Politics: పంజాబ్‌ కాంగ్రెస్‌లో సంక్షోభం ముగిసినట్లేనా?

అమరీందర్‌ సింగ్‌ను ముఖ్యమంత్రిగా కొనసాగిస్తూనే, నవజోత్‌ సింగ్‌కు పీసీసీ పగ్గాలు అప్పజెప్పేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Updated : 15 Jul 2021 17:08 IST

సీఎంగానే అమరీందర్‌, నవజోత్‌కు పీసీసీ పగ్గాలు

చండీగఢ్‌: గతకొన్ని రోజులుగా పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే, అసెంబ్లీ ఎన్నికల ముందు చోటుచేసుకున్న ఈ పరిణామాలు కాంగ్రెస్‌ పార్టీకి ఓ తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌, నవజోత్‌ సింగ్‌ సిద్ధూల జరుగుతోన్న కోల్డ్‌వార్‌ పరిష్కరానికి కాంగ్రెస్‌  ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అమరీందర్‌ సింగ్‌ను ముఖ్యమంత్రిగా కొనసాగిస్తూనే, నవజోత్‌ సింగ్‌కు పీసీసీ పగ్గాలు అప్పజెప్పేందుకు కాంగ్రెస్‌ అధిష్ఠానం సిద్ధమైనట్లు సమాచారం.

సీఎంగా కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ను కొనసాగించేందుకే మొగ్గుచూపిన కాంగ్రెస్‌ అధిష్ఠానం, నవజోత్‌ సింగ్‌కు పీసీసీ బాధ్యతలు అప్పజెప్పనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వీరితో పాటు మరో ఇద్దరిని వర్కింగ్‌ ప్రెసిడెంట్లుగా నియమించే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో పంజాబ్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న ప్రతిష్టంభనకు రెండు, మూడు రోజుల్లో తెరపడనుందని పంజాబ్‌ కాంగ్రెస్‌ ఇంఛార్జ్‌ హరీష్‌ రావత్‌ పేర్కొన్నారు. అమరీందర్‌ సారథ్యంలోనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ముందుకు వెళ్తామని జాతీయ మీడియాతో హరీష్‌ రావత్‌ వెల్లడించారు.

ఇదిలాఉంటే, వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ముందు పంజాబ్‌ కాంగ్రెస్‌లో అమరీందర్‌, నవజోత్‌ సింగ్‌ల మధ్య కోల్డ్‌వార్‌ మొదలు కావడం పార్టీకి ఇబ్బందిగా మారింది. తన పనితీరును కాంగ్రెస్‌ పార్టీ కంటే ఇతర పార్టీలే ఎక్కువగా గుర్తించాయని నవజోత్‌ సింగ్‌ బహిరంగంగా చెప్పారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ముఖ్యమంత్రిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న నవజోత్‌ సింగ్‌ సిద్ధూ, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ప్రియాంకాలతో భేటీ అయ్యారు. ఇది జరిగిన మరుసటి రోజే సీఎం కెప్టెన్‌ అమరీందర్ సింగ్‌ కూడా కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని కలిసి అక్కడి తాజా పరిస్థితులను వివరించారు. తొలుత సిద్ధూకు పీసీసీ చీఫ్‌, లేదా కేబినెట్‌లో అవకాశం కల్పిస్తారనే వార్తలు వచ్చాయి. కానీ, అందుకు కెప్టెన్‌ అమరీందర్‌ నిరాకరించినట్టు సమాచారం. కానీ, సోనియాను కలిసిన అనంతరం అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని అమరీందర్‌ పేర్కొనడంతో సమస్యకు పరిష్కారం లభించినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని