Bypoll results: ఉప ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు.. రెండు చోట్ల భాజపా విజయం

గుజరాత్‌, హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. డిసెంబర్‌ 5న ఒక లోక్‌సభ స్థానానికి, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొయిన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి ఎస్పీ అధినేత అఖిలేశ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ విజయం సాధించారు.

Published : 09 Dec 2022 00:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గుజరాత్‌, హిమాచల్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. డిసెంబర్‌ 5న ఒక లోక్‌సభ స్థానానికి, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొయిన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి ఎస్పీ అధినేత అఖిలేశ్‌ భార్య డింపుల్‌ యాదవ్‌ విజయం సాధించారు. యూపీలోని ఒక చోట, బిహార్‌లో ఒక చోట అధికార పార్టీలకు షాక్‌ ఇస్తూ విపక్ష పార్టీల అభ్యర్థులు గెలుపొందారు. ఈ ఆరు స్థానాల్లో రెండు స్థానాలను భాజపా కైవసం చేసుకుంది. మిగిలిన చోట్ల అధికార పార్టీ అభ్యర్థులే గెలుపొందారు.

  • ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ మరణంతో మొయిన్‌పురి నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో సమాజ్‌వాదీ పార్టీ కంచుకోటగా పేర్కొనే ఈ స్థానంలో డింపుల్‌ యాదవ్‌ బరిలో దిగారు. ఈ స్థానంలో 64 శాతం ఓటింగ్‌తో 6.17 లక్షల ఓట్లు సాధించారు. దాదాపు 2.90 మెజారిటీతో ఆమె విజయం సాధించారు.
  • భాజపా అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌ శాసనసభ నియోజకవర్గంలో భాజపా అభ్యర్థి ఆకాశ్‌ సక్సేనా విజయం సాధించారు. ఎస్పీ అభ్యర్థి అసిమ్‌ రాజాపై 34 వేల ఓట్లతో గెలుపొందారు.
  • యూపీలోని ఖతౌలీ స్థానంలో ఎస్పీ మిత్రపక్షమైన ఆర్‌ఎల్‌డీ అభ్యర్థి మదన్‌ భయ్యా విజయం సాధించారు. భాజపా అభ్యర్థిపై 22 వేల ఓట్లతో  గెలుపొందారు.
  • జేడీయూ-ఆర్జేడీ కూటమి అధికారంలో ఉన్న బిహార్‌లోని కుర్హానీ ఉప ఎన్నిక ఫలితాల్లో భాజపా అభ్యర్థి కేదార్‌ గుప్తా విజయం సాధించారు. జేడీయూ అభ్యర్థిపై 3 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.
  •  కాంగ్రెస్‌ పాలిత ఛత్తీస్‌గఢ్‌లోని భానుప్రతాప్‌పూర్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి సావిత్రి మండి విజయం సాధించారు. భాజపా అభ్యర్థిపై దాదాపు 20 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 
  • ఒడిశాలోని పదంపూర్‌లో బిజు జనతా దళ్‌ అభ్యర్థి బర్శా సింగ్‌ 40 వేల ఓట్ల తేడాతో భాజపా అభ్యర్థిపై గెలుపొందారు. ఇక్కడ బిజద అధికారంలో ఉంది.
  • కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న రాజస్థాన్‌లోని సర్దార్‌షహర్‌ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి అనిల్‌ కుమార్‌ శర్మ భాజపా అభ్యర్థిపై దాదాపు 25 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని