‘మీరే రండి.. లేదా పవారే ఎన్డీయేతో కలుస్తారు’

మహారాష్ట్రలో భాజపాతో మళ్లీ శివసేన ఏకమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి, ఆర్‌పీఐ(ఏ) పార్టీ నేత రాందాస్‌ ఆఠవాలే అన్నారు. అధికారం పంచుకొనే ఫార్ములాను రెండు కాషాయ పార్టీలకు ప్రతిపాదించారు. సోమవారం ఆయన .......

Published : 29 Sep 2020 01:19 IST

భాజపాతో మళ్లీ కలవాలంటూ శివసేనకు ఆఫర్‌
కేంద్రమంత్రి రాందాస్‌ అథవాలే ఆసక్తికర వ్యాఖ్యలు 

ముంబయి: మహారాష్ట్రలో భాజపాతో మళ్లీ శివసేన ఏకమై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేంద్రమంత్రి, ఆర్‌పీఐ(ఏ) పార్టీ నేత రాందాస్‌ అథవాలే అన్నారు. అధికారం పంచుకొనే ఫార్ములాను రెండు కాషాయ పార్టీలకు ప్రతిపాదించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే ఏడాది పాటు సీఎంగా ఉండాలని,  ఆ తర్వాత మూడేళ్ల పాటు ఆ పదవిలోకి భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్‌ ఉంటారని సూచించారు. ఒకవేళ భాజపాతో శివసేన బంధం ఏర్పరచుకొనేందుకు ముందుకు రాకపోతే ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ఎన్డీయేతో కలుస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. ఎన్డీయేతో ఎన్సీపీ నేత పవార్‌ చేతులు కలిపితే ఆయనకు భవిష్యత్తులో పెద్ద పదవి వచ్చే అవకాశం ఉందన్నారు. 

మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్‌ను శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ శనివారం ఓ  హోటల్‌లో కలవడంపై అనేక ఊహాగానాలు చెలరేగిన నేపథ్యంలో కేంద్రమంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.  అయితే, సామ్నా పత్రిక ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌గా ఉన్న రౌత్‌ స్పందిస్తూ.. ఫడణవీస్‌ను ఇంటర్వ్యూ కోసమే  కలిసినట్టు స్పష్టంచేశారు. 

ఈ నేపథ్యంలో అథవాలే స్పందిస్తూ.. ‘‘శివసేన భాజపాతో మళ్లీ కలిస్తే ఠాక్రే ఏడాది పాటు, ఫడణవీస్‌ మిగతా మూడేళ్లు సీఎంగా కొనసాగుతారు. శివసేనకు ఒకటి లేదా రెండు కేంద్రమంత్రి పదవులు వస్తాయి కూడా’’ అని తెలిపారు.

గతేడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేసిన శివసేన- భాజపా మధ్య ప్రభుత్వ ఏర్పాటు అంశంపై వైరుధ్యం ఏర్పడటంతో తీవ్ర ప్రతిష్ఠంభన నెలకొంది. ఈ తరుణంలో శివసేన సైద్ధాంతిక విరోధిగా ఉన్న ఎన్సీపీ, కాంగ్రెస్‌తో చేతులు కలిపి మహా వికాస్‌ అఘాడీ కూటమిని ఏర్పాటు చేసి గతేడాది నవంబర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని