Telangana News: తెరాస ఎమ్మెల్యేల కొనుగోలుకు యత్నం?.. నోట్ల కట్టలతో పట్టుబడిన దిల్లీ వ్యక్తులు

ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్‌లో నోట్ల కట్టలతో పట్టుబడటం తెలంగాణలో కలకలం రేపింది.తెరాస ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు రంగంలోకి దిగారనే పక్కా సమాచారంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. 

Updated : 26 Oct 2022 22:27 IST

హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక వేళ తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెరాసకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు దిల్లీకి చెందిన వ్యక్తులు ప్రయత్నించారన్న ఆరోపణలు కలకలం రేపాయి. వీరంతా నగర శివారులోని ఫామ్‌హౌస్‌లో పోలీసులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడటం తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

దిల్లీ, తిరుపతి, హైదరాబాద్‌కు  చెందిన ముగ్గురు వ్యక్తులు హైదరాబాద్‌లో నోట్ల కట్టలతో పట్టుబడటం తెలంగాణలో కలకలం రేపింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో.. తెరాసకు చెందిన కొందరు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు వీరు రంగంలోకి దిగారనే పక్కా సమాచారం అందడంతో పోలీసులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుతో పాటు, కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావు తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డిని పార్టీ ఫిరాయింపులకు ప్రోత్సహించేందుకు దిల్లీకి చెందిన వ్యక్తులు ప్రయత్నించినట్టు సమాచారం అందిందని పోలీసులు వెల్లడించారు. రెండ్రోజులుగా ఈ నలుగురూ.. ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో పక్కా సమాచారంతో తెలంగాణ పోలీసులు ప్రత్యేక ఆపరేషన్‌ నిర్వహించారు.

మొయినాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి అజీజ్ నగర్ లోని ఓ ఫామ్ హౌస్ లో ఎమ్మెల్యేలతో బేరసారాలు జరుగుతున్న సమయంలో పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. వీరితో పాటు రూ.కోట్లలో నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర మెయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌ వద్దకు చేరుకుని పరిశీలించారు. నోట్ల కట్టలతో పట్టుబడిన నలుగురిని  పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఫిరాయింపులను ఎవరు ప్రోత్సహించారు? డబ్బు ఎవరు సమకూర్చారు? ఇందులో సూత్రధారులెవరు?  అనే విషయాలను తెలుసుకునేందుకు పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నారు.

తెరాస ఎమ్మెల్యేలు సమాచారం ఇచ్చారు: సీపీ

ఎమ్మెల్యేలను ప్రలోభ పెడుతున్నారనే సమాచారం వచ్చిందని, ప్రలోభాల ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామని సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర తెలిపారు. తెరాస ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాచారంతోనే ప్రత్యేక ఆపరేషన్‌ చేపట్టామని వెల్లడించారు. ‘‘డబ్బు, కాంట్రాక్టులతో ప్రలోభపెడుతున్నారని చెప్పారు. ఫరీదాబాద్‌ ఆలయానికి చెందిన రామంద్ర భారతి. తిరుపతికి చెందిన సింహయాజీ అనే స్వామీజీ హైదరాబాద్‌కు చెందిన నందకుమార్‌తో కలిసి వచ్చారు’’ అని సీపీ వెల్లడించారు.
 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని