మహారాష్ట్రలో త్వరలో భాజపా ప్రభుత్వం: నడ్డా

మహారాష్ట్రలో త్వరలోనే భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు వచ్చినా మోసపోయామని, కానీ త్వరలోనే తమ.........

Published : 08 Oct 2020 21:10 IST

భాజపా చీఫ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

ముంబయి: మహారాష్ట్రలో త్వరలోనే భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందంటూ భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2019లో జరిగిన ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు వచ్చినా మోసపోయామని, కానీ త్వరలోనే తమ పార్టీ సొంతంగానే రాష్ట్రంలో అధికారం చేపడుతుందన్నారు. గురువారం మహారాష్ట్ర భాజపా ఆఫీస్‌బేరర్ల సమావేశంలో సమావేశంలో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు భాజపా వైపే తీర్పు ఇచ్చినప్పటికీ.. తాము మోసపోయామన్నారు. త్వరలోనే మహారాష్ట్రలో సొంతంగానే తమ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని కార్యకర్తలకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న మూడు రాజకీయ పార్టీలు ప్రతిపక్షంలో కూర్చుంటాయని, భాజపా సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటవుతుందని పునరుద్ఘాటించారు.

మహారాష్ట్రలో పరిస్థితి ఏమీ బాగాలేదన్న నడ్డా.. ఎవరు అధికారంలో ఉన్నారో ఎవరికీ తెలియడంలేదని విమర్శించారు. కుడిచేయి ఏం చేస్తోందో ఎడమ చేతికి కూడా తెలియడంలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రజలు దేవేంద్ర ఫడణవీస్‌నే మళ్లీ సీఎంగా చూడాలని కోరుకుంటున్నారన్నారు. ప్రస్తుతం భాజపానే నిజమైన ప్రతిపక్షమని, త్వరలో తామే అధికార పార్టీగా అవతరిస్తామని నడ్డా అన్నారు. 2019 ఎన్నికల్లో భాజపా, శివసేన కలిసి పోటీ చేసినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటు, అధికార పంపిణీ విషయంలో తలెత్తిన విభేధాల నేపథ్యంలో శివసేన.. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని