Akhilesh Yadav: ఎన్డీయేలో ఆర్‌ఎల్డీ చేరుతుందా? అఖిలేశ్‌ సహా యూపీ నేతల రియాక్షన్‌ ఇదే!

ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆర్‌ఎల్డీ ఎన్డీయేలో చేరుతుందన్న ఊహాగానాలపై మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌తో పాటు పలువురు నేతలు స్పందించారు.

Published : 08 Feb 2024 18:42 IST

(ఫైల్‌ ఫొటో)

లఖ్‌నవూ: లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆర్‌ఎల్డీ చీఫ్‌ జయంత్‌ చౌదరి (Jayant Chaudhary) ఎన్డీయే (NDA)లో చేరే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తర్‌ప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ (Akhilesh Yadav) స్పందించారు. పార్టీలను ఎలా చీల్చాలో, ఎప్పుడు ఎవరిని కొనుగోలు చేయాలో కమలనాథులకు బాగా తెలుసంటూ విమర్శలు గుప్పించారు.  ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర సంస్థలను సైతం అధికార భాజపా (BJP) దుర్వినియోగం చేస్తోందని మండిపడ్డారు. వారణాసిలో అఖిలేశ్‌ గురువారం విలేకర్లతో మాట్లాడుతూ.. ఎప్పుడేం చేయాలో ఈడీ, సీబీఐలను ఎప్పుడు ఎక్కడికి పంపాలో, ఐటీ దాడులు ఎప్పుడు జరిపించాలో, ఏ జర్నలిస్టులను ఎప్పుడు మౌనంగా ఉంచాలో కూడా భాజపాకు తెలుసంటూ వ్యాఖ్యానించారు. ఇదిలాఉండగా.. ఈ అంశంపై నిన్న కూడా స్పందించిన అఖిలేశ్‌ యాదవ్‌ యూపీ ప్రజల శ్రేయస్సు కోసం జరుగుతోన్న పోరాటాన్ని ఆర్‌ఎల్డీ చీఫ్‌ జయంత్‌చౌదరి బలహీనపరచబోరని ఆశిస్తున్నట్లు చెప్పారు.

తెదేపాకు 17 లోక్‌సభ సీట్లు.. ఇండియా టుడే సర్వే

అందరినీ స్వాగతిస్తున్నాం.. భాజపా

మరోవైపు, ఆర్‌ఎల్డీ భాజపాతో కలిసే అవకాశాలపై ఉత్తర్‌ప్రదేశ్‌ డిప్యూటీ సీఎం, భాజపా నేత బ్రజేశ్‌ పాఠక్‌ స్పందించారు. ‘రాజకీయాల్లో ఆ అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. భాజపా  అంకితభావంతో పనిచేసే పార్టీ. ఉత్తరప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడుతోన్న భాజపాకు ప్రజల మద్దతు ఉంది. మేం ప్రతి ఒక్కరినీ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం’ అన్నారు.  ఈ పరిణామాలపై కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత ఆరాధనా మిశ్రా మాట్లాడుతూ.. ‘ఆర్‌ఎల్డీ ఎన్డీయేలో చేరుతుందంటూ  మీడియాలో మాత్రమే చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు ఇండియా కూటమికి సంబంధించినంతవరకు ఇక్కడ బాగానే ఉంది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’ అన్నారు.

జయంత్‌ ఎక్కడికీ వెళ్లరు.. : శివ్‌పాల్‌ యాదవ్‌

భాజపా కన్‌ఫ్యూజన్‌ సృష్టించేందుకు పనిచేస్తోందని..  జయంత్‌ ఎక్కడికి వెళ్లరని ఎస్పీ నేత శివపాల్ యాదవ్‌ అన్నారు. ఆయన ఇండియా కూటమితోనే ఉంటూ భాజపా ఓటమికి కృషి చేస్తారని విశ్వాసం వ్యక్తంచేశారు. 

ఎస్పీ మద్దతు వల్లే జయంత్‌ రాజ్యసభకు.. 

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి ఆర్‌ఎల్డీ, సమాజ్‌వాదీ పార్టీలు జనవరి 19న పొత్తులను ప్రకటించాయి.  సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తామని ఇరు పార్టీల అగ్రనేతలూ స్పష్టంచేశారు.  జాట్‌ వర్గంలో మంచి పట్టు ఉన్న ఆర్‌ఎల్డీ ఆ వర్గం ఓట్లు గణనీయంగా ఉండే ముజఫర్‌నగర్‌, కైరానా, బిజ్నోర్‌, మథుర, భాగ్‌పట్‌, అమ్రోహా, మీరట్‌ లోక్‌సభ సీట్లలో పోటీ చేసే అవకాశం ఉంది.  2022 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేయగా.. సమాజ్‌వాదీ పార్టీకి 111 సీట్లు రాగా.. ఆర్‌ఎల్డీకి ఎనిమిది స్థానాలు దక్కాయి. గత 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఎస్‌పీ-బీఎస్పీ కూటమితో కలిసి ఆర్‌ఎల్డీ బరిలో దిగింది. ఆ సమయంలో మథుర, బాగ్‌పట్‌, ముజఫర్‌ నగర్‌ సీట్లలో పోటీ చేసినప్పటికీ మూడు చోట్ల నిరాశే ఎదురైంది. గత లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ  ఐదు, బీఎస్పీ 10 స్థానాలు గెలుచుకున్నాయి.  జయంత్‌ చౌదరిని రాజ్యసభకు పంపేందుకు అవసరమైన బలం ఆ పార్టీకి లేకపోవడంతో సమాజ్‌వాదీ పార్టీ మద్దతుతోనే ఆయన పెద్దల సభకు ఎన్నికయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆర్‌ఎల్డీ భాజపాతో కలిసి పనిచేసే అవకాశాలపై మీడియా అడిగిన ప్రశ్నకు ఆ పార్టీ అధికార ప్రతినిధి ‘నో కామెంట్‌’ అని సమాధానం ఇవ్వడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని