BJP: పూర్తి కానీ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు: డీకే అరుణ

తెలంగాణ ఉద్యమ సమయంలో యువతకు ఆశలు కల్పించి.. సెంటిమెంట్‌ రగిలించి సీఎం కేసీఆర్ నిరుద్యోగ యువత ప్రాణాలు బలిగొన్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు.

Published : 13 Sep 2023 16:52 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమ సమయంలో యువతకు ఆశలు కల్పించి.. సెంటిమెంట్‌ రగిలించి సీఎం కేసీఆర్ నిరుద్యోగ యువత ప్రాణాలు బలిగొన్నారని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ఇందిరా పార్క్ వద్ద భాజపా చేపట్టిన 24 గంటల నిరాహార దీక్షలో ఆమె పాల్గొన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్‌లు ఇచ్చి ప్రశ్నపత్రాలు లీక్ చేశారని.. బాధ్యులపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కాంట్రాక్ట్ వ్యవస్థ ఇంకా ఎందుకు నడుస్తుందో కేసీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల పేరుతో దోపిడీ చేసిన కేసీఆర్‌కు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని డీకే అరుణ హెచ్చరించారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు ఒక బోగస్ అన్నారు. పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టు అంచనాలు పెంచి.. అడ్డగోలుగా ప్రజా ధనాన్ని దోచుకున్నారని ఆరోపించారు. పూర్తి కానీ ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్ధం అయ్యారని విమర్శించారు. 

ఎన్ని సీట్లు వచ్చినా ప్రభుత్వం భాజపాదే: అర్వింద్‌

దీక్షలో పాల్గొన్న ఎంపీ ధర్మపురి అర్వింద్‌.. భారాస సర్కారుపై విమర్శలు గుప్పించారు. ‘‘ భారాస పాలనలో ఉద్యోగ నోటిఫికేషన్‌లో క్లారిటీ ఉండదు. ఉన్నా.. పరీక్ష సరిగ్గా నిర్వహించరు. నిర్వహించినా.. పేపర్‌ లీక్ చేస్తారు. కేంద్రం పరీక్ష పెట్టినప్పుడే.. కేసీఆర్ ఇక్కడ పరీక్షలు పెడుతున్నారు. నిరుద్యోగులే పరీక్షలు వాయిదా వేయాలని అడిగేలా ప్లాన్ చేస్తున్నారు. ఇది కేసీఆర్ తెలివి. అందుకే నేను ముందుండి పోరాడుతున్నా. బిడ్డను ఓడించా.. కేసీఆర్‌ను కూడా గద్దె దింపుతా. ఎన్ని సీట్లు వచ్చినా ప్రభుత్వం భాజపాదే. కేంద్రంలో మాములు బుర్రలు లేవు’’ అని అర్వింద్‌ వ్యాఖ్యానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని