Sirivennela Sitharama Sastry: సిరివెన్నెల.. సిరా వెన్నెల

అక్షరాలు.. చైతన్య కిరణాలై ఉదయిస్తుంటాయి...ఆయన కలం నుంచి జాలువారినప్పుడు.అక్షరాలు.. స్ఫూర్తి తరంగాలై ఎగిసిపడుతుంటాయి...ఆయన అంతరంగంలో మెరిసినప్పుడు.అక్షరాలు.. హితబోధ చేస్తాయి.ఆయన అందుకున్న కాగితంపై రూపుదిద్దుకున్నప్పుడు.అక్షరాలు.. ప్రశ్నలై మెదళ్లను తొలుస్తుంటాయి...

Published : 01 Dec 2021 05:14 IST

అక్షరాలు.. చైతన్య కిరణాలై ఉదయిస్తుంటాయి...
ఆయన కలం నుంచి జాలువారినప్పుడు.
అక్షరాలు.. స్ఫూర్తి తరంగాలై ఎగిసిపడుతుంటాయి...
ఆయన అంతరంగంలో మెరిసినప్పుడు.
అక్షరాలు.. హితబోధ చేస్తాయి.
ఆయన అందుకున్న కాగితంపై రూపుదిద్దుకున్నప్పుడు.
అక్షరాలు.. ప్రశ్నలై మెదళ్లను తొలుస్తుంటాయి...
ఆయన కళ్లు సమాజాన్ని చూసి ఎర్రబడ్డప్పుడు.
అక్షరాలు... ప్రేమ రెక్కలు కట్టుకొని ఎగిరేస్తాయి.
అమ్మఒడిలో ఒదిగిపోయి మురిసిపోతాయి.
అబల గుండెలో ధైర్యమవుతాయి.
యువకుడి కండరాల్లో శక్తినింపుతాయి.
ఆయన కలం పట్టి కాగితంతో దోస్తి చేస్తున్నప్పుడు...
ఇప్పుడా కలం ఒంటరిదైపోయింది.
కాగితం కళ కోల్పోయి విలవిలలాడుతోంది.

మరి అక్షరాలు..?

నిత్యచైతన్య సాహిత్య సూర్యుడి చుట్టూ చేరి
గుండెలు బాదుకొని ఏడుస్తున్నాయి.
వెన్నెలను మింగే అమావాస్యలా...
మన సిరివెన్నెలను చుట్టుముట్టిన
చీకట్లను చీల్చుకొంటూ
సీతారాముడు మళ్లీ ఉదయిస్తాడని
ఎదురుచూస్తున్నాయి.
తెలుగు సినిమా పాటను
ప్రేమించే మనలాగే...


నేనెప్పుడూ సినిమాల్లోకి రావాలని అనుకోలేదు. సినీ గేయ రచయితను అవ్వాలని అనుకోలేదు. వాస్తవానికి నా చిన్నతనంలో నేను రాస్తున్న దాన్ని కవిత్వం అంటారనే అవగాహన కూడా నాకు లేదు.


దేహానికి దెబ్బ తగిలితే మందు కావాలి. ఆత్మకు తగిలితే మందు సరిపోదు. మనసు కావాలి. అప్పుడే కవిత్వం అవసరమవుతుంది.


అది నీలాకాశం నుంచి కురిసే వెన్నెల కాదు!
పాళీ నుంచి కురిసే నీలం రంగు సిరా వెన్నెల.. సిరివెన్నెల!
ఆ వెన్నెల జల్లు వెల్లువెత్తేది ఆయన పాటల కనుసన్నల!
అది హృదయానికి ఎంత హాయినిస్తుందో..
అన్యాయం మాటెత్తితే అగ్గిలా రాజుకొంటుంది!
ఆయన పాట ప్రేమకు చిరునామా
అది అల్లరి పాటల హంగామా
ఇక అభ్యుదయ గీతం అందుకొంటే మర్చిపోతామా?
అలాంటి పాటే నన్ను ఆయన్ని ఆరాధించేలా చేసింది.
‘‘గాలి వాటు గమనానికి నీ కాలిబాట దేనికి?
గొర్రెదాటు మందకి నీ జ్ఞానబోధ దేనికి?..’’ అని ఎంత బోధించినా మారని ఈ సమాజాన్ని ప్రశ్నించిన తీరు నన్ను ఆయన పక్షాన నిలబెట్టింది!


నా ఎన్నో వేల రాత్రుళ్లు ఆయన పాటల్లో కరిగిపోయేవి! వీధుల వెంట వెన్నెల కురుస్తుంటే.. లోపల కురుస్తున్న వెన్నెల అక్షరాల్లో ఆయన బాణీలు తడిసి ముద్దయేవి! బల్ల మీద చరుస్తూ.. కళ్లు రెండూ మూసుకుని వింతైన గొంతుతో ఆయన పాటను పసిపాపలా ఎత్తుకుంటే.. అది కేరింతలతో చప్పట్లు కొట్టేది! ఆయన పాటలకు నేను ఎన్నోసార్లు తొలి శ్రోతనయ్యాను! ।మణీ..! ఈ పాట విను.. విని ఎలా ఉందో చెప్పు..?। అని పాట వినిపిస్తుంటే సంతోషంతో పొంగిపోయేవాణ్ని. అలా ఎన్నో రాత్రుళ్లు ఆ పాటలు వెదజల్లే వెన్నెల, వేడిమి.. రెండూ నన్ను కూడా తాకేవి!

అప్పట్లో ఆయన ‘పెళ్లి’ సినిమాలో రాసిన ‘జాబిలమ్మ నీకు అంత కోపమా..?’ పాట పెద్ద హిట్‌! అయితే ఆ పాటలో దోషాన్ని ఎత్తి చూపుతూ మా తెలుగు ప్రొఫెసర్‌ ఒకాయన జాబిలమ్మ అంటూ జాబిలికి అమ్మ అనే పదాన్ని జోడించ కూడదంటూ విమర్శించారు. ఆ విషయాన్నే చెబితే.. ఆయన తేలిగ్గా కొట్టి పారేస్తూ.. ప్రాచీన వాంగ్మయాల్లో నుంచి అన్నమయ్య పాటని ఉటంకిస్తూ..‘చందమామ రావే..’ అనే గీతంలో చందమామని రావే అని పిలవలేదా అని చెప్పారాయన!

సినిమా పాటకీ ఇతర సాహిత్య ప్రక్రియలకి ఇచ్చినట్టుగానే జ్ఞానపీఠ పురస్కారాన్ని ఇవ్వాలని ఆయన తరచూ చెబుతుండేవారు! ఒకసారి చెన్నయ్‌లో తెలుగు సాహిత్యం మీద ఒక సెమినార్‌ జరిగింది. అందులో పాత సినిమా సంగీత చరిత్రకారులుగా పేరున్న ఓ ప్రముఖ వ్యక్తి పాల్గొన్నారు. ఆ సభ ముగిసిన తర్వాత ఆయన నా వద్దకొచ్చి ఓ పాటని చూపిస్తూ అడిగారు.. ‘‘ఇది అన్నమయ్య సంకీర్తనలా ఉంది. నేను కొన్ని వేల సంకీర్తనలు పరిశీలించి ఉంటాను.. కానీ ఇది నాకెక్కడా కనిపించలేదే?’’ అని. నిజానికి అది సిరివెన్నెల గారు రాసిన పాట!  ‘శ్రుతిలయలు’ సినిమాలోది. ‘తెలవారదేమో స్వామీ..’ అనే పల్లవితో మొదలవుతుంది. ఈ పాటలోని చరణాలు గమనిస్తే ఎవరైనా అవాక్కవడం ఖాయం. తొలుత జేసుదాసు, నంది అవార్డు కమిటీలూ ఇలా అన్నమయ్యే దీన్ని రాశారనుకున్నారట.

‘‘మక్కువ మీరగ అక్కున జేరిచి అంగజు కేళిని పొంగుచు తీర్చగ ఆ మత్తునే మది మరి మరి తలచగ.. అలసిన దేవేరి అలమేలుమంగకు.. తెలవారదేమో స్వామీ..’’ ఇలా సాగుతుంది ఆ పాట. వాగ్గేయకారుడు ఈ కీర్తనని రాశారంటే విన్న వాళ్లకు ఎక్కడా సందేహం రాని స్థాయిలో సాహిత్యం కనిపిస్తుంది. మరి ఇంత గొప్ప పాట రాసిన రచయితని జ్ఞానపీఠంపై ఎక్కించాల్సిన అవసరం నేటి తరానికి లేదా? సినిమా పాటని విమర్శించే వారికి ఈ సాహిత్యం సిరివెన్నెల జవాబు!

నేను సినిమాల్లో పాటలు రాయడం మొదలు పెట్టాక ఆయన చెబుతుండే వారు.. ‘మనకిచ్చిన పాటని ఇక ఇంతకన్నా గొప్పగా రాయలేను..’ అన్నంత వరకూ శ్రమించి రాయాలని! ఆ మాట నేను పాటించే ఓ భగవద్గీత!
సినిమా పరిశ్రమ అంటేనే పోటీ తత్వానికి నిలయం! అలాంటి చోట ఒక మంచి పాట రాస్తే అది ఎంతటి చిన్న రచయిత అయినా సరే.. భుజం తట్టి ప్రోత్సహించే గుణం ఆయనది! నేను ‘హ్యాపీడేస్‌’ చిత్రానికి పాటలు రాసినప్పుడు నాకు ఫోన్‌ చేసి.. దాదాపు మూడు గంటలు ఆ పాటల గురించి గొప్పగా చెప్పి అభినందించారు! ఆ గుణం ఎంతమందిలో ఉంటుంది? వ్యక్తికి కాకుండా.. ఆ వ్యక్తిలోంచి పుట్టిన సాహిత్య విలువలకు పట్టం కట్టినప్పుడే ఇలాంటి భేషజాల్లేని భావన కలుగుతుంది! నిజమైన సాహిత్యకారుని విలక్షణ రూపం ఇది! ఆ భావన ఉన్నది కనుకే ఆయన పాట జేగీయమానంగా వెలుగొందింది.

ఆయన పాటల్లో ప్రధాన లక్షణం ఒకటుంది.. అది వీలైనంత వరకూ పాటల్లో ప్రయోగించే చక్కటి తెలుగు పదాలు! నేటి యువతకు అర్థమయ్యేలా రాస్తూనే.. పెద్దబాలశిక్ష పేజీల్ని పాటల్లో తిరగేస్తారు! ‘ఇచట పుట్టిన చిగురు కొమ్మైన చేవ..’ అన్నట్టుగా ఆయన కలంలో కనుదెరిచిన తెలుగు పాటేదైనా సరే.. తేట తేటగా మనల్ని ఊరిస్తుంటుంది. అందుకే ఆయన పరభాషా గాయకులు తెలుగు పాటలు పాడడాన్ని ప్రోత్సహించేవారు కాదు. ఆయన తన పాటల్లో తెలుగు లోగిళ్లలో వినిపించే రోజువారీ మాటల్నే వాడేవారు. ఒకవేళ వేరే మాటలు వాడాల్సి వస్తే అందులో ఇతరత్రా కారణం ఉంటుందే తప్ప ఆయన పూనుకొని రాసినవి కావు. లేదంటే ఆయన పాళీ నిత్యం అచ్చతెనుగు పల్లవుల్నీ చరణాలనే పాడుకొంటుంది. అది తెలుగు భాషా ప్రియుల అదృష్టం! ఆ అదృష్టానికి ఇప్పుడు తెలుగు సినిమా నోచుకోకుండా పోయింది.

ఇవాళ..  ఆయన పాటే ఆయనకు నివాళి..

గాలి పల్లకీలోన తరలి మన పాట నేడు ఊరేగి వెడలె గొంతు వాకిలిని మూసి మరలి తను మూగబోయి మన గుండె మిగెలె..!

- వనమాలి, గీత రచయిత


కనిపించి.. వినిపించిన తొలిపాట

సిరివెన్నెల రాసి, బాణీ కట్టిన ఆలపించిన గీతాలనగానే.. అందరికీ ముందుగా గుర్తొచ్చేది ‘గాయం’లోని ‘‘నిగ్గదీసి అడుగు..’’ పాటే. అయితే ఆయనలా ఆలపించిన వాటిలో మొదటిది ‘కళ్లు’ చిత్రంలోని ‘తెల్లారింది లెగండోయ్‌..’ గీతం. ఈ పాటతోనే సిరివెన్నెల తొలిసారి తెరపైనా తళుక్కున మెరిశారు. ఈ పాట గురించి సీతారామశాస్త్రి ఓ సందర్భంలో ఇలా పంచుకున్నారు. ‘‘కళ్లు’ అనే సినిమా సారాంశం అంతా ఉండేలా ఆ పాట రాశాను. నా అన్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం దగ్గరకు ఆ పాట తీసుకెళ్లి వినిపించాను. మొత్తం విన్నాక.. ‘ఈ పాటను నువ్వే పాడేయ్‌ తమ్ముడు’ అన్నారు. తొలుత వద్దనుకున్నా. అయితే అన్నయ్య రిహార్సల్స్‌ అని చెప్పి.. నాతో పాట పాడించేశారు. ఆ పాట అందించిన విజయాన్ని ఎప్పటికీ మర్చిపోలేను’’ అంటూ ఆ పాట వెనకున్న కథను వివరించారు సిరివెన్నెల.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని