Chandrababu: వివేకా హత్యకేసులో సీఎం జగన్‌ అడ్డంగా దొరికిపోయారు: చంద్రబాబు

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు తెదేపా కండువా కప్పి అధినేత చంద్రబాబు పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. జగన్‌ సర్కార్‌పై మండిపడ్డారు.

Updated : 23 Feb 2023 19:10 IST

మంగళగిరి: అమరావతి అభివృద్ధి కావాలనే ఉద్దేశంతో కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా (BJP)ను వీడి కన్నా లక్ష్మీనారాయణ (Kanna Lakshminarayana) తెలుగుదేశం (TDP) పార్టీలోకి వచ్చారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు (Chandrababu)  తెలిపారు. కన్నాకు తెదేపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం చంద్రబాబు మాట్లాడారు. జగన్‌ (CM Jagan) పాలనలో రాష్ట్రంలో వ్యవస్థలన్నీ విధ్వంసానికి గురయ్యాయని మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా ఆనందంగా లేడు. పంటలకు గిట్టుబాటు ధర లభించట్లేదు. విద్యారంగంలో ఏపీ 19వ స్థానానికి దిగజారింది. రాష్ట్రంలో సంక్షేమం అడ్రస్‌ లేకుండా పోయింది. కార్పొరేషన్లన్నీ మూసివేసే పరిస్థితి వచ్చింది. గ్రామీణ వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైంది’’ అని జగన్‌ సర్కార్‌పై చంద్రబాబు ధ్వజమెత్తారు.

ఆర్థిక ఉగ్రవాది జగన్‌..

‘‘రాష్ట్ర సంపదంతా తన వద్దే ఉండాలనే ఆర్థిక ఉగ్రవాది జగన్‌. అందరూ బానిస జీవితం గడపాలనేది ఆయన ఉద్దేశం. రాష్ట్ర ప్రజలు పేదలయ్యారు.. జగన్‌ ధనవంతుడవుతూనే ఉన్నారు. పేదల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి మద్యం విక్రయిస్తున్నారు. నాసిరకం మద్యం బ్రాండ్లతో ప్రజలను దోచుకుంటున్నారు. గత సీఎంలలో కొందరు అవినీతిపరులు, మరికొందరు అసమర్థులు ఉన్నారు. కానీ, జగన్‌ మాదిరి విధ్వంసం చేసిన వారు మాత్రం లేరు. ఏ సీఎం అయినా మంచిపేరు తెచ్చుకునేందుకు తపిస్తారే తప్ప..  జగన్‌లా వ్యవస్థలపై దాడులు చేయరు. సమావేశాలు పెట్టకూడదని జీవో నంబర్‌ 1 తీసుకువచ్చారు. అనపర్తిలో సమావేశం పెట్టినప్పుడు అడ్డంకులు సృష్టించారు. గతంలో జగన్‌ పాదయాత్ర చేసినప్పుడు ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారు. ఆనాడు మేం తలచుకుంటే పాదయాత్రలు చేసేవారా? జగన్ చెప్పినట్లు పోలీసు వ్యవస్థ నడుచుకుంటోంది.

జగన్‌ ఆడిన నాటకం ఎవరి ఊహకు అందదు..

వివేకా హత్య కేసులో.. హూ కిల్డ్‌ బాబాయ్‌ అన్న ప్రశ్నకు అబ్బాయ్‌ కిల్డ్‌ బాబాయ్‌ అని సీబీఐ అఫిడవిట్‌లో స్పష్టంగా పేర్కొంది. కడప ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంట్లోనే హత్యకు కుట్ర పన్నినట్లు వెల్లడించింది. బాబాయ్‌ను చంపిన విధానం ఎవరూ ఊహించరు. ఈ కేసులో జగన్ గూగుల్‌ టేక్‌ అవుట్‌లో అడ్డంగా దొరికారు. తప్పు చేసి ఇతరులపై నెట్టివేయాలని చూశారు. బాబాయ్‌ను చంపాక ఆనాడు జగన్‌ ఆడిన నాటకం ఎవరి ఊహకు అందదు. ఇలాంటి జగన్ నాటకాలు నమ్మి నరహంతకుడికి ప్రజలు ఓట్లేశారు. ఈరోజు వారి ప్రాణాలకే రక్షణ లేకుండాపోయింది. రాష్ట్రంలో ఐపీసీ చట్టం లేదు.. వైకాపా చట్టం ఉంది. పేటీఎం బ్యాచ్‌ రాష్ట్రాన్ని దోచుకుంటుంటే చూస్తూ ఊరుకోం. జగన్‌ కోసం అధికారులు బలిపశువులు కావొద్దు. పోలీసులు తమ జీవితాలను నాశనం చేసుకోవద్దు. రాష్ట్ర అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రజలను చైతన్యం చేసే దిశగా ముందుకు వెళ్తా. దీనికి ప్రజలు కూడా స్వచ్ఛందంగా కదిలి రావాలి. మధ్యంతర ఎన్నికలకు జగన్‌ సిద్ధమవుతున్నారు. ఎప్పుడు ఎన్నికలు పెట్టినా జగన్‌ను ఇంటికి సాగనంపాలి. అందరూ సమష్టిగా ముందుకెళ్లి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి’’ అని చంద్రబాబు పిలుపునిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని