Sundeep Kishan: ‘ఈగల్‌’తో క్లాష్‌.. మేము డేట్‌ మార్చుకోలేం: సందీప్‌ కిషన్‌

‘ఈగల్‌’(Eagle)తో క్లాష్‌పై నటుడు సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) స్పందించారు. రవితేజ (Raviteja)ను తాను అభిమానిస్తానన్నారు. 

Updated : 18 Jan 2024 15:59 IST

హైదరాబాద్‌: సందీప్‌ కిషన్‌ (Sundeep Kishan) హీరోగా నటించిన థ్రిల్లర్‌ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’ (Ooru Peru Bhairavakona). వి.ఐ.ఆనంద్‌ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా సందీప్‌ కిషన్‌ సినిమా విడుదలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ సినిమాతోపాటే రవితేజ (Raviteja) నటించిన ‘ఈగల్‌’ (Eagle) విడుదల కావడంపై స్పందించారు. దాని రిలీజ్‌కు సంబంధించి తమకు ఎలాంటి ఫోన్‌ కాల్స్‌ రాలేదన్నారు.

ఇలాంటి చిత్రంలో నటించడానికి ఎందుకింత ఆలస్యం చేశారు?

సందీప్‌: ఇలాంటి చిత్రాన్ని తెరకెక్కించడం అంత సులభం కాదు. సమయం, బడ్జెట్‌, శ్రమ.. అన్నీ అధిక మొత్తంలో ఖర్చుపెట్టాల్సి ఉంటుంది. ‘టైగర్‌’ తర్వాత ఆనంద్‌తో నేను చేస్తున్న సినిమా ఇది. ఈ సినిమాలో అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. నేను ఈ మాట అనడానికి కారణం ఏమిటో.. సినిమా విడుదలయ్యాక మీకే తెలుస్తుంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చూడగలిగే చిత్రం ఇది.

చేతబడిని మీరు నమ్ముతారా? వాటివల్ల భయపడిన సందర్భాలున్నాయా?

సందీప్‌: చిన్నప్పటి నుంచి నాకు దెయ్యం కథలు.. ఈ జానర్‌ సినిమాలంటే ఇష్టం. అందుకే నేను చేసిన ఓ పని వల్ల తెలిసో తెలియకో స్కూల్‌ నుంచి సస్పెండ్‌ అయ్యా. అక్కడ చదివే రోజుల్లో ఓజా బోర్డు ఎలా పనిచేస్తుందో చూద్దామని స్నేహితులతో కలిసి క్లాస్‌ రూమ్‌లో ట్రై చేశా. టీచర్‌ మమ్మల్ని రెండు రోజులు సస్పెండ్‌ చేశారు. అప్పట్లో ఆ విషయం స్కూల్లో చర్చనీయాంశమైంది. దానివల్ల ఎన్నో ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నా.

Samantha: జీవితంలో నేను చేసిన అతి పెద్ద తప్పు అదే..: సమంత

సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ‘ఈగల్‌’కు సోలో డేట్‌ ఇస్తామని తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, తెలుగు సినీ నిర్మాతల మండలి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. మరి, ఆ సినిమా ఇప్పుడు మీతోపాటు రిలీజ్‌కు సిద్ధమైంది. దానిపై స్పందన ఏమిటి?

సందీప్‌: నిజం చెప్పాలంటే.. మేము కూడా సంక్రాంతికే రావాలని అనుకున్నాం. ఆ రేసులో చాలా సినిమాలు ఉండటం చూసి ఇది సరైన సమయం కాదని నిర్ణయించుకుని ఫిబ్రవరికి వెళ్దాం అనుకున్నాం. అప్పటికే ఫిబ్రవరి 9న ‘టిల్లు స్క్వేర్‌’ను ప్రకటించారు. మేము వాళ్లకు ఫోన్‌ చేసి మాట్లాడుకుని రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేశాం. ఈ పరిస్థితుల్లో డేట్‌ మార్చుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే, ఇప్పటికే ఎంతో సమయం తీసుకున్నాం. రవితేజను నేను అభిమానిస్తాను. వి.ఐ.ఆనంద్‌ గత చిత్రం రవితేజతోనే చేశారు. ‘ఈగల్‌’ నిర్మాణ సంస్థ పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీతో మా నిర్మాతకు సత్సంబంధాలున్నాయి. ‘ఈగల్‌’ రిలీజ్‌ డేట్‌ విషయంలో మాకు ఎలాంటి కాల్స్ రాలేదు. ఒకవేళ వాళ్లు మాకు ఫోన్‌ చేసి మాట్లాడితే స్పందించేవాళ్లం.

‘ఈగల్‌’ వాయిదా గురించి జరిగిన ప్రెస్‌మీట్‌లో మీ సినిమా పేరు ఎవరూ చెప్పలేదు?

రాజేశ్‌: మర్చిపోయి ఉండొచ్చు. గుర్తు రాలేదనుకుంటా. రెండున్నరేళ్లు కష్టపడ్డాం. ఫిబ్రవరి 9వ తేదీనే రావాలని ఫిక్స్‌ అయ్యాం. వెనక్కి వెళ్తే మాకు ఎన్నో సమస్యలున్నాయి.

‘‘హను-మాన్‌’ సక్సెస్‌ పట్ల ఎంతో సంతోషించా. నమ్మినదాని కోసం తేజ, ప్రశాంత్‌ మూడు సంవత్సరాలు శ్రమించారు. ప్రతి సినిమా ‘హను-మాన్‌’ అవుతుందని నేను చెప్పను. కానీ, ప్రయత్నం అలా ఉండాలని నమ్ముతా. ఆ సినిమా అంత హిట్‌ కావడానికి ముఖ్య కారణం మీడియా, ప్రేక్షకులు. ఈ వేదికగా ఆ చిత్ర బృందానికి కంగ్రాట్స్‌’’ - సందీప్‌ కిషన్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని