Sudeep: నిర్మాతలకు సుదీప్‌ డెడ్‌ లైన్‌.. రూ.10 కోట్ల పరువు నష్టం దావా

తనపై ఆరోపణలు చేసిన నిర్మాతలపై నటుడు సుదీప్‌ (Sudeep) ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పరువుకు భంగం కలిగించిన వారిపై పరువు నష్టం దావా వేశారు. 

Updated : 08 Jul 2023 20:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తన గురించి విమర్శలు చేసిన నిర్మాతలు ఎం.ఎన్‌.కుమార్‌, ఎం.ఎన్‌.సురేశ్‌పై నటుడు సుదీప్‌ (Sudeep) రూ.10 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. మూడు రోజుల్లోగా తనకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. ఈ మేరకు ఆయన లీగల్‌ టీమ్‌ తాజాగా ఓ స్టేట్‌మెంట్‌ను విడుదల చేసింది.

‘‘నిర్మాతలు ఎం.ఎన్‌.కుమార్‌, ఎం.ఎన్‌.సురేశ్‌ చేసిన ఆరోపణలతో సుదీప్‌, ఆయన కుటుంబం మానసిక వేదనకు గురైంది. వాళ్ల మాటలు ఆయన వ్యక్తిగత, వృత్తిపరమైన ఇమేజ్‌కు భంగం కలిగించాయి. తనని అభిమానించే, ఆదర్శంగా తీసుకునే ప్రేక్షకులు సైతం ఈ విషయంపై చర్చించుకోవడం ఆయన్ని ఎంతగానో కలచివేసింది. ఇండస్ట్రీలోని పలువురు నిర్మాతలు సుదీప్‌తో సినిమాలు చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. ఈమేరకు చర్చలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా వచ్చిన ఆరోపణల వల్ల ఆయనతో సినిమాలు చేయడానికి వాళ్లు భయపడుతున్నారు. ఇచ్చిన ఆఫర్లను కూడా వెనక్కి తీసేసుకుంటున్నారు’’ అని ఆ స్టేట్‌మెంట్‌లో రాసి ఉంది.

కన్నడ చిత్రపరిశ్రమకు చెందిన సుదీప్‌.. హీరో, ప్రతినాయకుడిగా ఎన్నో ఏళ్ల నుంచి ప్రేక్షకులను అలరిస్తున్నారు. దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ఆయన సినిమాలు చేస్తున్నారు. ‘విక్రాంత్‌ రోణ’ తర్వాత ఆయన ఇటీవల మరో పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ అనౌన్స్‌ చేశారు. ఇదిలా ఉండగా.. సుమారు ఎనిమిదేళ్ల క్రితం సుదీప్‌ తన వద్ద నుంచి అడ్వాన్స్‌ తీసుకున్నారని, ఆనాటి నుంచి ఇప్పటివరకూ తమ బ్యానర్‌లో సినిమా చేయలేదని, తమని తప్పించుకుని తిరుగుతున్నారంటూ కొన్నిరోజుల క్రితం ఎం.ఎన్‌.కుమార్‌, ఎం.ఎన్‌.సురేశ్‌ ఆరోపణలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని