TS Assembly: ఏపీ ప్రాజెక్టుతో.. కృష్టాపై తెలంగాణ ప్రాజెక్టులు ఎడారిగా మారే ప్రమాదం: భట్టి

తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్‌ పద్దులపై మూడో రోజు చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పలు అంశాలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.

Published : 11 Feb 2023 23:15 IST

హైదరాబాద్‌: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులతో పాటు పలు అంశాలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. అసెంబ్లీలో మూడో రోజు పద్దులపై చర్చ సందర్భంగా రాష్ట్రంలో జరుగుతున్న నీటి ప్రాజెక్టుల నిర్మాణాలు, సాగవుతున్న ఆయకట్టు, సాగునీటి కాలువల స్థితిగతులు తదితర అంశాలను సభ దృష్టికి తెచ్చారు. మాట మాటకీ మంత్రి హరీశ్‌ రావు అడ్డు తగులుతుండడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన భట్టి.. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకు యత్నించడం సరికాదన్నారు. 

వరదల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు తమను ఎందుకు అనుమతించలేదని భట్టి ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు బయటపడతాయనే తమను అనుమతించలేదన్నారు. విదేశీయులు, డిస్కవరీ ఛానల్ వాళ్లతోపాటు బయటి వ్యక్తులు ప్రాజెక్టు చూసేందుకు అనుమతిస్తున్నారని ఇదెక్కడ న్యాయమని నిలదీశారు. దీనిపై స్పందించిన మంత్రి హరీశ్‌ రావు... ఎప్పుడు వెళ్తారో చెబితే తమ అధికారులు దగ్గరుండి తీసుకెళ్లి అన్నీ చూపెడతారని వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ ప్రాజెక్టుల వెనుక ఉన్న భూములు ముంపునకు గురై  రైతులు నష్టపోతున్నారని ఇందుకు శాశ్వత పరిష్కారం చూపాలని భట్టి కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు చేపట్టక ముందు కాంగ్రెస్ హాయంలో జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన చిన్న కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ వచ్చిన తర్వాత దాన్ని పూర్తి చేయకుండా గాలికొదిలేశారని ఆరోపించారు. ఈ ప్రాజెక్టును ఎప్పుడు పూర్తి చేసి రైతులకు నీరిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. అదే విధంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎప్పటిలోగా పూర్తి చేస్తారని ప్రశ్నించారు. దీనిని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించేందుకు కేంద్రంపై ఎందుకు పోరాటం చేయడం లేదని నిలదీశారు. ఏపీ ప్రభుత్వం సంఘమేశ్వర వద్ద రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణం చేస్తే.. తెలంగాణలోని కృష్ణా నది ప్రాజెక్టులు ఎడారిగా మారే ప్రమాదం ఉందని దీనిపై దృష్టి సారించాలని భట్టి సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని