Akhilesh Yadav: కాంగ్రెస్‌ ఫూల్‌ చేస్తోంది.. పొత్తుపై ఆలోచిస్తాం !: అఖిలేశ్‌ యాదవ్‌

ఇతర పార్టీలను కాంగ్రెస్‌ ఫూల్‌ చేస్తోందని, జాతీయ స్థాయిలో ఆ పార్టీతో పొత్తుపై పునరాలోచిస్తామని సమాజ్‌ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు.

Updated : 19 Oct 2023 20:13 IST

దిల్లీ: ‘ఇండియా’ (India) కూటమిలో భాగస్వామిగా ఉన్న సమాజ్‌వాదీ పార్టీ (Samajwadi Party) అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఇతర పార్టీలను ఫూల్‌ చేస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్ర స్థాయిలో పొత్తులు పని చేయవని ముందే చెబితే  ‘ఇండియా’ కూటమికి దూరంగా ఉండేవారమని ఆయన వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదని లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో చేతులు కలపడంపై సమాజ్‌వాదీ పార్టీ పునరాలోచిస్తుందని అఖిలేశ్‌ యాదవ్‌ అన్నారు. 

కాంగ్రెస్‌, ఎస్పీలు జాతీయ స్థాయిలో పరస్పరం సహకరించుకుంటున్నాయి. ఈ మేరకు మధ్యప్రదేశ్‌లోని మొత్తం 29 లోక్‌సభ నియోజకవర్గాల్లో 18 స్థానాల్లో పరస్పర అంగీకారంతో అభ్యర్థులను నిలిపేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. భాజపా వ్యతిరేక ఓట్లను చీల్చకుండా ఉండేందుకే ఆ ఎత్తుగడ వేశాయి. అయితే, తాజాగా ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రకటన విషయంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. నవరాత్రి ప్రారంభం రోజున మధ్యప్రదేశ్‌లోని 144 స్థానాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించింది. అదే రోజున 9 మంది అభ్యర్థుల పేర్లను ఎస్పీ వెల్లడించింది. ఇందులో 5 స్థానాల్లో ఇరు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయి. అంతేకాకుండా బుధవారం రాత్రి ఎస్పీ మరో 22 మంది అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందులో 13 స్థానాల్లో కాంగ్రెస్, ఎస్పీ అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి.

కాంగ్రెస్‌ వైఖరిపై ఎస్పీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. జాతీయ స్థాయిలో కూటమిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి కూడా అది వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తోంది. ‘‘ మాజీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడు కమల్‌నాథ్‌తో మాట్లాడాను. పార్టీ పనితీరు గురించి, గతంలో ఎస్పీ ఎమ్మెల్యేలు గెలిచిన స్థానాల గురించి, అంతేకాకుండా రెండో స్థానంలో నిలిచిన నియోజకవర్గాల గురించి ఆయనకు వివరించాను. ఆరు స్థానాల్లో అభ్యర్థులను ఉపసంహరించుకునేందుకు కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. వాళ్లు అభ్యర్థులను ప్రకటించే ముందు మాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. రాష్ట్ర స్థాయిలో కూటమి లేదు అనుకుంటే, జాతీయ స్థాయిలో మేం వాళ్లతో కలిసి ఉండేవాళ్లం కాదు. జాతీయ స్థాయిలో వాళ్లతో పొత్తులో ఉండాలా? లేదా?అన్నదానిపై పునరాలోచిస్తాం. వాళ్లు ఎలా ఉంటారో.. మేం కూడా అలాగే ప్రవర్తిస్తాం’’ అని అఖిలేశ్‌ యాదవ్‌ మీడియాకు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని