62 కోట్ల కార్మికుల  వైపు నిలవండి..

వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించి, కోట్లాది కార్మికుల పక్షాన నిలవాల్సిందిగా దేశప్రజలకు కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ

Published : 26 Sep 2020 01:12 IST

దేశ ప్రజలకు కాంగ్రెస్‌ పిలుపు

దిల్లీ: వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించి, కోట్లాది కార్మికుల పక్షాన నిలవాల్సిందిగా దేశప్రజలకు కాంగ్రెస్‌ పిలుపునిచ్చింది. ఇటీవల పార్లమెంటులో ప్రవేశపెట్టిన ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమాలకు మద్దతు తెలపాలంటూ ఆ పార్టీ నాయకులు కోరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సింగ్‌ సూర్జేవాలా మాట్లాడుతూ.. ‘‘క్రూరమైన ఈ చట్టానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్న 62 కోట్ల వ్యవసాయదారుల వైపు దేశమంతా నిలవాలి. తన ప్రియమైన పెట్టుబడిదారులకు మేలు కలిగించేందుకు ప్రధాని ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. పేదలను ఆయన పట్టించుకోరు’’ అని తెలిపారు. ‘‘ఇది రైతులను బానిసలుగా చేసే ప్రయత్నం. దీనివల్ల వారు తమ పొలాల్లోనే కూలీలుగా మారుతారు. వారికి కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) లభించకపోగా.. వారి గౌరవం కూడా నిలబడదు.’’ అని కాంగ్రెస్‌ నేత  ప్రియాంకా గాంధీ సామాజిక మాధ్యమాల్లో విమర్శించారు.

పంజాబ్‌, హరియాణాలలో రైతులు పార్టీలకు అతీతంగా ఈ రోజు నిరసన ప్రదర్శనలు చేపట్టారు. గతంలో ఎన్నడూలేని విధంగా పంజాబ్‌లోని 31 వ్యవసాయ సంఘాలు ఏకమై ఈ ప్రదర్శనల్లో పాల్గొన్నాయి. ఆయా రాష్ట్రాల దుకాణదారులు కూడా వారికి మద్దతు పలికి దుకాణాలను మూసివేసారు. గురువారం మొదలైన మూడురోజుల ‘రైల్‌ రోకో’ కార్యక్రమం కారణంగా పలు రైళ్లు రద్దయ్యాయి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని