Gujarath Elections: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థులను ప్రకటించిన ఏఐఎంఐఎం

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అక్కడి రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇదివరకే స్పష్టం చేసిన ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ...

Published : 25 Sep 2022 01:24 IST

గాంధీనగర్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అక్కడి రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తామని ఇదివరకే స్పష్టం చేసిన ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ.. తాజాగా మరో అడుగు ముందుకేశారు. ముగ్గురు అభ్యర్థుల పేర్లను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. జమల్‌పూర్‌ నుంచి ఏఐఎంఐఎం రాష్ట్ర అధ్యక్షుడు సబీర్‌ కబ్లీవాలా బరిలోకి దిగనున్నట్లు ప్రకటించారు. దానిలిమ్‌డా అసెంబ్లీ నుంచి కౌశికాపార్మర్‌, తూర్పు సూరత్‌ నియోజకవర్గం నుంచి వాసిమ్‌ ఖురేషి పోటీ చేయనున్నట్లు తెలిపారు.

ఈ ఏడాది చివర్లో గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇటీవల రాష్ట్రంలో పర్యటించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్‌, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ఓ సమావేశంలో మాట్లాడుతూ.. సరైన సమయంలో ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు గుజరాత్‌లో ప్రధానంగా భాజపా, కాంగ్రెస్‌ మధ్యే పోరు జరిగేది. తాజాగా ఆప్‌, ఏఐఎంఐఎం కూడా బరిలో దిగుతుండటంతో అసెంబ్లీ ఎన్నికలు మరింత రసవత్తరంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిల్లీ, పంజాబ్‌ మాదిరిగా గుజరాత్‌లోనూ పాగా వేయాలని ఆప్‌ చీఫ్‌ కేజ్రీవాల్‌ పట్టుదలతో ఉన్నారు. తద్వారా 2024 లోక్‌సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్ర మోదీని ఢీ కొట్టే నాయకుడిగా మారాలని భావిస్తున్నారు. వ్యూహంలో భాగంగానే కేజ్రీవాల్‌ ఇటీవల కాలంలో తరచూ గుజరాత్‌లో పర్యటిస్తూ ఉచిత విద్య, ఆరోగ్య సేవలు, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ వంటి హామీలతో అక్కడి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని