Bandi sanjay: దాసోజు శ్రవణ్‌ను భాజపాలోకి ఆహ్వానిస్తున్నా: బండి సంజయ్‌

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్‌ను భాజపాలో చేరాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆహ్వానించారు. శ్రవణ్‌ జాతీయ భావాలున్న

Published : 06 Aug 2022 01:31 IST

పోచంపల్లి: కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన దాసోజు శ్రవణ్‌ను భాజపాలో చేరాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆహ్వానించారు. శ్రవణ్‌ జాతీయ భావాలున్న వ్యక్తి అని, గతంలో ఏబీవీపీ తరఫున అనేక ఉద్యమాలు చేశారని గుర్తు చేశారు. దాసోజు శ్రవణ్‌ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు బండి సంజయ్‌ స్పందిస్తూ.. ‘‘ఆయన తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, కీలకపాత్ర పోషించారు. దురదృష్టవశాత్తూ కేసీఆర్‌కు ఆరోజు దాసోజు శ్రవణ్‌ చాలా మంచివాడిగా కనిపించారు. ప్రజలంతా దాసోజు వాయిస్‌ వింటుంటే తట్టుకోలేక కేసీఆర్‌ ఆయన్ను అణగదొక్కారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే వాస్తవాలు వివరించేవారు. తెలంగాణ ఆకాంక్ష, ఉద్యమం విషయంలో నాతోపాటు అనేకమందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. ఘర్‌ వాపసీ రావాలని కోరుతున్నా. ఈనెల 21న కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరబోతున్నారు. రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఉన్నంత వరకు మంచివాడే. రాజీనామా చేసి భాజపాలోకి వస్తాననగానే కాంట్రాక్టులిచ్చారనే ఆరోపణలు చేయడం హాస్యాస్పదం. కేసీఆర్‌ కుటుంబ పాలనలో అవినీతి రాజ్యమేలుతోంది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో భాజపా ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరుతుంది. కేసీఆర్‌ ప్రజల దృష్టి మళ్లించేందుకు ఎన్ని కుట్రలు చేసినా.. ఎన్ని డబ్బులు వెదజల్లినా ప్రజలు నమ్మరు. భాజపా భారీ విజయంతో మునుగోడులో గెలిచి తీరుతుంది. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్తును నిర్దేశించే ఎన్నిక ’’ అని బండి సంజయ్‌ తెలిపారు.

మూసీ ప్రక్షాళన కోసం రూ.4వేల కోట్లు కేటాయించాలి...

నాలుగో రోజు ప్రజాసంగ్రామ పాదయాత్రలో భాగంగా బండి సంజయ్ ఈరోజు రాత్రి 7 గంటలకు భువనగిరి నియోజకవర్గంలోని పోచంపల్లి మండలం ముక్తాపూర్ చేరుకున్నారు.  ఈ సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ‘‘పాదయాత్రలో భాగంగా మూసీ పరివాహక ప్రాంతంలో దుస్థితిని ప్రత్యక్షంగా చూశా. సీఎం కేసీఆర్‌ మూసీ నదిలో స్నానం చేస్తానని, బోట్లు వేసుకుని తిరిగే పరిస్థితి తీసుకొస్తానని చెప్పారు. కొబ్బరి నీళ్లలా మారుస్తానని ఇచ్చిన హామీలు అమలు కాలేదు. అందుకే మూసీ నీళ్లను బాటిళ్లలో పట్టుకుని తీసుకొచ్చా. ఆ నీళ్ల బాటిల్‌ను సీఎం కేసీఆర్‌కు పంపుతున్నా. దీంతో పాటు లేఖ రాస్తున్నా. ఇప్పటికైనా ప్రజల బాధలను దృష్టిలో ఉంచుకుని ఇచ్చిన హామీ మేరకు తక్షణమే మూసీ ప్రక్షాళన కోసం రూ.4వేల కోట్లు విడుదల చేయాలి. యుద్ధ ప్రాతిపదికన మూసీ ప్రక్షాళన చేయాలి’’ అని లేఖలో సంజయ్‌ కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని