ముందస్తు విడుదలకు శశికళ దరఖాస్తు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి  దివంగత జయలలిత నెచ్చెలి వీకే శశికళ ముందస్తు విడుదలకు దరఖాస్తు చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్లుగా ఇక్కడి పరప్పణ అగ్రహార జైల్లో ఖైదు అనుభవిస్తున్న ఆమె...

Published : 02 Dec 2020 18:45 IST

బెంగళూరు: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి  దివంగత జయలలిత నెచ్చెలి వీకే శశికళ ముందస్తు విడుదలకు దరఖాస్తు చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్లుగా ఇక్కడి పరప్పణ అగ్రహార జైల్లో ఖైదు అనుభవిస్తున్న ఆమె.. తాజాగా ముందస్తు విడుదలకు జైలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రత్యేక కోర్టులో తనకు విధించిన జరిమానా చెల్లించిన అనంతరం ఆమె 2021 జనవరి 27న జైలు నుంచి విడుదల కావాల్సి ఉండగా.. అంతకంటే ముందుగానే జైలు నుంచి బయటకు వచ్చేందుకు ఆమె ఈ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఆమె వినతిని జైలు అధికారులు ఉన్నతాధికారులకు పంపించారు. దీనిపై అధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళతో పాటు ఆమె కుటుంబ సభ్యులు ఇద్దరు 2017 ఫిబ్రవరి 15 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్నారు. వీరి ముగ్గురికి నాలుగేళ్ల సాధారణ జైలు శిక్షతో పాటు, ఒక్కొక్కరికీ రూ.10 కోట్లు చొప్పున కోర్టు జరిమానా విధించింది. సాధారణంగా సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను ముందస్తు విడుదలకు అనుమతిస్తారు. అలాంటి వారికి నెలకు 3 రోజుల చొప్పున శిక్ష నుంచి మినహాయింపు ఇస్తారు. ఇప్పటికే శశికళ 43 నెలల జైలు జీవితం అనుభవించారు. ఆ లెక్కన ఆమెకు 135 రోజుల జైలు జీవితం నుంచి మినహాయింపు లభించే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని