Sirivennela Sitharama Sastry: కడదాకా ఒక ప్రశ్నై ఉండాలనుకుంటున్నా!!

సామాజిక మాధ్యమాలతో శ్రోతలు.. సినీ ప్రియులకు చేరువ కావాలనే ఉద్దేశంతో ఈ ఏడాది జూన్‌లో సిరి   వెన్నెల ఒక ప్రయోగం చేశారు. ట్వీటర్‌లోకి చేరి ఏడాది అయిన సందర్భంగా ‘ఆస్క్‌ సిరివెన్నెల’ పేరుతో నెటిజన్ల నుంచి వచ్చిన సందేహాలను నివృత్తి చేశారు.

Updated : 01 Dec 2021 09:39 IST

సామాజిక మాధ్యమాలతో శ్రోతలు.. సినీ ప్రియులకు చేరువ కావాలనే ఉద్దేశంతో ఈ ఏడాది జూన్‌లో సిరి   వెన్నెల ఒక ప్రయోగం చేశారు. ట్వీటర్‌లోకి చేరి ఏడాది అయిన సందర్భంగా ‘ఆస్క్‌ సిరివెన్నెల’ పేరుతో నెటిజన్ల నుంచి వచ్చిన సందేహాలను నివృత్తి చేశారు. ఎన్నో ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. వాటిలో కొన్ని..

* మీరు రాసిన పాటల్లో మిమ్మల్ని అత్యధికంగా శ్రమపెట్టిన పాట ఏదీ.

పాట వచ్చే క్రమంలో శ్రమ అనే దానికి చోటులేదు.

* మీకు నచ్చిన సినిమా, మీ దృష్టిలో సినిమా అంటే

లిస్టు చాలా పెద్దది పిట్టభాష సరిపోదు. ఇక- కథని చెప్పడం, చూపడం - రెండు ప్రక్రియలు. చెప్పటం సులభం. చూపడం కష్టం. సినిమా ఆ పని చేస్తుంది. కావ్యేషు నాటకం రమ్యం అని అందుకే అన్నారు. రక్తమాంసాలున్న పాత్రలతో కథని చూపడం అనే పనిచేసే సినిమా అన్నది నాకు ఇష్టం.

* లైఫ్‌ ఆఫ్‌ రామ్‌ పాట అద్భుతం. ఆ పాటలో మీకు నచ్చిన ఒక లైన్‌ గురించి.

‘‘ఇలాగే కడదాకా ఒక ప్రశ్నై ఉండాలనుకుంటున్నా.. ఏదో ఒక బదులై నను చెరపొద్దని కాలాన్ని అడుగుతున్నా.. అది నా ఆలోచనా ప్రపంచానికి కేంద్ర బిందువు.

* ఇన్నేళ్ల మీ సాహిత్య ప్రయాణంలో మీరు ప్రయోగించిన మీరు గర్వించదగ్గ పదం లేదా వాక్యం.

‘‘ప్రశ్న- కొడవలిలా ఉండి కుత్తుక కోస్తూ వెంటపడే ప్రశ్న’’.

* దైవ్యాన్ని నిర్వచించాలంటే.

తనను తాను నిర్వచించుకోగలగాలి

* వేటూరి సుందరామ్మూర్తి గారికి మీరు రాసిన పాటల్లో ఏ పాట అంటే ఇష్టం? ఆయన మిమ్మల్ని మెచ్చుకున్న సందర్భం.

చాలా ఉన్నాయని వాళ్లూ.. వీళ్లూ అన్నారు.

‘‘నీలాల కన్నుల్లో సంద్రమే, నింగి నీలమంతా సంద్రమే’’ అన్న పాటను ఆయన అత్యంత ఆత్మీయంగా విశ్లేషించి మెచ్చుకున్నారని బాలు అన్నయ్య నాకు చెప్పారు.


మీకు బాగా నచ్చిన పుస్తకం?

నా స్వల్ప అనుభవానికి సంబంధించి ఇష్టమైనవి రెండు పుస్తకాలు. ఒకటి భగవద్గీత, రెండు ఖలీల్‌ జిబ్రాన్‌ రాసిన ద ప్రాఫిట్‌


యూత్‌కు ఇచ్చే సందేశం ఏమిటి?

యూత్‌ అనేది ఏజ్‌ కాదు. అదొక ఫేజ్‌. అదొక స్టేజ్‌. అది తెలుసుకుంటే యూత్‌ ఇట్‌ సెల్ఫ్‌ ఈజ్‌ ఏ మెస్సేజ్‌.


సీతారామశాస్త్రి హైదరాబాద్‌   శ్రీనగర్‌కాలనీలోని సమన్యు రెసిడెన్సిలో 16 ఏళ్లుగా ఉంటున్నారు. 301లో కార్యాలయం, 501 నివాసం ఉంటున్నారు. ముగ్గురు పిల్లలు వివాహాలై వెళ్లిపోవటంతో తల్లి, భార్యతో కలసి అక్కడే నివాసం ఉంటున్నారు. రెండు  నెలలుగా అనారోగ్య సమస్యలు ఎక్కువ కావటంతో మణికొండకు మారినట్టు స్థానికులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని