Vikrant Rona: అసలు కథ ఇప్పుడే మొదలైంది: సుదీప్‌

‘ఆ ఊరు ఒక మర్మమైన ఊరు. ఆ ఊరి ప్రజలు ఏదో ఒక భయంకరమైన కథని దాచాలనుకుంటున్నారు. కథను దాచగలరు.

Published : 23 Jun 2022 21:36 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘ఆ ఊరు ఒక మర్మమైన ఊరు. ఆ ఊరి ప్రజలు ఏదో ఒక భయంకరమైన కథని దాచాలనుకుంటున్నారు. కథను దాచగలరు. కానీ, భయాన్ని దాచలేరు. ఆ కథ మళ్లీ మొదలైంది. ఆ డెవిల్‌ మళ్లీ వచ్చాడు’ అంటూ ఓ సరికొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు కన్నడ నటుడు సుదీప్‌(sudeep). ఇంతకీ ఆ కథ ఏంటి? ఆ డెవిల్‌ ఎవరు? దాన్ని అడ్డుకున్నది ఎవరు తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే అంటున్నారు. ఆయన కీలక పాత్రలో అనూప్‌ భండారీ దర్శకత్వం వహించిన చిత్రం ‘విక్రాంత్‌ రోణ’(Vikrant Rona). గురువారం ఈ చిత్ర ట్రైలర్‌ను కథానాయకుడు రామ్‌చరణ్‌(Ram charan) విడుదల చేసి సుదీప్‌, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జులై 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

విజువల్‌ వండర్‌గా ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. కన్నడ, తెలుగుతో పాటు, పలు భాషల్లో ‘విక్రాంత్‌ రోణ’కు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.  కథ.. కథనాలు చాలా కొత్తగా ఉంటాయని, యాక్షన్‌కు, గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుందని చిత్ర బృందం చెబుతోంది.  3డీలోనూ ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. బాలీవుడ్‌ కథానాయిక జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌(Jacqueline Fernandez) కీలక పాత్రలో కనిపించనుంది. ‘ఈగ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు సుదీప్‌. ఆ తర్వాత ‘బాహుబలి’లో అతిథి పాత్రలో మెరిశారు. చిరంజీవి నటించిన ‘సైరా’లో అవుకు రాజుగా సుదీప్‌ నటన, డైలాగ్‌ డెలివరీ యాటిట్యూట్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఇప్పుడు ‘విక్రాంత్‌ రోణ’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని