Raghunandan: జేపీ నడ్డాపై ప్రధానికి ఫిర్యాదు చేస్తా!: రఘునందన్‌

పార్టీలో తనకు తగిన గౌరవం ఇవ్వాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు అన్నారు. సేవలకు తగిన ప్రతిఫలం దక్కకపోతే జాతీయ అధ్యక్షుడు నడ్డాపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తానని అన్నారు.

Updated : 03 Jul 2023 18:26 IST

దిల్లీ: తెలంగాణ భాజపా శాసనసభ్యుడు రఘునందన్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని, పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్‌ లీడర్‌ పదవిలో ఏదో ఒకటి ఇవ్వాలని కోరారు. లేదంటే జాతీయ అధికార ప్రతినిధి పదవి ఇచ్చినా ఓకేనన్నారు. దిల్లీలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి నివాసంలో ఆయన మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు. గత పదేళ్లుగా పార్టీ కోసం తనలా ఎవరూ కష్టపడలేదని అన్నారు. దుబ్బాకలో తన విజయాన్ని చూసిన తర్వాతనే ఈటల రాజేందర్‌ పార్టీలోకి వచ్చారన్నారు.

‘‘ భాజపా రాష్ట్ర అధ్యక్ష పదవికి నేను అర్హుడిని కాదా?పదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నా. కొన్ని విషయాల్లో నా కులమే నాకు శాపం కావొచ్చు. 2 నెలల్లో భాజపా ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుంది. దుబ్బాక నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలుస్తా. దుబ్బాక ఎన్నికల్లో నాకెవరూ సాయం చేయలేదు. నేను భాజపాలోనే ఉండాలని అనుకుంటున్నా. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు రూ.వందలకోట్లు ఖర్చుపెట్టారు. అయినా గెలవలేదు. అదే రూ.100 కోట్లు నాకిస్తే తెలంగాణను దున్నేసేవాణ్ణి. దుబ్బాకలో నన్ను చూసే గెలిపించారు.’’ అని రఘునందన్‌ అన్నారు.

తెలంగాణ భాజపా అధ్యక్షుడిగా బండి సంజయ్‌ స్థానంలో వేరే వాళ్లను నియమిస్తారనడం వాస్తవమేనని రఘునందన్‌ తెలిపారు. ‘‘ఆయనది స్వయంకృతాపరాథం. బండిసంజయ్‌ పుస్తెలమ్మి ఎన్నికల్లో పోటీ చేశారు. అలాంటి సంజయ్‌ రూ.వందకోట్లతో యాడ్స్‌ ఎలా ఇచ్చారు. తరుణ్‌చుగ్‌, సునీల్‌ బన్సల్‌ బొమ్మలతో ఓట్లు రావు. రఘునందన్‌, ఈటల బొమ్మలతోనే ఓట్లు వస్తాయి. ఎన్నికల్లో పార్టీ గుర్తు చివరి అంశమే. పార్టీకి శాసనసభాపక్ష నేత లేడని నడ్డాకు తెలియదు. వాళ్ల దృష్టికి తీసుకెళ్తే.. అదేంటి? అని ప్రశ్నించారు తప్ప.. తదుపరి చర్యలు తీసుకోలేదు. సేవకు ప్రతిఫలం రాకపోతే నడ్డాపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తాను.’’ అని రఘునందన్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని