ఫోన్ల ట్యాపింగ్‌:సీబీఐ విచారణకు భాజపా డిమాండ్‌

రాజస్థాన్‌ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలకు సంబంధించినవిగా చెబుతున్న ఆడియో టేపులు నకిలీవని భాజపా ఆరోపించింది. తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికే కాంగ్రెస్‌........

Updated : 18 Jul 2020 13:43 IST

జైపుర్‌: రాజస్థాన్‌ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు బేరసారాలకు సంబంధించినవిగా చెబుతున్న ఆడియో టేపులు నకిలీవని భాజపా ఆరోపించింది. తమ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికే కాంగ్రెస్‌ ఈ కుట్రకు తెరతీసిందని భాజపా అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా ఆరోపించారు. అలాగే రాజకీయ నాయకుల ఫోన్ల ట్యాపింగ్‌ జరిగిందో.. లేదో.. ప్రజలకు తెలియజేయాలని డిమాండ్‌ చేశారు. చేస్తే.. నిబంధనల్ని పాటించారా అని ప్రశ్నించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. నేడు దిల్లీలోని భాజపా కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ..ఆయన  కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. 

కాంగ్రెస్‌లో గత కొంత కాలంగా అంతర్గత విభేదాలు కొనసాగుతున్నాయని సంబిత్‌ పాత్రా ఆరోపించారు. స్వయంగా ముఖ్యమంత్రి గహ్లోతే గత కొన్ని రోజులుగా ఉపముంఖ్యమంత్రిగా కొనసాగిన సచిన్‌ పైలట్‌తో మాటలు లేవని చెప్పడమే దానికి నిదర్శనమన్నారు.  కాంగ్రెస్‌కు ఫోన్‌ ట్యాపింగ్‌ చేసే చరిత్ర ఎప్పటి నుంచో ఉందని విమర్శించారు. ఫోన్‌ ట్యాపింగ్‌పై ప్రజలకు వివరణ ఇవ్వాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్‌ పార్టీకి ఆరు ప్రశ్నలు సంధించారు. 

1. రాజస్థాన్‌ అధికార యంత్రాంగం ఫోన్‌ ట్యాపింగ్‌ చేసిందా?

2. ఫోన్‌ ట్యాపింగ్‌ అనే అంశం సున్నితమైంది.. చట్టపరమైంది కాదా?

3.ఫోన్‌ ట్యాపింగ్ చేయడానికి చట్టపరంగా పాటించాల్సిన నిబంధనల్ని పాటించారా?

4. రాష్ట్రంలోని అందరి నాయకులపై  ప్రభుత్వం నిఘా ఉంచిందా?

5. రాజకీయ స్వలాభం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారా?

6. కాంగ్రెస్‌ పార్టీ చట్టాల్ని విస్మరించిందా? అని భాజపా.. అశోక్‌ గహ్లోత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 

అంతకుముందు ఆడియో టేపుల విషయంలో భాజపా నేత లక్ష్మీకాంత్‌ భరద్వాజ్‌.. కాంగ్రెస్‌ నేతలు రణ్‌దీప్‌ సూర్జేవాలా, గోవింద్‌ సింగ్‌ దోస్తారాపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నకిలీ ఆడియో టేపుల్లో కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్‌ను అకారణంగా కావాలనే ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. భాజపాకు వ్యతిరేకంగా ప్రతిరోజు మహేశ్‌ జోషి, సూర్జేవాలా విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజస్థాన్‌ ప్రభుత్వ వైఫల్యాల్ని భాజపాపైకి నెట్టివేయడానికే ఇలాంటి కుట్రకు తెరతీశారని ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని