Radheshyam: ‘రాధేశ్యామ్‌’ 2022లోనే అని నాలుగేళ్ల కిందే చెప్పారు

‘‘మనకూ... మన నమ్మకానికీ మధ్య జరుగుతున్న యుద్ధమే ‘రాధేశ్యామ్‌’ కథ. ఇది జరిగిపోయింది కాదు, జరగబోయేది కాదు... ఎప్పుడూ జరిగే ఓ కథ’’ అన్నారు రాధాకృష్ణ కుమార్‌. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘రాధేశ్యామ్‌’.

Updated : 26 Dec 2021 08:39 IST

రాధాకృష్ణ కుమార్‌

‘‘మనకూ... మన నమ్మకానికీ మధ్య జరుగుతున్న యుద్ధమే ‘రాధేశ్యామ్‌’ కథ. ఇది జరిగిపోయింది కాదు, జరగబోయేది కాదు... ఎప్పుడూ జరిగే ఓ కథ’’ అన్నారు రాధాకృష్ణ కుమార్‌. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘రాధేశ్యామ్‌’. ప్రభాస్‌, పూజా హెగ్డే జంటగా నటించారు. యు.వి.క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌, ప్రసీద నిర్మిస్తున్నారు. గోపీకృష్ణ మూవీస్‌ పతాకంపై కృష్ణంరాజు సమర్పిస్తున్నారు. పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్ర సాంకేతిక బృందం శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో సమావేశమైంది. ఆ విషయాలివీ...


‘‘ప్రభాస్‌ ఇమేజ్‌ విషయంలో అభిమానుల అంచనాలకు మించి ఉంటుందీ చిత్రం. పద్దెనిమిదేళ్ల కిందట విన్న ఈ కథాలోచన నాలో స్ఫూర్తిని రగిలించింది. వేల ఏళ్లుగా ఉన్న ఓ ప్రశ్న. అయితే దానికి సమాధానం చెబుతున్నానని కాదు కానీ, దానికి నా వివరణ  ఏమిటన్నది తెరపైనే చూడాలి. ఈ కథ ఈ స్థాయికి రావడానికి నా గురువు చంద్రశేఖర్‌ ఏలేటి, కథానాయకుడు ప్రభాస్‌లే కారణం. నిర్మాతలు వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ ఈ రోజు వరకూ ఏది కావాలంటే అది ఇచ్చారు. ఈ సినిమా కోసం తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద పెద్ద జ్యోతిష్యుల్ని కలిశాం. వాళ్లలో ఒకరు ముందే చెప్పారు... ఈ చిత్రం 2022 ప్రథమార్థంలో విడుదలయ్యే అవకాశముందని... అదే జరుగుతోంది ఇప్పుడు. ట్రైలర్‌ చూసినవాళ్లంతా విజువల్‌ ఎఫెక్ట్స్‌ చాలా బాగున్నాయని చెబుతున్నారు. కమల్‌కన్నన్‌, ఆయన బృందానికే ఈ క్రెడిట్‌ దక్కుతుంది. 12 దేశాల్లో విజువల్‌ ఎఫెక్ట్స్‌ పని జరుగుతోంది’’.

- రాధాకృష్ణ కుమార్‌, దర్శకుడు


‘‘హీరో ప్రభాస్‌లాగే ఈ సినిమా ఒప్పుకొన్నప్పుడు నాకు పెళ్లి కాలేదు. ఈ ప్రయాణంలోనే నాకు పెళ్లయింది. మా బాబు ఇప్పుడు స్కూల్‌కి వెళుతున్నాడు. ఈ చిత్రం కోసం నాలుగేళ్లు ప్రయాణం చేశాం. ‘రాధేశ్యామ్‌’ కథ విన్నాక రెండు రోజులకి ‘వర్షం’ సినిమాని మరోసారి చూసుకుని, బాగా ఆస్వాదించి ‘బాహుబలి’ నుంచి బయటకొచ్చి ఈ సినిమా చేశా. హాలీవుడ్‌లో స్టూడియో ఫార్మాట్‌లో తీసినట్టుగా పెట్టుబడి, రాబడితో సంబంధం లేకుండా కథ కోరుకున్నట్టుగా చేశాం. రాధాకృష్ణ కుమార్‌ దగ్గర గొప్ప ఆలోచనలున్నాయి. భారతీయ తెరపై అవి ఆవిష్కారం కాబోతున్నాయి’’.

- మనోజ్‌ పరమహంస, ఛాయాగ్రాహకుడు


‘‘ప్రపంచంలోనే కళకి ఎక్కువ విలువిస్తాయి యూరోపియన్‌ దేశాలు. అందులో ఇటలీ ఒక ప్రధాన దేశం. ఆ దేశం నేపథ్యంలో 1970లో జరిగే ప్రేమకథ ఇది, దానికి ప్రొడక్షన్‌ డిజైనర్‌గా పని చేయాలన్నప్పుడు ఇదో సవాల్‌గా అనిపించింది. ఎవ్వరూ రాజీ పడకుండా పనిచేశారు. అందరం ఒకే తరహా ఆలోచనలతో పనిచేసిన నా తొలి సినిమా ఇది. ఆ ప్రభావం జనవరి 14న తెరపై స్పష్టంగా కనిపిస్తుంది’’.

- రవీందర్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌


‘‘దీనికోసం సహజత్వంతో కూడిన సంగీతాన్ని ఇవ్వాలనుకున్నాం. అందుకోసం ఎలక్ట్రానిక్స్‌ వాయిద్యాల్ని కాకుండా సహజమైన వాయిద్యాలతో సంగీతం సమకూర్చే ప్రయత్నం చేశాం. బుడాపెస్ట్‌లో ప్రత్యేకమైన ఆర్కెస్ట్రాతో కలిసి పాటలు సమకూర్చాం’’.

- జస్టిన్‌ ప్రభాకరన్‌, సంగీత దర్శకుడు


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని