Amit Shah : అజిత్‌ దాదా ఇటు రావడానికి చాలా సమయం తీసుకున్నారు : అమిత్‌ షా

ఇటీవల శిందే-భాజపా ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా చేరిన అజిత్‌ పవార్‌  (Ajit Pawar) గురించి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  

Published : 07 Aug 2023 01:42 IST

ముంబయి : మహారాష్ట్ర (Maharashtra) పర్యటనకు వెళ్లిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah) ఎన్సీపీ (NCP) నేత అజిత్‌ పవార్‌ను (Ajit Pawar) ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన పుణెలో సెంట్రల్‌ రిజిస్ట్రార్‌ ఆఫ్‌ కో ఆపరేటివ్‌ సొసైటీస్‌ డిజిటల్‌ పోర్టల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎంగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అజిత్‌ పవార్‌తో కలిసి వేదిక పంచుకున్నారు. ఈ నేపథ్యంలో అధికార పక్షం వైపు అజిత్‌ రాక గురించి అమిత్‌ షా మాట్లాడారు. 

మళ్లీ అధికారం మాదే.. గతంలో కంటే 7, 8 సీట్లు ఎక్కువే: కేసీఆర్

‘అజిత్‌ దాదా (పవార్‌) ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారి ఇక్కడకు వచ్చాను. ఆయనతో కలిసి వేదిక పంచుకుంటున్నాను. చాలా కాలం నుంచి ఆయనకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నాను. మీరు ఇప్పుడు సరైన స్థానంలో కూర్చున్నారు. ఇది మీకు సరైన స్థానం. కానీ, ఇటు రావడానికి చాలా సమయం తీసుకున్నారని’ షా చెప్పారు. 

కొన్ని నెలల క్రితం ఎన్సీపీని చీల్చి శిందే-భాజపా ప్రభుత్వంలో అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా చేరారు. అజిత్‌తో కలిసి వెళ్లిన ఎనిమిది మందికి మంత్రులుగా అవకాశం దక్కింది. ఈ క్రమంలో ఆయన తన చిన్నాన్న శరద్ పవార్‌ను ధిక్కరించారు. ఎన్సీపీలో తనకు సరైన గుర్తింపు ఇవ్వకపోవడంతో అజిత్‌ ఈ నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో వార్తలు వెలువడ్డాయి. 2019లోనూ అజిత్‌ ఇలాగే దేవేంద్ర ఫడణవీస్‌తో చేతులు కలిపారు. కానీ, శరద్‌ పవార్‌ ఆ చర్యను అడ్డుకుని ఎమ్మెల్యేలను వెనక్కు రప్పించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని