ఏ మొహం పెట్టుకొని రాహుల్ ఓయూకి వద్దామనుకున్నారు?: ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌

తెలంగాణకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వచ్చి ఏదో చేస్తాడన్నట్లు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు హడావిడి చేస్తున్నారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు

Updated : 03 May 2022 16:02 IST

హైదరాబాద్‌: తెలంగాణకు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ వచ్చి ఏదో చేస్తాడన్నట్లు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు హడావిడి చేస్తున్నారని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్ అన్నారు. రైతుల కోసం డిక్లరేషన్ తీసుకొస్తామని కాంగ్రెస్ నేతలు ఏదేదో మాట్లాడుతున్నారని.. దేశంలో రైతాంగానికి కాంగ్రెస్‌ చేసింది శూన్యమని ఆరోపించారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో ప్రభాకర్ మీడియాతో మాట్లాడారు. 

‘‘కాంగ్రెస్ హయాంలో కనీస మద్దతు ధర కల్పించలేకపోయారు. ప్రధాని మోదీ పాలనలో పంటలకు మద్దతు ధర పెరిగింది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పేరుతో రైతులకు కేంద్రం పెట్టుబడి సాయం ఇస్తోంది. రైతుల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు.. రాహుల్ గాంధీకి అసలే లేదు. రైతు సంఘర్షణ సభ కాకుండా కాంగ్రెస్ సభ అని పేరు పెట్టుకోవాలి. ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)కి రాహుల్‌గాంధీ ఏ ముఖం పెట్టుకొని వద్దామనుకుంటున్నారు?తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల ఆత్మ బలిదానాలకు కాంగ్రెస్సే కారణం.

ఇదంతా తెరాస- కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం. వరంగల్‌ సభకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ఎలా ఇస్తుంది. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీకి నిరుద్యోగ యువత గురించి ఆలోచించే తీరిక లేకుండా పోయింది. విద్యార్థులు, నిరుద్యోగులతో చెలగాటం ఆడటం మంచిది కాదు. రాహుల్ గాంధీని కలిసి విద్యార్థుల ఆత్మహత్యలకు సంబంధించిన డైయింగ్ డిక్లరేషన్ అందజేస్తా. ఈ నెల 5న మహబూబ్‌నగర్‌లో జరిగే బహిరంగ సభకు జేపీ నడ్డా రానున్నారు. ఈ నెల 14న ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు అమిత్‌షా వస్తున్నారు’’ అని ఎస్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ అన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని