను చేసే ప్రతి పాటలోనూ

Updated : 10 Dec 2020 12:33 IST

డ్యాన్స్‌.. డ్యాన్స్‌.. డ్యాన్స్‌.. ఇదే ఆయన కర్త.. కర్మ.. క్రియ. డ్యాన్సే ఆశగా.. శ్వాసగా సాగిపోతుంటారాయన. తాను చేసే ప్రతి పాటలోనూ ఏదో కొత్తదనం ఉండాలని పరితపిస్తుంటారు. ‘జబర్దస్త్‌’కు వెళ్తే, కంటెస్టెంట్‌లతో కలిసిపోయి ‘శేకు’గా నవ్వులు పంచుతారు. అటు అగ్ర హీరోలతో ఇటు యువ హీరోలతోనూ తనదైన శైలిలో స్టెప్‌లు వేయించి వెండితెరను ‘షేక్‌’ చేసేస్తుంటారు. ‘ఢీ’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. తన కెరీర్‌లో ఎన్నో గెలుపోటములను చవి చూశారు. ఇప్పుడు అదే ‘ఢీ’షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. వెండితెరపై మాస్‌.. క్లాస్‌.. మాంటేజ్‌.. ఇలా డ్యాన్స్‌ థీమ్‌ ఏదైనా తనకు మాత్రమే సొంతమైన స్టెప్‌లతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే వ్యక్తి శేఖర్‌ మాస్టర్‌. బుధవారం యావత్‌ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన ‘ఢీ ఛాంపియన్స్‌’  ముగిసిన అనంతరం ఈనాడు.నెట్‌తో శేఖర్‌ మాస్టర్‌ ప్రత్యేకంగా మాట్లాడారు. అంతేకాదండోయ్‌ ఇంకెన్నో సరదా సంగతులు పంచుకున్నారు. అవన్నీ మీకోసం..

‘ఢీ’తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు అదే షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరించడం ఎలా అనిపించింది?

శేఖర్‌ మాస్టర్‌: నిజంగా దీన్ని నేనెప్పుడూ ఊహించలేదు. ఎవరికీ దక్కని అవకాశం ఇది. ఎందుకంటే నేను ఒక పెద్ద కొరియోగ్రాఫర్‌ అయి, వేరే షోకు వెళ్తే అది వేరు. అదే షోలో కొరియోగ్రాఫర్‌గా‌ పాల్గొని ‘ఢీ2’ ఫైనల్స్‌ వరకూ వెళ్లి ఓడిపోయాను. ఆ తర్వాత ‘ఢీ5’లో విజేతగా నిలిచాను. ఈ షోలో జయాపజయాలను రెండింటినీ చూశాను. షోలో ఓడిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు తెలుసు. అందుకే ప్రతి క్షణం ఎంతో అప్రమత్తంగా ఉంటా. చిన్న చిన్న మూమెంట్స్‌ను కూడా వదిలి పెట్టకుండా చూస్తూ ఉంటా. ‘ఢీ’ జడ్జిగా చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది.

ఈ సీజన్‌ మీకెలా అనిపించింది?

శేఖర్‌ మాస్టర్‌: ప్రతి సీజన్‌లోనూ చాలా మంది డ్యాన్సర్లు వస్తుంటారు. కానీ, ‘ఢీ ఛాంపియన్స్‌’ అనేది చాలా ప్రత్యేకం. ఎందుకంటే గత సీజన్స్‌లో అద్భుతంగా రాణించిన వారందరితో కలిపి ‘ఢీ ఛాంపియన్స్‌’షోను తీర్చిదిద్దారు. అందుకే, ప్రతి రౌండ్‌, ప్రతి వారం ఫైనల్స్‌లానే ఉంటుంది. ఎవరూ తక్కువ కాదు. మధ్యలో ప్రదీప్‌, సుధీర్‌, రష్మి, ఆది, వర్షిణిల ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదిస్తూ మరోవైపు కంటెస్టెంట్‌ వచ్చినప్పుడు చాలా అలర్ట్‌గా ఉండాలి. ప్రతి ఒక్కరూ తమ స్థాయిలో డ్యాన్స్‌ అదరగొట్టేవారు. నిజంగా అదొక కత్తిమీద సాము. కళ్లు మూసి తెరిచేలోపు మంచి మూమెంట్స్‌ వెళ్లిపోతాయి. వాటిని గుర్తించలేకపోతే కంటెస్టెంట్‌ పడిన కష్టానికి అర్థం ఉండదు.

ఈ సీజన్‌లో మీకు నచ్చిన డ్యాన్సర్‌ ఎవరు?

శేఖర్‌ మాస్టర్‌: ప్రతి ఒక్కరూ అద్భుతంగా చేసేవారు. నాకు సోమేశ్‌ డ్యాన్స్‌ అంటే  ఇష్టం. ఏ స్టైల్‌ చేసినా పర్‌ఫెక్ట్‌ ఎక్స్‌ప్రెషన్‌తో చేస్తాడు. ఆ తర్వాత తేజూ డ్యాన్స్‌ నచ్చుతుంది.

అప్పుడప్పుడు ‘జబర్దస్త్‌’లో తళుక్కున మెరుస్తుంటారు. ఎలా అనిపిస్తుంది?

శేఖర్‌ మాస్టర్‌: చాలా సరదాగా ఉంటుంది. అప్పుడప్పుడు చుట్టాలింటికి వెళ్తాం కదా! నాకు ‘జబర్దస్త్‌’కు వెళ్తే అలా అనిపిస్తుంటుంది.

ఒక పక్క బుల్లితెరపై షోలు చేస్తున్నారు. మరోవైపు కొరియోగ్రాఫర్‌గా సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ రెండింటినీ ఎలా సమన్వయం చేయగలుగుతున్నారు?

శేఖర్‌ మాస్టర్‌: ప్రతి ఒక్కరూ ఇదే ప్రశ్న అడుగుతుంటారు. నా షెడ్యూల్‌ అంతా క్రమబద్ధంగా ఉంటుంది. తేదీల విషయంలో షోలకు, సినిమాలకు క్లాష్‌ అయిన సందర్భాలెన్నో. కేవలం ఈ రెండింటి మధ్యే కాదు, సినిమాల విషయంలోనూ అలా ఇబ్బందిపడిన రోజులున్నాయి. ‘సరిలేరు నీకెవ్వరు’ చేస్తున్న సమయంలో ప్రభుదేవా మాస్టర్‌ నుంచి సల్మాన్‌ ‘రాధే’కు డ్యాన్స్‌ కంపోజ్‌ చేయమని ఆఫర్‌ వచ్చింది. అయితే, మహేశ్‌బాబుగారి సినిమాకు అప్పటికే కమిట్‌ అయి ఉండటంతో షెడ్యూల్‌ మార్చలేని పరిస్థితి నెలకొంది. పైగా మన తెలుగు సినిమా, అందులోనూ సూపర్‌స్టార్‌ది కావడంతో ఇదే విషయాన్ని ప్రభుదేవా మాస్టర్‌కు చెబితే ఆయన అర్థం చేసుకున్నారు. ‘ఈసారి కాస్త ముందుగానే చెబుతాను మాస్టర్‌’ అని ఆయన అన్నారు.

సిగ్నేచర్‌ స్టెప్‌ల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?

శేఖర్‌ మాస్టర్‌: మొదట్లో తెలియకుండానే కొన్ని సిగ్నేచర్‌ స్టెప్‌లను కంపోజ్‌ చేసేవాడిని. ప్రేక్షకులకు ఆ సాంగ్‌ చూసినప్పుడు అందులో ఆకట్టుకునే స్టెప్‌ ఉంటే దాన్ని బాగా ఆస్వాదిస్తున్నారు. అప్పటి నుంచి ఏదైనా కొత్తదనం చూపించేందుకు ప్రయత్నిస్తున్నా. ‘ఖైదీ నంబర్‌ 150’లో బెల్ట్‌ ఊపుతూ మెగాస్టార్‌ చేసే స్టెప్‌ అందరికీ గుర్తుండిపోయింది. ఆ పాటకు సామాజిక మాధ్యమాల్లో చాలా మీమ్స్‌, అనుకరణ‌లు వచ్చాయి. వాటిని చూసినప్పుడు భలే ఆనందంగా ఉంటుంది.

సెట్స్‌లో ఎప్పుడూ టెన్షన్‌.. టెన్షన్‌గా కనిపిస్తుంటారట కారణం?

శేఖర్‌ మాస్టర్‌: దర్శక-నిర్మాతలకు నా కొరియోగ్రఫీ నచ్చి అవకాశాలు ఇస్తున్నారు. వారి అంచనాలను అందుకోవాలంటే మరింత కష్టపడాల్సిందే. అందుకే కాస్త టెన్షన్‌ ఉంటుంది.

‘ఢీ’లో తోటి జడ్జిలు ప్రియమణి, పూర్ణలతో కలిసి పనిచేయడం ఎలా అనిపించింది?

శేఖర్‌ మాస్టర్‌: ‘ఢీ’షోకు వచ్చిన తర్వాత మేము మంచి స్నేహితులమయ్యాం. జడ్జిమెంట్‌ విషయంలో ఎవరి నిర్ణయం వారిదే. ప్రతి ఒక్కరూ ఇతరుల నిర్ణయాన్ని గౌరవిస్తారు. వాళ్లిద్దరిలో కథానాయికలుగా చేశామన్న గర్వం ఉండదు. అందరితోనూ కలిసిపోతారు. వాళ్లే కాదు, సుధీర్‌, రష్మి, ప్రదీప్‌, ఆది, వర్షిణి చాలా సరదాగా ఉంటారు.

‘ఢీ’ కన్నాముందు మీ కెరీర్‌ ఎలా సాగింది?

శేఖర్‌ మాస్టర్‌: మాది విజయవాడ. ఇంటర్‌ వరకూ నా చదువంతా అక్కడే. 1996లో హైదరాబాద్‌ వచ్చా. మా మావయ్య ద్వారా ఫైట్‌ మాస్టర్ సాంబశివరావు గారు పరిచయం అయ్యారు. నా డ్యాన్స్‌ చూసి మెచ్చుకుని ఇక్కడే ఉండిపోమన్నారు. అప్పుడు డ్యాన్స్‌లో మరిన్ని మెలకువలు నేర్చుకునేందుకు ఇనిస్టిట్యూట్‌లో చేరా. ఐదారేళ్ల పాటు చాలా ఇబ్బంది పడ్డాను. ఆ తర్వాత రాకేశ్‌ మాస్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో చేరడం, ఆయన నా టాలెంట్‌ను గుర్తించి తన వద్దే ఉండిపొమ్మన్నారు. ‘చిరు నవ్వుతో..’ ‘16టీన్స్‌’ ఇలా పలు చిత్రాలకు రాకేశ్‌ మాస్టర్‌తో కలిసి పనిచేశా.

డ్యాన్సర్‌గా, అసిస్టెంట్‌గా నా కెరీర్‌ మొదలైంది. ఆ తర్వాత మాస్టర్‌ అయ్యాను. ఒకసారి మాస్టర్‌ అయిన తర్వాత మళ్లీ డ్యాన్సర్‌గా చేయలేం. దీంతో తొలినాళ్లలో అవకాశాలు తక్కువగా వచ్చేవి. ప్రభుదేవా, లారెన్స్‌, రాజు మాస్టర్‌లాంటి పెద్ద కొరియోగ్రాఫర్‌ల వద్ద పని చేసి ఉంటే గుర్తింపు త్వరగా వస్తుంది. దీంతో అందరిలానే నేను కూడా అవకాశాల కోసం తిరిగిన రోజులు ఉన్నాయి. హీరో సుధీర్‌బాబుకు డ్యాన్స్‌ క్లాస్‌లు చెప్పేవాడిని. ఆ తర్వాత ఆయనే ‘ఎస్‌ఎంఎస్‌’ సినిమాలో నాకు ఒక సాంగ్‌ ఇచ్చారు. అది చూసి అల్లు అర్జున్‌గారు పిలిచి ‘జులాయి’లో అవకాశం ఇచ్చారు. నేను కంపోజ్‌ చేసిన స్టెప్‌లు అందరికీ నచ్చాయి. ఆ తర్వాత ఎన్టీఆర్‌గారు ‘బాద్‌షా’ కోసం పిలిపించారు. నాలో కష్టపడేతత్వం వాళ్లకు బాగా నచ్చింది.

ఈ ప్రయాణంలో ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయా?

శేఖర్‌ మాస్టర్‌: చాలా ఉన్నాయి. తొలినాళ్లలో దర్శకులను కలిసేందుకు, వాళ్లను ఒప్పించడానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. ఉదయం వెళ్తే సాయంత్రం వరకూ వేచి చూసినా కొన్నిసార్లు అవకాశం వచ్చేది కాదు. ‘హ్యాపీడేస్‌’కు అదే జరిగింది. శేఖర్‌ కమ్ములగారిని కలవడానికి నాకు రెండు రోజులు పట్టింది. ఆ తర్వాత నా డ్యాన్స్‌ డెమో చూపిస్తే, ‘ఈ సినిమాలో సాంగ్స్‌ అన్నీ అయిపోయాయి. తర్వాత చూద్దాం’ అన్నారు. అలా నన్ను గుర్తు పెట్టుకుని మరీ ‘ఫిదా’, త్వరలో రాబోయే ‘లవ్‌స్టోరీ’ సినిమాల్లో అవకాశం ఇచ్చారు.

ఒక పాటకు కొరియోగ్రఫీ చేయమని అవకాశం వచ్చిన తర్వాత ఆ పాట కోసం ఎలా సిద్ధమవుతారు?

శేఖర్‌ మాస్టర్‌: కొందరు హీరోల బాడీ లాంగ్వేజ్‌కు అనుగుణంగా కొన్ని స్టెప్స్‌ అనుకుంటాం. అందుకు ప్రాక్టీస్‌ కూడా చేస్తాం. కొన్నిసార్లు సెట్‌లోకి వెళ్లిన తర్వాత కూడా మంచి మూమెంట్స్‌ వస్తాయి. ‘రాములో రాములా’ పాటలో వేసిన స్టెప్స్‌ ముందుగా సాధన‌ చేయలేదు. సెట్‌కు వెళ్లిన తర్వాత వచ్చిన ఆలోచన అది. అదే విధంగా ‘బంతి పూల జానకి’ పాట కూడా అలా జరిగింది.

వెండితెరపై కనిపించే అవకాశం ఉందా?

శేఖర్‌ మాస్టర్‌: ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు. చాలా అవకాశాలు వచ్చాయి. కానీ, ప్రస్తుతం నా దృష్టి అంతా డ్యాన్స్‌పైనే.

అన్ని రకాల సాంగ్స్‌కు నృత్యాలు సమకూరుస్తున్నారు. ఏ థీమ్‌కు కొరియోగ్రఫీ చేయడం మీకు కష్టం?

శేఖర్‌ మాస్టర్‌: ఇది చాలా ఈజీ అని ఏ థీమ్‌కూ ఉండదు. అయితే, ఏది చేయాలన్నా బాగా ఇష్టంతో చేస్తాం. మాంటేజ్‌ సాంగ్స్‌ చేయాలంటే ఆ ఫీల్‌ రావాలి. ఇక మాస్‌ సాంగ్స్‌కు అదిరిపోయే స్టెప్‌లు డిజైన్‌ చేయాలి. పెద్ద హీరోలైతే అంచనాలు మరీ ఎక్కువగా ఉంటాయి. అందుకే ప్రతి పాటకు రెండు మూడు వెర్షన్లు చేసి పెట్టుకుంటాం. ఖాళీ సమయంలో కూడా ప్రాక్టీస్ చేస్తుంటాం.

ఫలానా పాటకు గ్రూప్‌ డ్యాన్సర్లు కావాలి? ఈ పాటకు అక్కర్లేదు? అని ఎలా డిసైడ్‌ చేసుకుంటారు?

శేఖర్‌ మాస్టర్‌: సినిమా ఇండస్ట్రీ క్రియేటివ్‌ ఫీల్డ్‌. అద్భుతమైన బీట్‌ ఉన్న సాంగ్‌కు డ్యాన్సర్లు లేకుండా కూడా మూమెంట్స్‌ చేయించొచ్చు. అదే సమయంలో ఇద్దరు, 10 మంది.. 100మందిని కూడా పెట్టి తీయొచ్చు. ఎవరి ప్రజంటేషన్‌ వారిది. ఎవరికి వారే ఆ నిర్ణయం తీసుకుంటారు.

సెట్‌లో ఇబ్బంది పడుతూ పాటలు చేసిన సందర్భాలు ఏవైనా ఉన్నాయా?

శేఖర్‌ మాస్టర్‌: చాలా సార్లు అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా. ‘బాద్‌షా’లో ‘బంతి పూల జానకి’ పాటను -14 డిగ్రీల వాతావరణం ఉన్న చోట షూట్‌ చేశాం. విపరీతమైన చలిగాలి. అలాగే నాలుగు రోజుల పాటు షూట్‌ చేశాం. ఆ తర్వాత అక్కడి నుంచి మరో సినిమాకు మస్కట్‌ వెళ్లాను. అక్కడ 50డిగ్రీల ఉష్ణోగ్రత. విపరీతమైన ఎండ. తట్టుకోలేకపోయాను. ముక్కు నుంచి రక్తం కూడా కారింది. డాక్టర్‌ను కలిస్తే, రెండు వేర్వేరు వాతావరణాల్లో పనిచేయడం వల్ల వచ్చిన ఇబ్బంది అని చెప్పారు. ఆ రోజు కనీసం లేచి నిలబడే ఓపిక కూడా లేదు. దేవుడి దయ వల్ల ఆ రోజు షూటింగ్‌ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నా. ‘పోస్ట్‌బాక్స్‌’ సినిమాకు కూడా 103 జ్వరంతోనే సాంగ్‌ కంపోజ్‌ చేయాల్సి వచ్చింది.

ఇతర కొరియోగ్రాఫర్లలో ఎవరి కంపోజిషన్‌ మీకు ఇష్టం!

శేఖర్‌ మాస్టర్‌: రాజు సుందరం మాస్టర్‌ కొరియోగ్రఫీ చాలా బాగుంటుంది. ప్రతిదీ ప్రత్యేకంగా డిజైన్‌ చేసుకుంటారు. ప్రభుదేవా మాస్టర్‌ గురించి ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

‘ఆకాశం నీ హద్దురా’లో ‘కాటుక కనులే’ పాట మంచి ట్రెండ్‌ అయింది. మీకెలా అనిపించింది?

శేఖర్‌ మాస్టర్‌: చాలా మంది ఆ పాటపై వీడియోలు కూడా చేశారు. ప్రతి సన్నివేశంపైనా స్పష్టత ఉన్న దర్శకురాలు సుధా కొంగర. ఆమె పని కూడా వేగంగా ఉంటుంది. ఉదయం 6.30 గంటలకు షాట్‌ అంటే ఆ సమయానికి అందరూ సెట్‌లో ఉండాల్సిందే. ‘కాటుక కనులే’ చేస్తున్నప్పుడు నేను ఐదు నిమిషాలు ఆలస్యంగా వెళ్లా. సెట్‌కు వెళ్లి చూస్తే, హీరో సూర్యతో సహా అందరూ అప్పటికే అక్కడకు వచ్చారు. ఆ సమయంలో కాస్త ఇబ్బంది పడ్డాను.

పండగల సమయంలో ‘ఈటీవీ’లో వచ్చే ప్రత్యేక కార్యక్రమాల్లో మీరూ, రోజా చేసే పాటలకు మంచి క్రేజ్‌ ఉంటుంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఏమైనా సాధన చేస్తారా?

శేఖర్‌ మాస్టర్‌: రోజాగారు చాలా మంచి డ్యాన్సర్‌. ఏదైనా ఈవెంట్‌ ఉందంటే  ఒకరోజు ముందు వచ్చి ప్రాక్టీస్‌ చేస్తారు. ఒక వేళ నేరుగా సెట్స్‌లోకి వెళ్లినా ఆమె ఎక్కడా తడబడరు. చాలా సరదాగా ఉంటారు. మేమిద్దరం ఈవెంట్‌లో ఉంటే, మాకొక సాంగ్‌ డిజైన్‌ చేస్తారు. ఆమె అందరితోనూ కలిసిపోతారు.

ఇటీవల ‘రంగ్‌దే’ కోసం దుబాయ్‌ వెళ్లారు. ఇంకా కొవిడ్‌ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అక్కడ షూటింగ్‌ ఎలా చేశారు?

శేఖర్‌ మాస్టర్‌: ప్రస్తుతం సినిమా షూటింగ్‌ చేయడమనేది కత్తిమీద సామే. ఇక్కడ నుంచి బయలుదేరే ముందు చిత్ర బృందానికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అక్కడకు వెళ్లిన తర్వాత కూడా మరోసారి పరీక్షలు చేశారు. అక్కడ కొవిడ్‌ రిపోర్ట్‌ రావడానికి 24 గంటలు పడుతుంది. అది వచ్చిన తర్వాత షూటింగ్‌కు వెళ్లాం. కొవిడ్‌ నిబంధలను పాటిస్తూ ఎక్కడా రాజీపడకుండా చిత్రీకరణ పూర్తి చేశాం.

‘రంగ్‌దే’ షూటింగ్‌ ఎక్కడ దాకా వచ్చింది?

శేఖర్‌ మాస్టర్‌: ఒక పాట మినహా పూర్తయింది. త్వరలోనే దాన్ని కూడా పూర్తి చేస్తారు. నితిన్‌ నటిస్తున్న మరో చిత్రం ‘అంధాదున్‌’ రీమేక్‌ కూడా దుబాయ్‌లో ఇటీవల ప్రారంభమైంది. అందుకు సంబంధించి కొన్ని సీన్స్‌, ఒక పాట పూర్తి చేశారు.

‘ఢీ ఛాంపియన్స్‌’ విజేతను ప్రకటించినప్పుడు మీరెలా ఫీలయ్యారు?

శేఖర్‌ మాస్టర్‌: నిజంగా ఆ సమయంలో అందరికీ ఒకటే టెన్షన్‌. ఎందుకంటే పీయూష్‌, సోమేశ్‌ ఇద్దరూ చాలా బాగా కష్టపడ్డారు. ఎవరూ తక్కువ కాదు. షో ప్రారంభమైన నాటి నుంచి ఎవరి స్థాయిలో వాళ్లు అదరగొడుతూ వచ్చారు. పైగా కోట్లమంది మెచ్చిన షో. అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. దాంతో విజేతను ప్రకటించేటప్పుడు నా చేతులు వణికిపోయాయి. విన్నర్‌ పీయూష్‌ మంచి డ్యాన్సర్‌. చాలా కష్టపడతాడు. గతంలో ‘ఢీ జోడి’లో కూడా చేశాడు. ఆ తర్వాత చాలా నేర్చుకున్నాడు. ఈసారి క్వార్టర్‌ ఫైనల్స్‌, సెమీ ఫైనల్స్‌లో తడబడ్డాడు. కానీ, ఫైనల్స్‌లో ఎక్కడా బెరుకు లేకుండా చేశాడు. ఇక రన్నర్‌ సోమేశ్‌ గ్రూప్‌ డ్యాన్సర్లలో ఒకడిగా కెరీర్‌ స్టార్ట్ చేశాడు. అక్కడి నుంచి గత సీజన్‌లో ఫైనల్స్‌ వరకూ వచ్చి  టైటిల్‌ గెలుచుకోలేకపోయాడు. ఇప్పుడు కూడా ఫైనల్స్‌లో తొలి రౌండ్‌ బాగా చేశాడు. ఆ తర్వాతి రౌండ్‌లో కొద్దిగా తడబడ్డాడు. పాపం బ్యాడ్‌లక్‌. ‘ఢీ’లాంటి షో ద్వారా మా కొరియోగ్రాఫర్లు ప్రపంచానికి పరిచయం అవుతున్నారు. నేను, గణేశ్‌, జానీ, రఘు, బాబా భాస్కర్‌ ఇలా ఎంతో మందికి లైఫ్‌ ఇచ్చింది. ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడిమైపోయాం. ఈ అవకాశం ఇచ్చిన, ఈటీవీ, మల్లెమాల వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం.

చాలా మంది కొరియోగ్రాఫర్లు దర్శకత్వం చేశారు. మరి మీరు?

శేఖర్‌ మాస్టర్‌: ప్రస్తుతానికి అలాంటి ఆలోచన ఏమీ లేదు. అంతా డ్యాన్స్‌. అయితే, నాకు లవ్‌స్టోరీలంటే చాలా ఇష్టం.

మళ్లీ చిరంజీవి ‘ఆచార్య’కు ఏమైనా పనిచేస్తున్నారా?

శేఖర్‌ మాస్టర్‌: ప్రస్తుతం ‘రంగ్‌దే’, ‘సోలో బ్రతుకే సో బెటర్‌’, ‘లవ్‌స్టోరీ’ సినిమాలకు కొరియోగ్రఫీ చేశా. కొన్ని చర్చల దశలో ఉన్నాయి. మెగాస్టార్‌ కొత్త చిత్రానికి కూడా ఆఫర్‌ వచ్చింది. ప్రస్తుతం వెయిటింగ్‌.

పెద్ద హీరోల సినిమాలకు పనిచేసేటప్పుడు ‘వన్‌మోర్‌’ చెబుతారా?

శేఖర్‌ మాస్టర్‌: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న హీరోలందరూ బాగా డ్యాన్స్‌ చేసేవాళ్లే. అదే సమయంలో వాళ్లు కొరియోగ్రాఫర్‌ ఫీలింగ్స్‌ను అర్థం చేసుకోగలరు. చిరంజీవిగారి ‘ఖైదీ నంబర్‌ 150’కి చేయడం నా అదృష్టం. ఆ సమయంలో ఆయన డ్యాన్స్‌ చేస్తున్న షాట్‌ అయిపోగానే నా వంక చూసేవాళ్లు. నా ముఖంలో ఏమైనా కాస్త ఇబ్బంది అనిపిస్తే, ‘మాస్టర్‌కు ఇంకా నచ్చలేదనుకుంటా. వన్‌మోర్‌ చేద్దాం’ అని ఆయనే చెప్పేవారు.

ఏ హీరోతో ఇప్పటివరకూ మీకు చేసే అవకాశం రాలేదు?

శేఖర్‌ మాస్టర్‌: పవన్‌కల్యాణ్‌ గారు, ప్రభాస్‌గారితో చేసే అవకాశం రాలేదు.

ఇనిస్టిట్యూట్‌ పెట్టి డ్యాన్స్‌ నేర్పించే అవకాశం ఉందా?

శేఖర్‌ మాస్టర్‌: ప్రస్తుతానికి ఆ ఆలోచన లేదు. ఎందుకంటే ఇటు సినిమాలు అటు షోలతో బిజీగా ఉంటున్నా. ఇనిస్టిట్యూట్‌ పెడితే దానికంటూ సమయం కేటాయించాల్సి ఉంటుంది.

షూటింగ్స్‌ లేకపోతే ఏం చేస్తారు?

శేఖర్‌ మాస్టర్‌: ఎక్కువ సమయం ఫ్యామిలీతో గడిపేందుకు కేటాయిస్తా. లేకపోతే డ్యాన్స్‌ సాధన చేస్తా.‌

డ్యాన్స్‌ను కెరీర్‌గా ఎంచుకునేవాళ్లకు మీరిచ్చే సలహా?

శేఖర్‌ మాస్టర్‌: డ్యాన్స్‌ అనేది ఒక కళ‌. దాన్ని ఎంతో ప్రేమించాలి. అప్పుడే ఈ రంగంలో రాణించగలం. మీరనుకునే స్థాయికి వచ్చే వరకూ నిరంతరం కష్టపడండి. కష్టపడేవాళ్లకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి.




Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని